Idream media
Idream media
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్(పీకే) తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారారు. గత రెండు రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌తో సుదీర్ఘ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన పీకే.. తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ కోసం ఎలా పనిచేస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
పీకే నేతృత్వంలోని ఐప్యాక్ సేవలు కొనసాగించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ సంస్థ సేవలను అందించనుంది. ఈ విషయంపై టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో రెండు రోజులుగా ప్రశాంత్ కిషోర్ చర్చలు జరిపారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ వేదికగా వీరి చర్చలు సుదీర్ఘంగా కొనసాగాయి. రాష్ట్రస్థాయిలో జరిపిన సర్వే వివరాలను కూడా కేసీఆర్‌కు అందించినట్లు సమాచారం.
సర్వేలు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కొత్త ఓటర్లను ప్రభావితం చేయడం ఇతరత్రా వాటికోసం ఈ ఐప్యాక్ సేవలు అందించనుంది. రెండో రోజు ఆదివారం కూడా సాగిన సమావేశంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై కేసీఆర్, ప్రశాంత్ కీలకంగా చర్చలు జరిపినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం లేకపోతే కూటమి లేదా కేసీఆర్ కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఇతర నేతల పట్ల ప్రజాభిప్రాయంపై సర్వేలను ఈ సందర్భంగా కేసీఆర్, పీకే చర్చించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో పీకే చేరనున్నారనే ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ రెండు రోజులుగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పరిస్థితి ఏంటనేది కూడా కీలకంగా మారింది.
వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటనే దానిపై పీకేతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. కేంద్రంలో బీజేపీని గద్దెదించేందుకు అవసరమైన అంశాలపై వారిద్దరి మధ్య కీలక చర్చ జరిగింది. జాతీయ రాజకీయాలు, బీజేపీ పరిస్థితిపై పీకేతో కేసీఆర్ మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా వీరి భేటీ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి వ్యతిరేకంగా కూటమిలో టీఆర్ఎస్‌ను భాగస్వామిని చేసేందుకే పీకే శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పీకే ప్రయత్నాలు ఎంతవరకు ఆచరణలోకి వస్తాయనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.