iDreamPost
android-app
ios-app

మహాప్రభో.. హెల్త్‌డ్రింక్‌ జవహర్‌ మాకొద్దు..

మహాప్రభో.. హెల్త్‌డ్రింక్‌ జవహర్‌ మాకొద్దు..

బీరును హెల్త్‌డ్రింక్‌గా ప్రమోట్‌ చేసి అప్పట్లో వార్తల్లో నిలిచిన మాజీ మంత్రి జవహర్‌కు ఇప్పుడు ఎక్కడ లేని కష్టాలు వచ్చిపడ్డాయి. గతంలో గెలిచిన కొవ్వూరుకు, గత ఎన్నికల్లో ఓడిన తిరువూరుకు మధ్య ఊగిసలాటలో పడిపోయారు. ఎక్కడికి వెళ్దామన్నా అక్కడి కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు. గతంలో చేసిన అక్రమాలు, క్యేడర్‌ మధ్య ఈయన పెట్టిన చిచ్చులే ఈ పరిస్థితికి కారణమని ఆయన అనుచరులే చెప్పుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి కేఎస్‌ జవహర్‌ 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మంత్రి పదవి రూపంలో అదృష్టం తలుపు తట్టింది. ఎక్సైజ్‌ మంత్రిగా రాజభోగం అనుభవించారు.

అయితే.. ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఉన్న ఈయన్ను తీసుకొచ్చి కొవ్వూరులో నిలబెడితే గెలిపించిన స్థానిక నాయకులను, కార్యకర్తలను మాత్రం చిన్నచూపు చూడడం మొదలుపెట్టారు. గ్రామాల్లో వర్గాలను పెంచి పోషించారు. విచ్చలవిడిగా బెల్టుషాపులను తనవారిచేత పెట్టించి బాగా డబ్బు వెనకేసుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ ఐదేళ్ల పాటు భరించిన స్థానిక నేతలు 2019 ఎన్నికల్లో తిరుగుబాటు చేశారు. జవహర్‌ను కొవ్వూరు నుంచి పోటీ పెడితే ఓడించి తీరుతామని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. దీంతో చేసేది లేక ఆయన్ను కృష్ణా జిల్లా తిరువూరు నుంచి పోటీ పెట్టారు. కొవ్వూరు నుంచి వంగలపూడి అనితను పోటీ చేయించారు. రెండు చోట్లా టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు.

ఓటమి తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న జవహర్‌ ఇప్పుడు మళ్లీ కొవ్వూరు వైపు చూస్తున్నారు. అయితే కార్యకర్తలు మాత్రం గత పరిస్థితులను మర్చిపోలేదు. జవహర్‌ను నియోజకవర్గానికి దూరంగా ఉంచాలంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో స్థానికంగా పరిస్థితులను చక్కబెట్టడానికి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, సీనియర్‌ నాయకుడు పెండ్యాల అచ్చిబాబుకు చంద్రబాబు బాధ్యతలు అప్పజెప్పారు. వారు వచ్చి అసంతృప్త నేతలతో మాట్లాడినా జవహర్‌ను నియోజకవర్గంలో రానివ్వడానికి ససేమిరా అన్నారు. పోయిన గురువారం స్థానిక నాయకులంతా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని .. ఆయనకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. వర్గాలను ప్రోత్సహించే జవహర్‌ను కొవ్వూరుకు ఇంచార్జిగా ప్రకటిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని తేల్చిచెప్పారు. దీంతో జవహర్‌ కొవ్వూరుకు వెళ్లలేక.. తిరువూరులో ఉండలేక సతమతమవుతున్నారు.