iDreamPost
android-app
ios-app

ఆపరేషన్‌ హుజూరాబాద్‌ ప్రారంభించిన కేసీఆర్‌

ఆపరేషన్‌  హుజూరాబాద్‌ ప్రారంభించిన కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రాజకీయాల్లో తలపండిన నాయకుడు. ప్రజల నాడి బాగా గెలిసిన నేతగా గుర్తింపు పొందారు. ప్రభుత్వంపై ఉన్న ప్రజల ఆదరణను పసిగట్టి 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి పార్టీని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. దుబ్బాక ఉప ఎన్నికపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో ఆ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ తక్కువ మెజార్టీతో ఓటమి పాలైంది. ఆ ఊపులో బీజేపీ గ్రేటర్‌ ఎన్నికల్లో కూడా సత్తా చాటింది. దీంతో కేసీఆర్‌ పార్టీపై పట్టు బిగించారు. దీంతో ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో గెలుపొందింది.

వ్యూహాత్మకంగా అడుగులు

త్వరలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉప ఎన్నికే అయినప్పటికీ అప్పటి వరకు తమ ప్రభుత్వంతో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ ప్రభుత్వంపైనే తిరుగుబాటుకు పిలుపు ఇవ్వడం, ఆత్మ గౌరవ నినాదంతో ప్రజల్లో తిరుగుతుండడంతో కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే ప్రతీ అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. గెలిపే ధ్యేయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

అప్పుడు నాగార్జునసాగర్‌.. ఇప్పుడు హుజూరాబాద్‌

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు మూడు నెలల ముందే కేసీఆర్‌ హాలియాలో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. ప్రాజెక్టుల ప్రగతి నివేదిక పేరుతో సభను ఏర్పాటు చేసిన అంతర్లీనంగా ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే ఇక్కడ సభ నిర్వహించారు. సభకు హాజరైన కేసీఆర్‌ నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించి స్థానికులను ఆకట్టుకున్నారు. ఉప ఎన్నికలో గెలవడానికి అది కూడా దోహదపడింది. ఇప్పుడు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా కూడా కేసీఆర్‌ అదే వ్యూహం అవలంబిస్తున్నారు.

పైలెట్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం అక్కడే..

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళిత సాధికారత స్కీమ్‌కు ముఖ్యమంత్రి కొత్త పేరును ఖరారు చేశారు. ‘తెలంగాణ దళిత బంధు’ అని ఆ పథకానికి నామకరణం చేశారు. పైలట్‌ ప్రాజెక్టు కింద ఈ స్కీమ్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు త్వరలో ఉప ఎన్నిక జరగనున్న హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ఎంచుకుని చాతుర్యం ప్రదర్శించారు. ఇంతకు ముందు దళిత సాధికారతపై జరిగిన అఖిలపక్షం సదస్సులో.. నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఎంపిక చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలుకు ఏటా రూ. 1,200 కోట్లు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు. ఈ పథకాన్ని ప్రతి సంవత్సరం ఇతర కుటుంబాలకు విస్తరిస్తామన్నారు. తాజాగా.. ఈ పథకానికి రూ. 1,500 – రూ. 2,000 కోట్లను అదనంగా కేటాయిస్తూ.. పైలట్‌ ప్రాజెక్టును జోడించారు.

త్వరలో హుజూరాబాద్‌కు..

త్వరలో ఉప ఎన్నిక జరగనున్న హుజూరాబాద్‌ నియోజకర్గాన్ని పైలట్‌ ప్రాజెక్టు అమలుకు ఎంపిక చేశారు. అక్కడ మొత్తం 20,929 దళిత కుటుంబాలు ఉన్నట్లు ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. ఆ నియోజకవర్గంలో మండలాల వారీగా చూస్తే.. హుజూరాబాద్‌లో 5323, కమలాపూర్‌లో 4346, వీణవంకలో 3678, జమ్మికుంటలో 4996, ఇల్లంతకుంటలో 2586 చొప్పున దళిత కుటుంబాలు ఉన్నాయి. సీఎం తాజా నిర్ణయం మేరకు.. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈ పథకం తొలి దశలోనే 100ు అమలు లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలున్నాయి. రూ. 1,500 కోట్లతో ఈ పథకం 15 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తుంది. అదే రూ. 2 వేల కోట్లను కేటాయిస్తే.. 20 వేల కుటుంబాలకు లబ్ధి కలుగుతుంది. అంటే.. హుజూరాబాద్‌లోని 20,929 కుటుంబాల్లో 20 వేల మంది తొలి దశలోనే ‘దళిత బంధు’ పరిధిలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ పథకం ప్రారంభోత్సవ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఆ సందర్భంగా కేసీఆర్‌ హుజూరాబాద్‌ వెళ్లే అవకాశం ఉంది.