Idream media
Idream media
దక్షిణ భారతదేశంలో అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకటైన పుద్దుచ్ఛేరి లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యేల రాజీనామాతో ప్రభుత్వంలో ప్రకంపనలు కొనసాగుతుండగా.. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి కిరణ్ బేడీని తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కిరణ్ బేడీని తప్పించిన కేంద్రం పుదుచ్చేరి అదనపు బాధ్యతలను తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌కు అప్పగించింది. కిరణ్ బేడీని తప్పించడం వెనుక కారణం ఏంటనే విషయాలు ఇంకా తెలిసి రాలేదు. కాకపోతే ఉన్నట్టుండి వేటు పడటం వెనుక కారణాలేంటనే అనుమానాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. మరికొద్ది రోజుల్లో నాలుగు రాష్ట్రాలతో కలిపి పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో మార్పు చేయడం వెనుక రాజకీయ పరమైన ఏవైనా కారణాలున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం, గవర్నర్ మధ్య వార్!
పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, కిరణ్ బేడీకి మధ్య సయోధ్య లేదని ఎప్పటి నుంచో ఉన్నదే. ఆమెను తొలగించాలంటూ ముఖ్యమంత్రి నారాయణ స్వామి పలుమార్లు డిమాండ్ చేశారు. అంతే కాదు.. కిరణ్‌బేడీ ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటూ హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని నారాయణస్వామి ధ్వజమెత్తారు. గో బ్యాక్ బేడీ అంటూ దీక్షలు కూడా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు సీపీఎం, సీపీఐ నేతలు కూడా మద్దతు తెలిపారు. అంతేకాదు 2019 డిసెంబర్ లో రాజ్‌భవన్ ఎదుట ధర్నా కూడా చేశారు. ఇటీవల ఆమె మరింత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నారాయణ స్వామి ఎన్నోసార్లు ఆరోపణలు చేశారు.
డీఎంకే మాజీ అధ్యక్షుడు కరుణానిధి కీర్తిప్రతిష్టలను విస్తరింపచేసేందుకు పుదుచ్చేరిలో ఆయన విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేయగా, కిరణ్‌బేడీ ఈ విషయంలో జోక్యం చేసుకుని ప్రభుత్వ స్థలంలో కరుణ విగ్రహ ఏర్పాటుకు అనుమతించమని అడ్డగించడం కూడా వివాదాస్పదం అయింది. అలాగే కొవిడ్ టైం లో రోజువారీ నివేదికలు తనకు పంపడం లేదని కిరణ్ బేడీ యంత్రాంగంపై నిప్పులు చెరిగారు. ఆ రాష్ట్రంలోని పరిస్థితుల నేపథ్యంలోనే కిరణ్ బేడీ ని మార్చనున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. అప్పట్లో ఏపీ గవర్నర్ గా ఆమె వెళ్లనున్నారని ప్రచారం జరిగింది.
ఇదిలా ఉండగా.. పుదుచ్చేరిలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఒకేసారి నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి నారాయణస్వామి సర్కార్ మైనార్టీలో పడిపోయింది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే రాజీనామాలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. అలాగే నారాయణ స్వామి కూడా మొత్తానికే అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆలోచన చేస్తున్న సమయంలోనే లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడి సహకరిస్తారా లేదా కేంద్ర పాలనకు సిఫార్సు చేస్తారా అనే ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. మరోవైపు కాంగ్రెస్ రాజీనామాల వెనుక బీజేపీ హస్తం ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాలన్నీ ఇలా ఉండగా.. అనూహ్యంగా కిరణ్‌బేడీని మార్చుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.