iDreamPost
android-app
ios-app

కలానికి దక్కిన గౌరవం – కొండపొలం

కలానికి దక్కిన గౌరవం – కొండపొలం

ఒక నవల సినిమాగా రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలానే వచ్చేవి గానీ ఈ మధ్య ఆ ప్రవాహం కొంచెం తగ్గింది అంతే. ఆ మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అ ఆ అనే సినిమా వచ్చింది. ఆ తర్వాత నవీన్ గారు రాసిన అంపశయ్య నవల ఆధారంగా ప్రకాశ్ జైనీ దర్శకత్వంలో క్యాంపస్ అంపశయ్య అనే సినిమా వచ్చింది.

ఇంకా అంటే ఆలోచించాల్సిన పరిస్థితి. ఇలా ఎందుకని సినిమా దర్శక, నిర్మాతలను అడిగితే నవల అనేది రచయిత కోణంలో సాగుతుంది కాబట్టి ఎలాగైనా రాసుకోవచ్చు అదే సినిమాగా తీయాల్సి వచ్చినప్పుడు ప్రేక్షకుని దృష్టి కోణంలో కొన్ని పరిమితులు ఉంటాయి అంటుంటారు.

అయితే ఆ అంతరాన్ని చెరిపేస్తూ నవల యొక్క మూల కథకు గానీ నేపథ్యానికి గానీ ఎక్కడా మార్పులు లేకుండా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడం నిజంగా ఆ నవలకు దక్కిన గౌరవమే. దక్కిన అనేకంటే ఆ నవల సాధించిన గౌరవం అనడం సముచితమేమో.

అదే కడప జిల్లాలోని బద్వేలు తాలూకా నల్లమల తూర్పు పాదపు ప్రాంత పల్లెల్లోని గొర్రెల కాపర్ల జీవన స్థితిగతులపై, కరువు గాలంలో వాటెకు మేత దొరకని పరిస్థితుల్లో ఆ గొర్లను తోలుకుని అడవుల్లోకి వెళ్లి తిండికి నీళ్లకు ఉగ్గబట్టుకుని, ఎడగండ్లు, పులులు వంటి క్రూర జంతువుల దాడులకు వెరవక సాగించే బతుకు పోరాటం మీద ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి గారికి 2019 తానా నవలల పోటీలో బహుమతి తెచ్చిన కొండపొలం నవల.

ఆ నవలని మంచి సాహిత్యాభిలాష కలిగిన డైరెక్టర్ క్రిష్ తీసుకోవడం, సినిమాటిక్ లిబర్టీ కోసం జరిగే మార్పుల చేర్పులకై నవలా రచయతనే సంప్రదిస్తూ సినిమాగా తెరకెక్కించడం వల్ల నవలకు సంబంధించి మూల కథను అలాగే ఉంచడం అనేది మంచి పరిణామమే.

నవల పరంగా చూస్తే పూర్తిగా రాయలసీమలోని కడప మాండలికంలో సాగుతుంది. పల్లెల పేర్లు గానీ, కొండల్లోకి వెళ్లే దారులు గానీ, నల్లమల అడవుల్లోని కొండలు, బోడుల పేర్లు గానీ అన్నీ వాస్తవాలే.

ఆ నవలలో ప్రస్తావించబడిన ప్రదేశాలను దర్శిస్తూ ‘కొండపొలం యాత్ర’ పేరుతో 2020 ఫిబ్రవరిలో నవలా రచయిత ఆధ్వర్యంలో 15 మంది సభ్యులం కలిసి నల్లమల తూర్పు ప్రాంతమైన జ్యోతి క్షేత్రం(కాశినాయన) నుండి గరుడాద్రి(రాత్రి బస), పాములేటి నరసింహా మీదుగా ఆహోబిలానికి కాలి మార్గాన చేరుకోవడం సరికొత్త సాహసానుభూతినిచ్చింది.

సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ లో మరో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ “నవలకు సినిమాకు మధ్య అవినాభావ సంబంధముంది. అప్పట్లో నవలలు సినిమాగా రావడం సాధారణమే గానీ ఈ మధ్య చాలా తగ్గిపోయింది. ఆ అంతరాన్ని చెరిపేసేలా సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారు రాసిన ఈ కొండపొలం నవల తిరిగి ఆ వారధిని నిర్మించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పడం” నవలా సాహిత్యం పట్ల గౌరవాన్ని పెంచేదిగా ఉంది.

కొండపొలం నవలను ఇంగ్లీష్ లోకి అనువాదం చేయడానికి ఒక ప్రముఖ ముద్రనా సంస్థ చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఇది నిజంగా ఆ నవల సాధించిన గౌరవమే.

కొండపొలం రిలీజ్ అయ్యి ప్రేక్షకుల మనసులు గెలుచుకుని హరీష్ శంకర్ గారన్నట్టు నవలకి సినిమాకి మధ్య వారధిని చెరిపెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటూ చిత్ర యూనిట్ సభ్యలందరికీ శుభాకంక్షలు.