Idream media
Idream media
ఒకవైపు టీఆర్‌ఎస్ పక్షాలు.. మరోవైపు విపక్షాలు.. ఒకరు షట్టర్ ముయ్.. అంటే మరొకరు షట్టర్ తీయ్.. అంటూ హల్‌చల్ చేశారు. ఇదంతా ఏ భారత్ బంద్ సందర్భంగానో కాదు.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.. చేర్యాల పట్టణంలోని పెద్ద చెరువు మత్తడి సమీపంలోని 20 గుంటల స్థలాన్ని ఆక్రమించారంటూ చెలరేగిన వివాదం. ఎమ్మెల్యే కబ్జాపర్వంపై విపక్షాలు ఏకంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఎమ్మెల్యే ఆక్రమించారంటూ చెబుతున్న స్థలంలో నిర్మాణాలను సైతం కూల్చివేశాయి. ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, రెవెన్యూ డివిజన్ జేఏసీ, ఫార్వర్డ్‌బ్లాక్, తెలంగాణ మాలమహానాడుకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కదంతొక్కారు. దీంతో చేర్యాల బంద్ ఉద్రిక్తంగా మారింది.
ఉద్రిక్తతకు కారణమిదే..
సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు మత్తడి ప్రాంగణంలోని సర్వే నంబరు 1402లో అర ఎకరం పట్టాభూమి ఉంది. చాలాకాలంగా ఖాళీగా పడి ఉండటంతో అక్కడ పశువుల సంత నిర్వహించేవారు. లారీ యాజమానులు తమ వాహనాలను నిలుపుకొనేవారు. కొందరు చిరువ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. కాగా 2013లో ఈ భూమిని పట్టాదారులైన అజీజ్ అహ్మద్‌నూర్ కుటుంబం, వసీమ్‌ఖాన్, కృష్ణారెడ్డికి విక్రయించింది. వెంటనే ఆ స్థలం చుట్టూ వారు ప్రహరీ నిర్మాణాన్ని ప్రారంభించగా విపక్ష నాయకులు అడ్డుకున్నారు. ఈ భూమిని గత జనవరిలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురు తుల్జా భవానీరెడ్డి, ఎమ్మెల్యే బంధువులైన మారుతీప్రసాద్, జితేందర్‌రెడ్డి కొనుగోలు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు తోడు తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి గోదావరి నీటిని విడుదల చేయడంతో రెండుమూడు రోజుల పాటు చెరువు అలుగు పోసింది. ఆ వరదంతా మత్తడికి పక్కనే ఉన్న ప్రధాన రహదారిగుండా పొంగి ప్రవహించింది. దీంతో అక్కడి ప్రజలు, రోడ్డుపక్కన వర్తక, వాణిజ్య వర్గాలవారు ఇబ్బందులు పడ్డారు. ఆ వర ద నీటిని మళ్లించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సంకల్పించారు. పెద్ద చెరువు నుంచి అలుగు పోసే ఈ నీటినంతా కాలువ ద్వారా సమీపంలో ఉన్న కుడిచెరువుకు తరలించాలని నిర్ణయించారు.
ఎమ్మెల్యేపై ఆరోపణలు…
మత్తడి నుంచి నేరుగా కాలువ నిర్మిస్తే తన కూతురు కొనుగోలు చేసిన స్థలం మొత్తం కాలువకు వదలాల్సి ఉంటుందనే ఉద్దేశంతో కాస్త పక్కకు జరిపి కేవలం వెయ్యి గజాల స్థలం మాత్రమే కోల్పోయేలా కాలువను ముత్తిరెడ్డి డిజైన్ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే మత్తడి ప్రవాహ నీటి మళ్లింపును చెరువుకట్టను ఆనుకుని చేపడుతున్నారంటూ ప్రతిపక్ష నాయకులు నిరసన వ్యక్తం చేశారు. చెరువును ఆనుకుని కాకుండా ముత్తిరెడ్డి ఆక్రమించిన 20 గుంటల స్థలం మధ్య నుంచి నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇరిగేషన్ ఉన్నతాధికారులకు, లోకాయుక్తలోనూ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే స్థల యజమానులు తమ స్థలం చుట్టూ సిమెంట్ పలకలతో ప్రహరీ పనులు ప్రారంభించారు. ఈ పనులను అడ్డుకోవడంలో భాగంగా స్థానిక ప్రతిపక్ష నాయకులు శుక్రవారం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై ఆరోపణల వర్షం కురిపించారు. బినామీలతో పెద్ద చెరువు మత్తడి ప్రవాహ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మాణం సాగిస్తున్నారని మండిపడ్డారు. పెద్దచెరువుకు ముప్పునెలకొని పట్టణం మునిగిపోయే ప్రమాదం ఉందని వాపోయారు. పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యానికి పాల్పడుతూ అఽధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా : ముత్తిరెడ్డి
పెద్దచెరువు మత్తడి స్థలాన్ని తాను కబ్జా చేశానని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, నిరూపిస్తే జనగామలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ముక్కు నేలకు రాస్తానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సవాల్ చేశారు. చెరువు మత్తడి దూకినప్పుడు ఆ నీళ్లు రోడ్డుమీదికి రావడంతో శాశ్వత పరిష్కారం చేయాలని ఐబీ అఽధికారులకు సూచించానని తెలిపారు. చెరువు చెంతనే ఉన్న పట్టా స్థలం నుంచి నీళ్లు పోతున్నాయని, కాలువ నిర్మాణానికి 10గుంటల స్థలం ఇవ్వాలని సదరు స్థలం యజమానిని కోరితే ఇవ్వనన్నారని తెలిపారు. స్థలం మొత్తం కొనుగోలు చేస్తే ఇస్తానని స్థలం యజమాని అనడంతోనే తన కూతురు, బంధువులు కొనుగోలు చేశారని, తనను నమ్ముకున్న పట్టణ ప్రజల ప్రయోజనం కోసం కాలువ నిర్మాణానికి ఆ పట్టా భూమి నుంచి వెయ్యి గజాల స్థలాన్ని విరాళంగా ఇచ్చామని ఎమ్మెల్యే వివరించారు.