Dharani
Dharani
తన భర్తకు ప్రాణ హాని ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భార్య జమున చేసిన కామెంట్స్ రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. తన భర్తను చంపేందుకు రూ. 20 కోట్లు ఖర్చు చేయడానికి రెడీ అయ్యారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో.. మినిస్టర్ కేటీఆర్.. ఈటల భార్య చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఈటెలకు భద్రత కల్పిస్తామని తెలిపారు. ఈ క్రమంలో తాజాగా ఈటల భద్రతపై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సర్కార్ ఈటల రాజేందర్ భద్రతకు వై- ప్లస్ కేటగిరి భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు 16 మంది సెక్యూరిటీ సిబ్బంది నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ సెక్యూరిటీ నేటి నుంచే అమలు కానున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ క్రమంలో ఈటెల రాజేందర్‌కు శనివారం నుంచి వై-ప్లస్ కేటగిరీ భద్రత ఉండనుంది.
ఇదిలా ఉంటే.. ఈటల రాజేందర్‌పై హత్యకు కుట్ర పన్నారంటూ ఆరోపణలు రావడంతో.. ఈ అంవంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని.. వై- ప్లస్ కేటగిరి సెక్యూరిటీ కల్పించనుందని వార్తలు వెలువడ్డాయి. అయితే.. ఈటలకు తెలంగాణ ప్రభుత్వమే సెక్యూరిటీ కల్పించాలని భావించింది. ఈ విషయం తెలియగానే మంత్రి కేటీఆర్ స్పందించి.. ఈ విషయాన్ని స్వయంగా పరిశీలించాలని డీజీపీకి ఫోన్ చేసి మరీ చెప్పారు. వెంటనే స్పందించిన డీజీపీ అంజనీ కుమార్. ఈ ఆరోపణలపై ఈటలను కలిసి వివరాలు సేకరించాలని మేడ్చల్ డీసీపీ సందీప్ రావును ఆదేశించారు.
డీజీపీ ఆదేశాల మేరకు ఈటల నివాసానికి వెళ్లిన డీసీపీ సందీప్ రావు బృందం.. ఆయన, భార్య జమునతో ఈ విషయమై చర్చించారు. ఈటలకు ఎదురైన సంఘటనలన్ని పోలీసులకు వివరించారు. హుజురాబాద్‌తో పాటు జిల్లాల పర్యటనల్లో ఉన్నప్పుడు పలు అనుమానాస్పద కార్లు తిరుగుతున్నాయని ఈ సందర్భంగా ఈటల డీసీపీకి తెలిపారు. అన్ని వివరాలు సేకరించిన డీసీపీ సందీప్ రావు.. ఈటల భద్రతపై సీల్డ్ కవర్‌లో డీజీపీకి రిపోర్ట్ అందజేశారు. నివేదికను గమనించిన డీజీపీ… ఈటలకు ముప్పు పొంచి ఉందని నిర్ధారించారు. దీంతో.. ఈటలకు వై-ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.