Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఉచ్చు బిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటు చేసుకున్న ఘర్షణలు, ఏకగ్రీవాలపై అభ్యంతరకర రీతిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో కేంద్ర ప్రభుత్వానికి లేఖరాశారు. దాంతో పాటు తన ప్రాణానికి హాని ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ లేఖ రాసినట్లు మీడియాలో విస్తృతంగా ప్రచారం అయింది. అయితే లేఖ పై అప్పట్లో కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఆ లేఖ తాను రాశాననో, లేదా రాయలేదనో.. ఏ విషయం చెప్పకుండా మౌనంగా ఉన్నారు. ఐతే లేఖ ఆయన రాయలేదని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఫిర్యాదు చేసి విచారణ చేయాలని కోరగా.. అప్పుడు తానే రాసినట్లు నిమ్మగడ్డ చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినేలా, అధికారులపై ఆరోపణలు చేసిన రమేష్ కుమార్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ తో పదవీకాలం ముగియడంతో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన స్థానంలో మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి కనగరాజు ను జగన్ ప్రభుత్వం నియమించింది. ఈ వ్యవహారంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. తనను రాజ్యాంగ విరుద్ధం తొలగించారని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది.
ఇది ఇలా ఉండగా వైఎస్సార్సీపీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నిమ్మగడ్డ లేఖ పై సంచలన ఆరోపణలు చేశారు. నిమ్మగడ్డ ఆ లేఖ రాయలేదని, టిడిపి ఆఫీస్ లో తయారయిందని.. ఆ తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు చేరగా.. దాన్ని ఆయన కేంద్ర ప్రభుత్వానికి పంపించారని ఆరోపించారు. లేఖలో సంతకానికి, స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయం పై చేసిన సంతకానికి వ్యత్యాసం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదును డీజీపీ గౌతమ్ సవాంగ్ సిఐడి కి బదిలీ చేశారు. కేసు నమోదు చేసిన సిఐడి దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈరోజు తాజాగా సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కేసు వివరాలను ప్రాధమికంగా వెల్లడించారు. సదరు లేఖ బయట తయారుచేసి రమేష్ కుమార్ కు పంపారని సునీల్ కుమార్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు ధ్వంసం చేశారని తెలిపారు. ఈ అంశంపై అవసరమైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కూడా పిలిపించి విచారణ చేస్తామని చెప్పారు. మొత్తం మీద ఈ లేఖ వ్యవహారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ మెడకు చుట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.