Idream media
Idream media
విశాఖపట్నంలో భూ బకాసురులపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది. దాదాపు 200 కోట్ల విలువైన 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. అడవివరం నుంచి శోత్యం వెళ్లే మార్గంలో రామ అగ్రహారం వద్ద 110 ఎకరాల చుట్టూ ప్రహరి గోడ కట్టి మొక్కలు పెంచుతున్నారు. ఇందులో పది ఎకరాలు ప్రైవేటు భూమి కాగా.. మిగతా 100 ఎకరాలు ప్రభుత్వ భూమి.
అయితే టీడీపీ ప్రభుత్వ హాయంలో ఈ భూమిపై పెద్దల కన్ను పడింది. వెంటనే అనుచరులను రంగంలోకి దింపి భూమి చుట్టూ ప్రహరి కట్టించారు. కొంత భాగంలో పేదలు ఇళ్లు కట్టుకున్నట్లుగా తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. ఈ ఆక్రమణలను రెవెన్యూ అధికారులు ఈ రోజు తొలగించి.. భూమిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో ఇప్పటికే భూ ఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ప్రజాప్రతినిధి అనుచరులే ఈ భూ భాగోతంలో ఉన్నారని గుర్తించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూముల స్వాధీనంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆక్రమణలలో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు.
పేదలకు ప్రభుత్వమే ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు కట్టించి ఇస్తోందని.. పేదల పేరు చెప్పి పెద్దలు చేసే భూ ఆక్రమణలపై ఉక్కు పాదం మోపుతామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. భూ ఆక్రమణల విషయంలో స్వపక్షం, విపక్షం అనే తేడా ఏమీ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల ఫిర్యాదు మేరకు ఎక్కడ ఆక్రమణలు బయటపడినా ఉపేక్షించేది లేదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.