iDreamPost
android-app
ios-app

విశిష్ట గుణాల సమాహారం కేసీఆర్

విశిష్ట గుణాల సమాహారం కేసీఆర్

అద్భుతమైన తెలివితేటలతో రాణించాలంటే అమెరికా వెళ్లి హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకోనక్కరలేదని రుజువు చేసారు తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆ స్కూల్లో చదువుకుని వ్యవహారదక్షులయిన వారిని మించిన దక్షత తనకుందని పలుమార్లు నిరూపించుకున్నారు. ఆ స్కూల్లో చదువుకుంటే కూడా లభించని కామన్ సెన్స్ ఆయనలో పుష్కలం. అదే ఆయనకు శ్రీరామ రక్షగా నిలిచిందనుకోవాలి.

బిజినెస్ స్కూల్లో నేర్పే మోటివేషన్, డెలిగేషన్ మొదలయిన విషయాలు కేసీఆర్ కు పుట్టుకతోనే అబ్బాయి. రాజకీయాల్లో చేరి మంత్రిగా, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఈ లక్షణాలు ఎంతగానో ఆయనకు ఉపయోగపడుతున్నాయి.

ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తిచేసుకున్నప్పుడు ఊహించని వ్యక్తి నుంచి ఆయనకు దక్కిన ఒక చక్కటి కితాబును ఇక్కడ గుర్తు చేసుకోవాలి.ఈ కితాబు ఇచ్చింది కూడా ఆషామాషీ మనిషేమీ కాదు. మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా వున్నప్పుడు చాలాకాలం ఆయన వద్ద సమాచార సలహాదారుగా పనిచేసిన ఆర్ధిక వ్యవహారాల పాత్రికేయుడు సంజయ్ బారు. నిజానికి ఈ బారు గారు ప్రత్యేక తెలంగాణాకు బద్ధ వ్యతిరేకి. కరడుగట్టిన సమైక్యవాది. తన మనస్సులోని ఈ మాటని అయన ఏనాడూ దాచుకోలేదు. అలాటి సంజయ్ బారు తెలంగాణా కల సాకారం అయిన ఏడాది తరువాత అన్నమాట ఇది. నిజానికి అక్షరాలా రాసిన మాట ఇది.

‘డెక్కన్ హైదరాబాదు గురించి నేను భయపడ్డది ఏమీ జరగలేదు. ఇక్కడివారికి అరమరికలు తెలియవు, ఆదరించి అక్కున చేర్చుకునే తత్వం ఇక్కడివారి సొంతం. అన్నింటికీ మించి ఈ నగరానికి వున్న ప్రత్యేక ఆకర్షణ, శోభ, సౌందర్యం ఇవేవీ చెరిగిపోలేదు. (తెలంగాణా ఏర్పడ్డ తరువాత) ఇవన్నీ చరిత్ర పుటల్లో చేరిపోతాయేమో అని నేను భయపడ్డాను. కానీ నా సందేహాలన్నీ పటాపంచలయ్యాయి’ అని ఒక ఆంగ్ల జాతీయ దినపత్రికలో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.

సంజయ్ బారు ఒక్కరే కాదు, హైదరాబాదు వాసులందరూ ఇదే అభిప్రాయంతో వున్నారు. కారణం ఏమిటంటే, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో అన్నట్టు వుండే కరెంటు సరఫరా గురించి వారు పెంచుకున్న ఆందోళన అనతికాలంలోనే దూది పింజలా ఎగిరిపోయింది. అయితే ఈ ఘనతను కేసీఆర్ ఏనాడూ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయలేదు. సరికదా, సమయం దొరికినప్పుడల్లా సంబంధిత మంత్రి, జెన్కో చైర్మన్, అధికారులు, సిబ్బంది సమష్టి కృషి వల్లనే ఈ ‘అద్భుతం’ సాధ్యం అయిందని పలుమార్లు బహిరంగంగా చెప్పుకొచ్చారు. పరిపాలనలో ‘నేను’ అని కాకుండా ‘మేము’ అనే పదాన్ని మించిన మోటివేషన్ ఏముంటుంది? అందుకే ఈ విషయంలో ఇక ఆయన కొత్తగా నేర్చుకోవాల్సిన పాఠాలు లేకుండా పోయాయి.

అలాగే, బిజినెస్ గురువులు చెప్పే మరో అంశం డెలిగేషన్. అంటే అధికారాలు, బాధ్యతల బదిలీ. ముఖ్యమంత్రిగా ఎన్నో అధికారాలు తనవద్దనే కేంద్రీకృతం అయివున్నా వాటిని సంబంధిత మంత్రులకు, అధికారులకు కేసీఆర్ అప్పచెప్పేసారు. లక్ష్యాలు నిర్ణయించి, ఫలితాలు రాబట్టాలని నిర్దేశించారు. అన్నింటా తానయి, అన్నిట్లో వేలు దూర్చడం కాకుండా దశ, దిశలను నిర్దేశించడం వరకే తన పాత్రను పరిమితం చేసుకుని ఫలితాలు సాధించే పనిని ఎంచుకున్నారు. మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ ఇందుకు ఉదాహరణలు. ఇతర పరిపాలకులకు కూడా కేసీఆర్ చూపిన ఈ బాట అనుసరణీయం. తను బీపీ తెచ్చుకోకుండా, పనిచేయించేవారికి, పనులు చేసేవారికి బీపీ తెప్పించకుండా పనులు జరిగేలా చూడడం వల్లనే రాష్ట్రంలో పరిపాలన నల్లేరు మీది బండిలా హాయిగా సాగిపోతోందనే అభిప్రాయం సర్వత్రా ఏర్పడడానికి కారణం ఇదే.

అనర్ఘలంగా ప్రసంగించేవారు రాజకీయుల్లో చాలామంది కనబడతారు. కానీ ఆకట్టుకునేలా ఉపన్యసించడం కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య. తన ఎదురుగా వున్న శ్రోతలను బట్టి ఆయన ప్రసంగ శైలిని మార్చుకుంటారు. మహిళలు, ఉపాధ్యాయులు, మేధావులు, విలేకరులు ఇలా ఎవరికి తగ్గట్టు అప్పటికప్పుడు ఆయన ఉపన్యాస ధోరణి మారిపోతుంది. వారి వారి అభిరుచులు, ఇష్టాఇష్టాలను గమనిస్తూ సంభాషణ కానీ ప్రసంగం కానీ కొనసాగించడం ఆయన ప్రత్యేకత. వేదిక ఎక్కి ఆశువుగా మాట్లాడితే ఇక దానికి అడ్డే వుండదు. అదే కాగితాలు చూస్తూ చదివితే పేలవంగా వున్నట్టనిపిస్తుంది. ఈ విషయం ఆయనే అనేక సందర్భాలలో స్వయంగా చెప్పారు. కాగితం చూస్తూ చదవడం తనకు ఇష్టం ఉండదని, అయినా కొన్ని కొన్ని అధికారిక కార్యక్రమాల్లో తప్పడం లేదని ఆయనే చెప్పారు.

భోజనం వేళకు ఇంట్లో ఎంతమంది వుంటే అంతమందిని భోజనాలకు లేపడం ఆయనకు ఓ అలవాటని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. స్వతహాగా భోజన ప్రియుడు కాకపోయినా ఇతరుల ఇష్టాఇష్టాలను గమనిస్తూ ఒక గృహస్తుగా భోజనాదికాలు కనుక్కుంటూ వుండడం ఆయనకు అలవాటని కూడా చెబుతుంటారు. నాతొ సహా హైదరాబాదులోని చాలామంది విలేకరులకు ఇది అనుభవైకవేద్యమే. అంతే కాదు, దేశంలో ఏ ప్రాంతంలో ఏ వంటకాలు ప్రాచుర్యం పొందాయన్నది ఆయనకు కరతలామలకం.

రాష్ట్ర విభజన తరువాత ఒకసారి బెజవాడ వెళ్ళిన కేసీఆర్ కు, అయన పరివారానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విందు భోజనం ఏర్పాటు చేసారు. పొరుగు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాల ప్రత్యేకతలు అయిన పిండి వంటలు, ఇతర వంటకాలను కేసీఆర్ ఆ విందు సందర్భంగా సవివరంగా ప్రస్తావించారు. ‘మా ప్రాంతపు వంటకాల గురించి మాకే ఇంతగా తెలియదు, ఆయన ఎప్పుడు ఇంత అధ్యయనం చేశారని ఆశ్చర్య పోవడం ఆంధ్రప్రాంతం మంత్రుల వంతయిందని మరునాడు పత్రికలు రాసాయి. అలాగే వివిధ ప్రాంతాల ఆచార వ్యవహారాల పట్ల కూడా ఆయనకున్న అవగాహన అపరిమితం.

ఆయన దురదృష్టం ఏమిటంటే, కేసీఆర్ గురించి కొన్ని వర్గాల్లో ఒక అపోహ ఇప్పటికీ వుంది, ప్రాంతీయ పార్టీ నాయకుడిగా ఆయన, తన ప్రాంత ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తారని. అంతవరకయితే పరవాలేదు. కానీ ఆయన్ని ఒక కరడు కట్టిన ప్రాంతీయ వాదిగా ముద్రవేసే ప్రయత్నం కూడా జరుగుతోందనేది కూడా వాస్తవం. కేసీఆర్ ప్రాంతీయవాది కావచ్చేమో కాని ప్రాంతీయ తత్వం మాత్రం ఆయన రక్తంలో లేదనడానికి ఎన్నో ఉదాహరణలు వున్నాయి.

సినీ నటుడు బాలకృష్ణ ఒకసారి ఓ పనిమీద తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుని కలుసుకుని ఒక వినతి పత్రం అందచేశారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఆయన శాసనసభ్యుడు. పైగా టీ.ఆర్.ఎస్. ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన ముఖ్యమంత్రిని కలుసుకున్నది హైదరాబాదులోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రి చైర్మన్ హోదాలో, ఆ హాస్పిటల్ కు సంబంధించిన ఒక వ్యవహారంలో. అయినా కేసీఆర్ వెంటనే సానుకూలంగా స్పందించి అధికారులకు తదనుగుణంగా ఉత్తర్వులు ఇచ్చారు. ‘బాలకృష్ణ గారు అడిగింది ఆయన స్టూడియోకో, లేదా వ్యాపార వాణిజ్య అంశానికి సంబంధించిన విషయమో కాదు, ప్రజలకు ఉపయోగపడుతున్న దవాఖానా గురించి. అలాంటప్పుడు ఆలోచించాల్సింది ఏమిటన్నది’ కేసీఆర్ ప్రశ్న. అందుకే ఆయన ఏమాత్రం సంకోచించకుండా స్పందించారు. అటువంటి విషయాల్లో ప్రాంతీయ తత్వం పనికి రాదన్నది కేసీఆర్ సిద్ధాంతం.

రాజనేవాడికి స్పందించే గుణం వుండాలని కౌటిల్యుడు అర్ధశాస్త్రంలో చెబుతాడు. తెలంగాణా తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఈ లక్షణం అతికినట్టు సరిపోతుంది.

ప్రతిరోజూ క్రమం తప్పకుండా అన్ని దిన పత్రికలు చదవడం ఎన్నో ఏళ్ళుగా ఆయనకు వున్న అలవాటు. పత్రికల్లో వచ్చే ముఖ్యమైన వార్తలను క్రోడీకరించి అనుదినం అందించే యంత్రాంగం ప్రతి ముఖ్యమంత్రికి వున్నట్టే కేసీఆర్ కి కూడా వుంది. అయినా ఆయన స్వయంగా ప్రతి పత్రికను ఆమూలాగ్రం చదువుతారు. చదివిన తరువాత ఆయా విషయాల మీద ఆయన తక్షణం స్పందించే తీరు కొన్ని సందర్భాలలో కొందరు అశక్తుల విషయంలో వరంగా మారుతోంది. అలా అయాచితంగా లబ్దిపొందిన కుటుంబాల్లో మాదీ ఒకటి.

మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు అయిదుగురు ముఖ్యమంత్రుల వద్ద వరుసగా పీ ఆర్ ఓ గా (చెన్నా టు అన్నా, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకట్రాం, కోట్ల విజయ భాస్కర రెడ్డి, ఎన్టీ రామారావు) పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసి స్వచ్చంద పదవీవిరమణ చేసారు.

ఉన్నతోద్యోగాలు చేసి కూడా ఒక సొంత గూడంటూ ఏర్పాటు చేసుకోలేని స్తితిలో ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. కొన్ని వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఆయన పెన్షన్ మొత్తాన్ని అమ్ముకున్న ఫలితంగా మా ఒదినె సరోజిని గారికి కుటుంబ పెన్షన్ పదేళ్లుగా రాని పరిస్తితి. విన్నపాలు, వినతి పత్రాలు మినహా కోర్టు గుమ్మం తట్టకూడదనే సంస్కారం కలిగిన కుటుంబం. ఈలోగా ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. సాయం చేయాలని వారికి మనసులో యెంతగా వున్నా, నిబంధనల కారణంగా ఏమీ చేయలేని స్తితి. ఈ నేపధ్యంలో రాష్ట్రం రెండుగా విడిపోయింది. తెలంగాణా ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. కేసీఆర్ కు వున్న పత్రికలు చదివే అలవాటు, దాదాపు మూసివేసిన ఈ ఫైలుకు మళ్ళీ ప్రాణం పోసింది. మా అన్నగారి వర్ధంతిని పురస్కరించుకుని మిత్రుడు జ్వాలా నరసింహారావు ఆంధ్రజ్యోతిలో రాసిన ఒక వ్యాసంలో ఈ పెన్షన్ వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఈ కేసులో దాగున్న ‘మానవతా కోణం ఒక్కటే’ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటికి కనిపించింది. అంతే! ఏళ్ళతరబడి ఎదురుచూస్తున్న ఆ డెబ్బయి ఎనిమిదేళ్ళ వృద్దురాలికి నిబంధనలు సడలించి పెద్దమనసుతో ఆయన పెన్షన్ మంజూరు చేశారు. శతమానం భవతి అని కేసీఆర్ ని మనసారా ఆశీర్వదించడం ఒక్కటే కృతజ్ఞతలు తెలపడానికి ఆమెకు మిగిలిన దారి.

Written By –Bhandaru Srinivas Rao గారు

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alhilarionbethilarionbetberlinbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş