Idream media
Idream media
మనుషులకైనా , వస్తువులకైనా జీవం , మరణం వుంటాయి. కళకళగా వుండే మనుషులు చూస్తూ వుండగానే కళ తప్పి పోతారు. సంబరం విషాదాన్ని తోడుగా తెచ్చుకుంటుంది. లేత ఆకులు కూడా రాలిపోతాయి. చనిపోయింది పెద్ద వాళ్లైనా , పిల్లలైనా ఆ ఇంటికి అదే దుఃఖం. పదేపదే అదే పనిగా వినిపించే గొంతు ఇక వినపడదు.
ఒక నౌకని చేస్తున్నప్పుడు వేల మంది ఉత్సాహంగా పనిచేస్తారు. అడవిలో పచ్చగా పక్షులతో జీవించిన చెట్లు ఎండుకొయ్యలుగా మారుతాయి. రంపాలు గుండె కోత కోస్తాయి. నౌక నీటిని స్పర్శిస్తున్నప్పుడు ఒక పండగ. జలకాలాడుతుంది. కొన్ని వేల మందిని సుఖ దుఃఖాల్లో ముంచుతూ ప్రవహిస్తుంది. కలుపుతుంది, విడగొడుతుంది, బతుకునిస్తుంది. ఎన్నో చేతుల వీడ్కోలును స్వీకరిస్తుంది. ఒక రోజు వస్తుంది. దిగులుగా తీరం చేరుకున్న నౌక మళ్లీ నీటిని చూడదు. భూమి కనపడకపోతే మనిషికి , నీటిలో వెళ్లకపోతే నౌకకి ఆఖరి రోజులు. శిథిలమవుతున్న నౌకలోంచి పనికొచ్చే భాగాల్ని తీసి ఇంకో నిర్మాణంలో వాడతారు..చాలా ఏళ్ల క్రితం చూసిన షిప్ ఆఫ్ థీసియస్ సినిమా ఇదే.
Also Read:ఈ అడవిలో వేటాడాలి లేదా నిన్ను వేటాడేస్తారు
జ్ఞానమే నిధి. అన్ని గ్రంథాలు ఇవే చెప్పాయి. కానీ నిధి కోసం వేటాడిన సినిమాలు వందల్లో వున్నాయి. జ్ఞానం కోసం అడ్వెంచర్ చేసిన సినిమాలు ఎవరైనా తీశారా? నిధితో జ్ఞానాన్ని కొనొచ్చని ఆశ. కానీ మనిషి నుంచి మనిషికి జ్ఞానమే దక్కింది. నిధులు రాళ్లపాలు.
చిన్నప్పుడు కాలం, దూరం లెక్కలు సులభమనుకుంటాం. అవే కష్టం. కాలంతో పాటు వేగంగా వుండాలనే సూత్రం పుస్తకాల్లో అర్థమైనంత ఈజీగా లైఫ్‌లో కాదు. రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తే అవి దాటడానికి ఎంత టైమ్ పడుతుందనేది మాథ్స్. ఢీకొట్టకుండా చూడడం సైన్స్. రైల్లో వున్నపుడు భూమి కదులుతోందనే భ్రమ. రైలుని చూడకపోయినా ఈ జగత్తంతా భ్రమ, భ్రాంతి, మాయ అన్నాడు శంకరాచార్యులు.
అందమైన చెట్లుంటే పక్షులుండవు. ఆహారం దొరికే చోటే వుంటాయవి. మనుషులు కూడా అంతే. తాజ్‌మహల్ దగ్గర టీ అమ్మేవాడికి సౌందర్యం అనవసరం. బొర్రా గుహల్లో ఫొటో తీసేవాడికి తానొక అద్భుతంలో జీవిస్తున్నానని తెలియదు. కడుపు నిండితేనే ఈస్తటిక్స్ సెన్స్. దాని కోసం మనుషులు పరిగెడుతారు, మృత్యువు ఒక గద్దలా ఎగురుతున్న మహానిర్మాణాల్లోకి. నాగరికత నిర్మాణమంతా ఆకలి రహస్యమే.
Also Read:పులి భోజనం అంటే తెలుసా?
పుట్టినప్పుడు శిశువు ఏడుస్తాడు. అది వాడికి తెలియదు. పోయినపుడు చుట్టూ వున్న వాళ్లు ఏడుస్తారు. అదీ తెలియదు. రెండు ఏడ్పుల మధ్య వుండే చిన్న జీవితంలో నవ్వు ఒక వరం. ఇంకో 10 వేల ఏళ్లు పరిశోధనలు చేసినా ఒక జంతువుతో నవ్వించలేం. మనకు మాత్రమే సాధ్యమైన దాన్ని అసాధ్యంగా మార్చుకోవడం మన ఆర్ట్.
ఊయల చేసే వాడు పసిపాపల నవ్వుల్ని అనుభూతి చెందితే
శవ పేటికలు చేసేవాడు రోదనలు వింటాడు. ఊయల తేలిక. శవపేటిక బరువు.