Idream media
Idream media
“కొండపొలం”-ఇపుడే ముగించా..అపుడే ముగిసిందా..అని అన్పించింది.కొండపొలం అడవికి పర్యాయపదం.అడవి మానవ పరిణామం జరిగిన చోటు.చతుష్పాది..ద్విపాది అయ్యి తన పరిశీలనాశక్తితో ,సృజనశీలతతో అనేక నాగరికతలకు ఆదిమమానవుడు క్రమానుగతంగా నాంది పలికిందీ ఇక్కడే..అడవి నుంచి మానవుడు నాగరిక ప్రపంచాన్ని సృష్టించుకున్నా…అంత అందమైన దాన్ని నేటికీ సృష్టించలేకున్నాడు..అడవి..ఓ ప్రాకృతిక వ్యవస్థ.అందులో తాత్వికత.,పరిసరాణుగుణ్యత.,అంతఃసంబంధాలు..పరస్పరసహకారత ఇలాంటి ఎన్నో అంశాలు నిబిడీకృతమై యుంటాయి.ఆ అడవితో నేటికీ మమేకమైన మానవజీవితాలున్నాయి..వారిని అడవి అమ్మలాగా పొదుముకుంటూనే ఉంది.అడవి ఓ అద్భుతమైన వనరు..భావుకులైన కవులకూ..భావోద్వేగాలున్న మనసున్న మనషులకూ..
తానా నవలా పోటీల్లో ఏకైక ఉత్తమ నవలగా”కొండపొలం” ఎందుకు ఎంపికైందో అందులో తిరగాడితే కానీ తెలీదు.ఈ నవల గొర్లకాపర్ల జీవనయానాన్ని..అందులోని శ్రమైకజీవన సౌందర్యాన్ని..పాఠకుల ముందుకు చేర్చడంలో సఫలీకృతమైంది.ఇందులోని పాత్రలు మనముందు తిరుగాడేవే ఐనా..రచయిత వారి జీవితాల్లోని స్వఛ్ఛతను., అమాయకత్వాన్నీ.,హాస్యచతురతనీ .,పల్లె మాటల విరుపుతో అద్భుతంగా పంచారు..రవీంద్ర పాత్ర పిరికితనాన్ని పోగొట్టుకుని..ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకునేందుకు అవసరమైన సన్నివేశాలు నిజంగా పాఠకున్ని రోమాంచితం చేస్తాయి.అడవిపై ఆధారపడడమే గాని ఆపద తలపెట్టని పల్లీయుల గొర్ల కాపర్ల తాత్వికత..పులికి మంద నుంచో జీవాన్ని పుల్లరిగా ఇవ్వాలనుకోవడం..వారి త్యాగశీలత కు కృతజ్ఞతి కీ ఓ నిదర్శనం..ఇప్పటికీ పల్లెల్లో గొర్లకాపర్లు కులంతో సంబంధం లేకుండా ఉన్నారు..గతంలో ఉండెవారు..గ్రామాల్లో వారి మధ్య ఉన్న ఆత్మీయతల్నీ..గొప్పగా దృశ్యమానం చేసింది ఈ కొండపొలం.
అంకయ్య ప్రేమ లోని స్వఛ్ఛతను., బాధ్యతలు బంధాలను అధిగమించడానికి కారణాలను..గురప్ప.తన కొడుకైన రవికీ అడవిలో మెలగవలసిన తీరును చెప్పినపుడు..ఒక తండ్రి తన కొడుకును విజయంవైపు ఎలా సాగాలో తెలియజేయడం గొప్పగా ఉంది.నిజమే మరి తండ్రికంటే గొప్పగా ఎవరు వ్యక్తిత్వ వికాసాన్ని ఇవ్వగలరు..అలాగే. చదువొక్కటే నేర్వక.తమ తలితండ్రులు చేసె పనులను చేయండని యువకులకు రవిపాత్ర ద్వార చెప్పించడం నేటియువతకు గొప్ప సందేశం ఇవ్వటమే..
ఇక అడవిలో గొర్లకాపర్ల జీవనవిధానాన్ని వారు వారి మందల్ని కాపాడుకొనె క్రమంలో చేసే సాహసాల్ని.. ఎత్తుగడల్నీ.. అనుభవజ్ఞుడైన పుల్లయ్య ద్వారా.తెలియజేయడం..ఒకరకంగా అందరికీ అన్నదాతలైన అడవుల్ని నాశనం చేస్తున్న స్వార్థపరుల ఆటలను గురించీ రచయిత అద్భుతంగా రాశారు. అడవి యొక్క అందాలనూ అణువణువూ ఎంతో అందంగా అక్షరాలతో చిత్రీకరించారు..ఇక వారికెపుడు ఇష్టమైన శ్రీ కాశీనాయన ప్రస్తావన ఇందులో కూడా ఉంది..వీరికి సుపరిచితాలైన అనేక కొండ బోడులూ.,అడవి మొక్కలపేర్లూ.,అడివిని ఆధారమూ., ఆఛ్ఛాదన చేసుకున్న యానాదులూ..గురించి చేసిన వర్ణన లో రచయిత కలం కదం తొక్కింది..పసరు గక్కే చెట్ల గురించీ..అడవి గురించీ..దాని హరితతత్వాన్ని గురించీ..ఆదుకునే గుణాన్ని రాయడం అమోఘం గా ఉంది.మందలోని ఎదకొచ్చిన గొర్రెల ప్రవర్తనా..బొల్లి గొర్రెపిల్ల తల్లి ని కోల్పోయినపుడు దానిని ఇంకో గొర్రెకు దత్తతనిచ్చే తీరు గొర్ల కాపర్ల తదానుభూతి కి ఉదాహరణ..
అడవి వర్ణనలో రచయిత సూక్ష్మ పరిశీలనాదృష్టి అద్భుతంగా ఉంటుంది..పులినీ..బెట్టెడుతను..నేండ్రగడ్డినీ,, మహావృక్షాన్నీ..అన్నింటిపై సమదృష్టి సారిస్తాడు.అందు వలనే అడివి అన్ని అందాలతో అలరారింది..ఒక చోట నిశ్శబ్దాన్నీ శ్రావ్యగీతంగా పేర్కొనడం వారికే చెల్లింది.ఆకాశాన్ని ఉతికేసిన నీలం రంగు ముత్యాల చీర గా వర్ణించడం ఎంత మధురంగా ఉందో.రవిని కర్తవ్యోన్ముఖుడిని చేయడానికి ఈ కొండపొలం సృష్టించబడింది.. రవి నేటి యువతరానికి ప్రతీక..వారు విరివిగా చదివితే కొండపొలానికి సాఫల్యత.
ఇక నవలాయానం లో మనకు తారస పడే ప్రతీ పాత్ర పల్లె తో పరిచయమున్న వారికి దగ్గరైనదె..అడవిలో గొర్ల కాపర్లు ఎంత సన్నధ్ధతతో ఉండాలో.తమపై ఆధార పడిన ఏ జీవి పానాలెలా కాపాడుకోవాలో..అన్న తపననూ. విశ్వసనీయత నూ.. మానవీయతను అడవి నేర్పడం..చాలా గొప్పగా ఉంది.
అడవి ఓ భయం కాదు..ఓ ఆసరా..ఎంత గొప్ప నిర్వచనం.. వర్షం వెలిసింతరువాత అడవి కొత్త గుడ్డలు కట్టుకున్న పెళ్ళికూతురు లా ఉంది అనడం .. అలాగే తమ పై ఆధారపడిన గొర్లకోసం..తాము ఆధారమైన కుటుంబాలను వీడి.. అడివి కౌగిలిలో ఒదగడం..బత్తేల మనుషుల ద్వారా..క్షేమ సమాచారాలుసుకోవడం..తమ తోటివారి మరణాల పట్ల హృదయపూర్వక సానుభూతిని ప్రకటించడం.. మందనుండి కోల్పోయిన జీవాల పట్ల దుఃఖితులు కావడం..ఓ అద్భుతమైన భావనల సమాహారం..
ప్రతిఫలాపేక్ష లేని తరుసంపదల్ని కల్గిన అడవుల నాశనం..మానవాళికి శానమనీ..మానవ దుశ్చర్యల వలన కోల్పోయిన అడవి హరితాన్ని పునరుద్ధరణ చేసే బాధ్యత ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు తీసుకోవాలని.. అలాంటివారికి అత్యున్నత పురస్కారం అందించాలని రవి ద్వారా రచయిత అభిలషించడం..గొప్ప..భావన..
క్షంతవ్యున్ని..ఇప్పటికే సుధీర్ఘంగా సమీక్షించాను..అన్ని అంశాలనూ ప్రస్తావించాలనే తపన ఉంది..కానీ..తెలుగు జాతీయాలతో..పల్లె పెదాలనుండి అలవోకగా దొరలే పదాలతో..కొండ సెలయేళ్ళలో పారే స్వఛ్ఛమైన నీటిలాంటి వర్ణనలతో కొండపొలం మీరూ చదవాలిగా…చదవండీ..ఓ మధురానుభూతిని పొందుతారు..జుంటితెనె తిన్న తృప్తిని కలిగిస్తుందీ..కొండపొలం..ఎందుకూ..ఆలస్యం.
Written By –Gajendra Nath