Idream media
Idream media
పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచేవారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టార్గెట్ గా విమర్శలు గుప్పించేవారు. కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టేందుకు పలువురు నేతలతో భేటీ అవుతూ హల్ చల్ చేశారు. చివరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని, రాహుల్ గాంధీని కూడా కలిశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. కొన్ని నెలల పాటు అదే పనిగా బిజీగా గడిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఆ పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమితో కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయిందని బీజేపీ విమర్శిస్తోంది. అయితే కేసీఆర్ మాత్రం కేంద్రం మైండ్ బ్లాంక్ అయ్యేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాస్తవానికి మొదటి నుండి కేంద్ర ప్రభుత్వ వాదన, ఆదేశాలు ఏమిటంటే బాయిల్డ్ రైస్ కొనేది లేదు అని. బాయిల్డ్ రైస్ అంటే ఉప్పుడు బియ్యమని అర్ధం. రైతుల నుంచి సేకరించి వడ్లను ఉడికిస్తే వచ్చేది బాయిల్డ్ రైస్. అదే వడ్లను డైరెక్టుగా తీసే బియ్యాన్ని రా రైస్ అంటారు. ఇఫుడు దేశంలోని చాలా రాష్ట్రాల్లో కానీ విదేశాల్లో కూడా రా రైస్ కే డిమాండ్. ఇపుడు బాయిల్డ్ రైస్ కొనేవాళ్ళు తినేవాళ్ళు చాలా చాలా తక్కువ. అందుకనే రాష్ట్రాల నుండి బాయిల్డ్ రైస్ కొంటే దేశంలో సర్దుబాటు చేయటం లేకపోతే విదేశాలకు ఎగుమతులు చేయటం చాలా కష్టమని కేంద్రం డిసైడ్ అయ్యింది.
అందుకనే బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేవలం రా రైస్ మాత్రమే ఇవ్వమని అన్ని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టంగా ఆదేశాలిచ్చింది. ఇందులో భాగంగా ఇవే ఆదేశాలు తెలంగాణాకు కూడా అందింది. అయితే రా రైస్ వల్ల ప్రభుత్వానికి కానీ మిల్లర్లకు కానీ వచ్చే లాభాలు చాలా తక్కువ. ఎందుకంటే రా రైస్ లో నూక ఎక్కువగా ఉంటుంది. అదే బాయిల్డ్ రైస్ లో అయితే నూకుండదు పైగా లాభాలెక్కువ. అందుకనే సొంత లాభాన్ని దృష్టిలో పెట్టుకున్న కేసీయార్ బాయిల్డ్ రైస్ ఎందుకు కొనరంటూ పదే పదే రచ్చ చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన వ్యూహాత్మకంగా పంజాబ్ ను తెరపైకి తెస్తున్నారు. పంజాబ్ లో బాయిల్డ్ రైస్ కొన్న కేంద్రం తెలంగాణాలో మాత్రం ఎందుకు కొనదంటూ ఉద్యమిస్తున్నారు.
అలాగే సాగు చట్టాల ఉద్యమంలో అసువులు బాసిన రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించి కేంద్రాన్ని ఇరుకున పెట్టేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా మరణించిన రైతు కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలి.. అని ఆయన డిమాండ్ చేసి కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. కేసీఆర్ ప్రకటన అనంతరం కేటీఆర్ కూడా కేసీఆర్ సాయం ప్రకటనపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం ప్రకటించడం గర్వకారణంగా ఉంది అన్నారు. మొత్తంగా చూస్తే.. కొన్నాళ్లుగా మమత కామ్ గా ఉందనుకుంటే ఇప్పుడు కేసీఆర్ కేంద్రానికి కొత్త తలనొప్పిగా మారారనేది వాస్తవం.