iDreamPost
iDreamPost
ప్రస్తుతం రాధే శ్యాం షూటింగ్ లో ఉన్న డార్లింగ్ ప్రభాస్ అది పూర్తి కాగానే వెంటనే ఆది పురుష్ సెట్స్ లో జాయిన్ అవుతాడు. తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రామాయణ గాధ ఆధారంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా కన్ఫర్మ్ అయిన క్యాస్టింగ్ లో సైఫ్ అలీ ఖాన్ పేరొక్కటే బయటికి వచ్చింది. తాజాగా మిగిలిన పాత్రలకు కూడా ఒక్కొక్కరిని సెట్ చేస్తున్నారు. ముఖ్యంగా సీతగా ఎవరు చేస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో విపరీతంగా ఉంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కృతి సనన్ నే ఫైనల్ చేయొచ్చని చెబుతున్నారు. తన పేరు పరిశీలనలో ఉందని చాలా రోజుల క్రితమే ఐడ్రీం చదువరుల దృష్టికి తీసుకొచ్చింది.
ముంబై కథనాల ప్రకారం కృతిని ఫిక్స్ చేశారని మంచి టైం సందర్భం చూసుకుని అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు. ముందు కియారా అద్వానీ పేరు ఎక్కువగా వినిపించింది. కానీ ఎందుకో మరి ఆ తర్వాత ఎలాంటి సమాచారం లేదు. దీపికా పదుకునే ఆల్రెడీ నాగ అశ్విన్ ప్రాజెక్ట్ లో ప్రభాస్ కు జోడిగా చేస్తోంది కాబట్టి తనను పరిగణనలోకి తీసుకోలేదు. పాన్ ఇండియా మూవీ కనక ఇక్కడి హీరోయిన్లను తీసుకోవడానికి నిర్మాణ సంస్థ టి సిరీస్ సుముఖంగా లేదని తెలిసింది. అందుకే కృతిని ఈ అదృష్టం వరించినట్టు కనిపిస్తోంది.
ఇప్పుడిది నిజమైతే బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే. తెలుగులో గతంలో మహేష్ బాబు 1 నేనొక్కడినే, నాగ చైతన్య దోచేయ్ లో నటించిన కృతికి ఇక్కడ ఆఫర్లు అట్టే కలిసి రాలేదు. పోనీ బాలీవుడ్లో అయినా దూసుకుపోయిందా అంటే అదీ లేదు. సినిమాలైతే వస్తున్నాయి కానీ టాప్ రేంజ్ కి వెళ్లలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఆది పురుష్ ఛాన్స్ అంటే బంగారు బాతు దొరికినట్టే. వచ్చే మూడు నాలుగేళ్ళకు సరిపడా షెడ్యూల్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్ ఇంకో రెండు సినిమాలు చర్చల దశలో పెట్టాడు. అన్నట్టు ఆది పురుష్ లో లక్ష్మణుడు, శూర్పణఖ లాంటి కీలక పాత్రలకు తగ్గ నటీనటులను ఎలా సెట్ చేస్తారో వేచి చూడాలి మరి.