Idream media
Idream media
పాడి కౌశిక్‌రెడ్డిని ఈటల రాజేందర్ రాజీనామాతో రాజకీయంగా అదృష్టం వరించిన వ్యక్తిగా చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ నాయకుడిగా సంవత్సరాల తరబడి పనిచేసినా, హుజూరాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసినా రాని గుర్తింపు ఆయనకు ఇప్పుడే వచ్చింది. లోపాయికారిగా అధికార పార్టీతో అందుబాటులో ఉంటూ.. ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తానంటూ పైకి చెబుతూ.. కౌశిక్‌రెడ్డి ఆడిన రాజకీయ క్రీడ ఆ ఆడియో బయటకు రాకపోతే ఎంత కాలం నడిచేదో చెప్పడం కష్టమే. ఆడియో పుణ్యమా అని రాజకీయ సరంజామా సర్దుకుని కాంగ్రెస్ నుంచి కారెక్కేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అయిపోయారు. అధికార పార్టీలో చేరిన పది రోజుల్లోనే ఎమ్మెల్సీ పొందడం ఓ విధంగా గొప్ప వరమే అయినా, కౌశిక్‌రెడ్డి అనుచరుల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సంతోషమే కానీ.. అంటున్న అభిమానులు
టీఆర్‌ఎస్‌లో చేరిక సందర్భంగా రాజధాని హైదరాబాద్‌లో కౌశిక్‌రెడ్డి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకూ ప్రముఖ నేతలు సైతం చేయని హడావిడి ఆయన చేశారు. వందలాది కార్లతో, వేలాది కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించిన కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే, ఆ సందర్భంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ రహదారుల పొడవునా ఆయన, ఆయన అభిమానులు పెట్టిన/పెట్టించిన ఫ్లెక్సీలను గమనిస్తే.. హుజూరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి అని పెద్ద పెద్ద అక్షరాలతో కనిపించింది. టీఆర్‌ఎస్‌లో చేరిన అనంతరం కౌశిక్‌రెడ్డి కూడా ‘ఒక రెండేళ్లు అవకాశం కల్పించండి. చెప్పింది చేయకపోతే ఆ తర్వాత నన్ను దూరం పెట్టండి’ అంటూ ప్రచారం మొదలుపెట్టేశారు.
అంతెందుకు టీఆర్‌ఎస్‌లో చేరక ముందే.. బయటకు వచ్చిన ఆడియోలో తానే హుజూరాబాద్ అభ్యర్థిని అని ప్రకటించేసుకున్నారు. ఇప్పుడు పోటీ చేసేది ఆయన కాదని తెలియడంతో కౌశిక్ అనుచరుల్లో కాస్త ఉత్సాహం సన్నగిల్లింది. కౌశిక్ ఎమ్మెల్సీ కావడం సంతోషమే కానీ.. మన బలమేంటో నిరూపించుకునే అవకాశం పోయిందని భావిస్తున్నారట.
ఆడియోతో మారిన రాజకీయ భవిత
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున హుజూరాబాద్ నుంచి పోటీ చేసిన కౌశిక్‌రెడ్డి, అప్పటి టీఆర్‌ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్ చేతిలో ఓడిపోయారు. కేబినెట్ నుంచి బర్తరఫ్ అయినప్పటి నుంచి ఈటలపై కౌశిక్‌రెడ్డి రాజకీయ ఆరోపణలు కొనసాగాయి. అదే సమయంలో మంత్రి కేటీఆర్‌తో కౌశిక్‌రెడ్డి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో సన్నిహితంగా మెలిగిన ఫొటోలు బయటికి రావటం కలకలం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ నేతగా ఉంటూ.. మంత్రి కేటీఆర్‌తో మంతనాలు సాగించటం వివాదాస్పదమైంది. ఆ తర్వాత కొద్ది రోజులకు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి తానేనంటూ ఆయన నియోజకవర్గ పరిధిలోని ఓ వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో బయటికి వచ్చింది. ఆ వెంటనే నాటకీయ పరిణామాల మధ్య కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. తానే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
పది రోజుల్లోనే కీలక పదవి
అంతకుముందు హుజూరాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, కౌశిక్‌రెడ్డి తమ పార్టీలోకి వస్తారని, ఆయనే టీఆర్‌ఎస్ అభ్యర్థి అవుతారనే సంకేతాలు ఇచ్చారు. జూలై 21న కౌశిక్‌రెడ్డి.. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కాగా.. ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్.. గవర్నర్ కోటాలో ఖాళీగా ఒక ఎమ్మెల్సీ స్థానం భర్తీ కోసం పాడి కౌశిక్‌రెడ్డి పేరును ప్రతిపాదించింది. ఈమేరకు గవర్నర్ ఆమోదానికి సిఫారసు చేసింది. కేబినెట్ సిఫారసును గవర్నర్ ఆమోదించటం లాంఛనమే. కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీగా నామినేట్ అవ్వడమూ లాంఛనమే. అయితే పార్టీలో చేరిన పది రోజుల్లోనే అనూహ్యంగా ఆయనకు ఈ పదవి దక్కటం టీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవిపై పార్టీలో చాలా మంది ముఖ్య నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు వారంతా భర్తీ కావాల్సిన ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలపై దృష్టి పెట్టారు.
కారణాలు ఇవేనా..
కౌశిక్ రెడ్డి పార్టీలోకి రాక ముందే.. డబ్బుల పంపకానికి సిద్ధమవుతున్నట్లుగా తెలియజేసే ఆడియో వైరల్ అయింది. ఆ తరహౄ ప్రచారం మంచిదికాదనే భావన గులాబీ వర్గాలు మొదట్లోనే వ్యక్తం చేశాయి. దీనికి తోడు ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ సర్వేలో టీఆర్‌ఎస్‌కు కేవలం 33 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని తేలినట్లు చెప్పారు. దీని ప్రకారం.. ఈటల రాజేందర్‌కు, టీఆర్‌ఎస్‌కు మధ్య భారీగానే వ్యత్యాసం కనిపిస్తోంది. అలాంటి సమయంలో పార్టీ వేరైనా ఇప్పటికే అక్కడి ప్రజలు తిరస్కరించిన కౌశిక్‌రెడ్డి లాంటి వాళ్లకు టికెట్ ఇస్తే గెలవడం కష్టమేనన్న అభిప్రాయంలో అధిష్ఠానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే కేసీఆర్ కూడా సొంతంగా సర్వే చేయించారని, కౌశిక్‌రెడ్డి వైపు ప్రజల మొగ్గు అంతగా లేదని తేలినట్లు మరో ప్రచారం. టికెట్‌పై ఎంతో నమ్మకంతో పార్టీలో చేరిన కౌశిక్‌రెడ్డికి ఉప ఎన్నికకు ముందే ఏదైనా కీలక పదవి కేటాయించడం ద్వారా ఆయనను సంతోషపరచడంతో పాటు, అదే నియోజకవర్గానికి మరో పదవి కేటాయించినట్లు అవుతుందని కేసీఆర్ వ్యూహం రచించారని మరో వాదన.