కొండపొలం – జ్ఞాపకాల తడి

కొండ పొలానికి వెళ్ళడానికి, తిరిగి వచ్చాక ఆ జ్ఞాపకాల తడి ఆరబెట్టుకోవడానికి, ఆ మార్మికత నుండి బయటకు రావడానికి చాలా ధైర్యం కూడగట్టుకోవలసి వచ్చింది. నాతో పాటు నా పదేళ్ళ కొడుకునీ తీసుకుపోయాను. గత వారం రోజులుగా ఇదే అర్నవ్ బెడ్ టైం స్టోరీ. నేను కథ చెబుతుంటే, తన నుండి వచ్చిన ప్రశ్నలు, సంశయాలు, ఎగ్జయిట్ మెంట్ చూస్తుంటే ఈ కథ గొప్పతనం మరో మారు రుజువయింది. అందులోనూ నాకు చాలా ఇష్టమయిన సీమ మాండలీకం. పోయినసారి చదివిన తానా బహుమతుల కథల పదను హృదిలో మెదులుతుండగానే, ఈ కొండపొలం ఒక అలౌకిక లోకంలోకి తీసుకు వెళ్ళింది. కొండలూ, గుట్టలూ, చుక్కలూ, వెన్నెల పాపడూ , చిరు చినుకులు , వాటితో పునీతమయిన పచ్చందనమూ, రౌద్రం గా చూస్తున్న పులి, ఇవే కదా నన్నూ మరగేసుకున్నవి, ముప్పిరిగొన్న మోహంలో పడేసింది.

తనకు ఉద్యోగం రాకపోడానికి ముఖ్య కారణం తనలో ఉన్న పిరికితనమూ, భయమూ అని తెలుసుకుని, నోరు లేని మూగ జీవులతో, కఠిన నియమాలు పాటిస్తూ కొన్ని రోజులు సావాసం చేస్తే అవన్నీ వొదిలించుకోవచ్చనే తాత మాటలు విని కొండపొలానికి బయలుదేరతాడు బీటెక్ చదివిన కధానాయకుడు రవి. ఎండ మొహం చూడని వాడు, రాళ్ళల్లో, కంపల్లో నడక అలవాటు లేనోడు పట్నవాసానికి పూర్తి విరుద్ధమయిన అడవిలో యాభై రోజుల పాటు తాత చెప్పినట్లుగానే భయం, బేలతనాన్ని వదలి , అడవితల్లిని కాపాడుకోవాలనే అనురక్తితో , అటవీశాఖ అధికారి జీవితాన్ని ఎంచుకుంటాడు.

పులి వచ్చి గొర్రెల్ని తినేస్తదేమో అని గుబులు పడ్డ అతనితో , “అది మనకాడికి రాలే, మనమే దాని తావుకు వచ్చినాము. ఒక జీవి పుల్లరి అయినా కట్టాలిందే కదా”, అన్న తండ్రి మాటల్లోని ఆంతర్యాన్ని అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తాడు.

Also Read: కొండపొలం యాత్ర

మనలోని భయాన్నివిదిలించుకుంటే , అడవిలోని అందాలన్నీ చూడవచ్చనీ, అయినా భయం వుండాల్సింది నక్క నోటి జీవాలకు కానీ, వాటి ప్రాణం నిలబెట్టటానికి వచ్చిన మనుషులకు ఉండకూడదనీ , నీ మెడ గట్టిగుంటే మిగతా వంద జీవుల ప్రాణాలు గట్టిగా ఉంటాయనీ, లోపల ఉన్న భయాన్ని పారద్రోలితే ఎంతటి ఆపతినయినా ఎదుర్కోవచ్చనీ ఉద్బోధ చేస్తున్న తండ్రిని అబ్బురంగా చూస్తాడు రవి.

మూగజీవాలకు, మనుషులకు సుట్టరికాలు వుండాలె కానీ, అడవిలో చెట్టునీ, జీవాన్ని చంపడం న్యాయం కాదనీ అన్న తండ్రి మాటలు ఆలోచింపజేస్తాయి. మనిషికీ, జంతువుకీ తేడా లేకుండా తండ్రి చూపించే వాత్సల్యం అతన్ని కట్టిపడేస్తుంది.

జంతు సామ్రాజ్యంలోకి వెళ్ళిన మనుషులు పరిహారంగా పన్ను చెల్లించడం అటవీ న్యాయం కానీ, వాటిని చంపాలనుకోవడం కాదు కదా అనే స్పృహ కలుగుతుంది రవికి.

తనతో పాటు కొండపొలం చేయడానికి వచ్చిన స్నేహితుడు అంకయ్య, పుట్టింట్లోనే అలిగి వుండిపోయిన భార్య సుభద్ర తో మాట్లాడే సంభాషణ విన్న మనకూ గుండె బరువెక్కుతుంది. గొర్రె కాన్పునూ, తన భార్య కాన్పునూ పోల్చుతూ , మనకు ఆసుపత్రులూ, డాక్టర్లూ వుండి కడుపు కోసి బిడ్డనూ, తల్లినీ బతికించారు. మరి ఆ గొర్రెకు ఏ డాక్టర్లుండారు ! అరిచి అరిచి చచ్చిపోయే అని చెబుతున్నపుడు మన మనసూ మూగగా రోదిస్తుంది.

మనల్ని నమ్ముకోని వచ్చిన వాళ్ళ కోసం మనం పస్తులుండి అయినా వాటి ఆకలి తీర్చాలే అంటూ తండ్రి అర్ధాకలితో ఉండడాన్ని , తాను గ్రహించలేకపోవడాన్ని తెలుసుకుని మనసులోనే మధనపడతాడు రవి.ఆలూ మగల మధ్య ప్రేమ అర్ధం కావాలంటే, తన భార్యను మనస్పూర్తిగా ప్రేమించి, ఇంటి పెత్తనమూ, ఒంటి పెత్తనమూ, నిర్ణయాధికారమూ ఆమెకే అప్పగించాలనే ఆలోచనే మధురంగా ఉంటుంది.

వాటి ఇలాకలోకి వెళ్లాం కనుక, జంతువులకు హాని కలిగించకుండా, ఓ గొర్రెను పుల్లరిగా చెల్లించడమే అటవీ న్యాయమనీ, తనని కాపాడుకోడానికే గాయపరిచి చంపకుండా వదిలేసిన కథానాయకుడిని ఏమీ చేయకుండా వదిలేసి వెళ్లిపోయిన పెద్దనక్క చూపించిన జంతు న్యాయాన్ని కళ్ళకు కట్టినట్లు హృద్యంగా చూపిస్తారు రచయిత.

ఏ అడవుల వల్లనయితే సమస్త జీవానికీ ప్రత్యక్ష, పరోక్ష లాభాలు కలుగుతున్నాయో, ఆ అడవుల్లోకి అక్రమంగా వెళ్లి చందనపు చెక్కల్ని కొట్టి, నేరాన్ని అమాయకపు యానాదుల మీదకు నెట్టి , క్రూర జంతువుల రూపంలో ఉన్న పోలీసులు వారి ఇళ్ళ మీద దాడి చేసి , వాళ్ళను జైలు జీవితానికి పరిమితం చేయడంలో పాత్ర ధారులయిన బడా బాబులు, ఆ నేలలో గంజాయి మొక్కల్ని పెంచి మూగ జీవాల చావుకు కారణమవుతున్న మనిషితనపు న్యాయం మృగ్యమవుతున్న విషయాన్నీ కూలంకషంగా చర్చిస్తారు.

మెట్రో జీవితంలో పడి మనమేం కోల్పోతున్నామో తెలియజెప్పిన గొప్ప రచన ఈ కొండపొలం. అసలు కొండపొలం అనే పేరుకి అర్ధమే తెలియని నాలాంటి వాళ్ళని ఓ ఆరుబత్తేల కాలంలో గొర్రెల పట్ల మర్లు, అమ్మతనం నిండిన అద్భుత వనరయిన అడవిని, క్రూర జంతువులయినా వాటికీ న్యాయం ఉంటుందనే విస్మయం కలిగించే సంఘటనలనూ పరిచయం చేసిన రచయిత సన్నపు రెడ్డి వెంకటరామిరెడ్డి గారికి పాదాభివందనాలు. ప్రతీ ఒక్కరూ చదివి ఆ అనుభూతిని ఆస్వాదించి మదిలో నిక్షిప్తం చేసుకోవలసిన నవల.

Show comments