iDreamPost
iDreamPost
నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఒకప్పుడు స్టార్ హీరోలకు పోటీ ఇచ్చే స్థాయిలో కామెడీ సినిమాలతోనే ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న జ్ఞాపకాలు అప్పటి యూత్ కి ఇంకా సజీవంగానే ఉంటాయి. ముఖ్యంగా 80, 90 దశకాల్లో వచ్చిన అద్భుత చిత్రాలు ప్రధాని పివి నరసింహారావు లాంటి వాళ్ళను కూడా మెప్పించాయంటే ఏ స్థాయిలో ఇవి ఎంటర్ టైన్ చేశాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఒక ఆణిముత్యమే కొబ్బరిబొండాం. ఆ విశేషాలు చూద్దాం. దర్శకుడు కావడానికి ముందు ఎస్వి కృష్ణారెడ్డి హీరో కావాలనే లక్ష్యంతో విశ్వప్రయత్నాలు చేశారు. మదరాసు చేరి నటన, డాన్సులో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు. చిరంజీవి కిరాతకుడు లాంటి పెద్ద సినిమాల్లో వేసిన చిన్న వేషాలు ఎలాంటి ప్రయోజనం కలిగించలేదు. దీనికన్నా ముందు పగడాల పడవ అనే సినిమా తీస్తే రిలీజ్ కాలేకపోయింది.
ఇన్ని సాధకబాధల్లో ఉండగా ఎస్వి కృష్ణారెడ్డికి తన అరవల్లి బాల్య మిత్రుడు అచ్చిరెడ్డి తోడయ్యారు. జీవనోపాధి కోసం హైదరాబాద్ లో స్వీట్ల వ్యాపారం చేశారు. బాగానే నడిచింది కానీ మనసు సినిమా మీద ఉండగా ఇతర వ్యాపకాలు ఎలా వంటబడతాయి. దీంతో డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేసే వ్యాపారంలో దిగారు. నగేష్ సర్వర్ సుందరం, మమ్ముట్టి సూర్య ది గ్రేట్-దర్యాప్తు లాంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు. బాగానే ఆడాయి. కోటిలో మనిషా పేరుతో వీడియో క్యాసెట్ల బిజినెస్ కలిగిన కిషోర్ రాఠీ వీళ్లకు అండగా నిలిచారు. నిర్మాతల దగ్గర హక్కుల కొనుగోలు విషయంలో ఎస్వి అచ్చిరెడ్డిలు చురుకుగా వ్యవహరించి సంస్థకు మంచి సినిమాలు వచ్చేలా చేశారు. ఆ లాభాలు క్రమంగా మెరుగుపడటంతో స్వంతంగా సినిమా ఆలోచన మళ్ళీ చిగురించింది.
అప్పటికే ఎస్వి కృష్ణారెడ్డి కొబ్బరిబొండం కథను రాసిపెట్టుకుని ఉన్నారు. స్వంతంగా దర్శకత్వం చేసే ధైర్యం లేకపోవడంతో కాట్రగడ్డ రవితేజను డైరెక్టర్ గా ఎంచుకున్నారు. స్క్రీన్ ప్లే సంగీతం కూడా ఎస్వి నే అందించారు. పిరికివాడైన ఓ యువకుడు ఒక చిన్న నాణెంతో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుని ప్రేమతో పాటు జీవితంలో అన్నీ గెలుచుకుంటాడు. మనమీద మనకు నమ్మకం ఉంటే ఇంకేదీ అక్కర్లేదని నిరూపించే పాయింట్ తో ఇది రూపొందింది. అద్భుతమైన కామెడీ, చక్కని పాటలు ప్రేక్షకులను విపరీతంగా మెప్పించాయి. 1991 డిసెంబర్ 4న విడుదలైన కొబ్బరిబొండం మనీషా ఆర్ట్స్ కి డెబ్యూతోనే సూపర్ హిట్ ఇచ్చింది. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ – రమేష్ బాబు – దివ్యభారతిల నా ఇల్లే నా స్వర్గం ఫ్లాప్ కావడం ఫైనల్ ట్విస్ట్
Also Read : Tirumala Tirupati Venkatesa : గొప్పలకు పోయే భార్యాభర్తలకు గుణపాఠం ౼ Nostalgia