iDreamPost
iDreamPost
విజయవాడలో కాట్రగడ్డ బాబు గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. కాట్రగడ్డ వెంకట నారాయణ సోదరుడిగా విజయవాడ రాజకీయాలకు పరిచయం అయినా, ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేత కాట్రగడ్డ నాగమల్లేశ్వర రావు అలియాస్ కాట్రగడ్డ బాబు.
కాట్రగడ్డ వెంకటనారాయణ సోదరుడిగా విజయవాడ ముఠా రాజకీయాల్లో బాబు పెద్దగా తలదూర్చింది లేదు. తన సోదరుడితోపాటు ముఠా గొడవల్లో పాల్గొన్నదీ లేదు.కాకపోతే తన సోదరుడి హత్య తర్వాత కొంత ఆవేశంతో కాట్రగడ్డ బాబు ప్రవర్తించారు. సోదరుని హత్యచేసిన వారిపట్ల పగతో ఆయన పనిచేశారు. అయితే ఆ జీవితం అంత ఈజీ కాదని ఆయనకు త్వరలోనే అర్థమైనట్టు ఉంది. ఒక్కో అడుగూ వెనక్కు వేయడం మొదలుపెట్టారు.
కాట్రగడ్డ బాబు వెనకడుగు వేయడాన్ని బలహీనతగా చూసిన ప్రత్యర్ధులు ఆయనపై దాడి చేశారు. ఒకసారి ఏకంగా ఆయన ఇంట్లోనే ఆయనని హత్య చేయాలని ప్రయత్నం చేశారు. ఓ బుల్లెట్ నుండి తప్పుకున్నారు. రెండో బుల్లెట్ గురితప్పలేదు. సరిగ్గా అప్పుడే తనకు చావు తప్పదని నిర్ణయించుకుని చనిపోయినట్టు నేలకు ఒరిగిపోయారు.హంతకులు కూడా ఆయన చనిపోయాడు అనుకొని పరుగెత్తారు. తర్వాత ఆయన తేరుకుని లేచారు. కొన్ని రోజుల వైద్య సేవల అనంతరం ఆయన ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు.
ఈ సంఘటనకు ముందే కాట్రగడ్డ బాబులో చాలా మార్పు వచ్చింది. వివిధ రకాల వ్యాధులతో బాధపడే పేదలకు ఉచితంగా మందులు ఇవ్వడం మొదలు పెట్టారు. వారానికి ఒక రోజు ఉచితంగా మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కొన్ని లక్షల మంది నిరుపేదలకు ఆయన ఉచితంగా మందులు కొన్ని సంవత్సరాలపాటు పంపిణీ చేశారు. అలాగే నగరంలో పచ్చదనం, పరిశుభ్రత అంటూ అనేక కార్యక్రమాలు నిర్వహించి, చాలా మందికి, ప్రత్యేకించి కాలనీల్లో, విద్యాసంస్థల్లో మొక్కలు పంపిణీ చేశారు.
ఇక రాజకీయాల్లో కాట్రగడ్డ బాబు టీడీపీ తరుపున క్రియాశీలకంగా పనిచేశారు. పార్టీ విజయవాడ అర్బన్ యూనిట్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.అంతకు మించి పై పదవులకి వెళ్ళలేకపోయారు.చాలా ప్రయత్నాలు చేశారు కానీ రాజకీయాలు ఆయనకు కలిసిరాలేదు. టీడీపీ కోసం చాలా ఎక్కువే పనిచేశారు. ప్రతి కీలక సమయంలో పార్టీ తరపున నగరంలో ముఖ్య కూడళ్ళలో ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేసి టీడీపీ విధానాలను ప్రజలకు పరిచయం చేసేవారు. అలాగే పార్టీ తరపున ప్రత్యర్థులపై ఈ ఫ్లెక్సీ పోరాటంలో ఆయన వినూత్నంగా పనిచేసేవారు.
సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో అంతా వీధుల్లో పోరాటం చేస్తుంటే కాట్రగడ్డ బాబు మాత్రం ఫ్లెక్సీ పోరాటం చేసేవారు. పోరాటం చేసేవారిని, చూసే వారిని, చివరికి ఆ సమైక్యాంధ్ర పోరాటం పట్టని వాళ్ళని కూడా ఈ ఫ్లెక్సీలు ఆకర్షించేవి. ఒకటిరెండుసార్లు జాతీయ మీడియా కూడా ఈ ఫ్లెక్సీ పోరాటాన్ని ప్రస్తావించింది. ఒక అంశాన్ని తీసుకుని దానిపై ఆకర్షణీయమైన స్లోగన్స్,క్యాప్షన్స్ పెట్టి ప్రజలను ఆకర్షించేలా ఫ్లెక్సీలు ప్రింటు చేయించి నగరంలోని ముఖ్యకూడళ్ళలో ప్రదర్శించడం కాట్రగడ్డ బాబు ప్రత్యేకత.
ముఠా రాజకీయాలు,హత్యా రాజకీయాల నుండి ప్రస్థానం మొదలయి, ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి వచ్చి, తాను నమ్ముకున్న పార్టీలో నిబద్దతతో పనిచేసి, తగిన గుర్తింపు రాక చివరికి క్రియాశీలక రాజకీయాల నుండి తప్పుకున్న నేత కాట్రగడ్డ బాబు. తాను నమ్ముకున్న పార్టీకోసం ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు రాలేదు అని మదనపడిన టీడీపీ నేత కాట్రగడ్డ బాబు. అయితే సమాజసేవా కార్యక్రమాల్లో నిమగ్నం అవడం ద్వారా ఈ అసంతృప్తిని తొలగించుకుని సంతృప్తిగా జీవితం కొనసాగించిన నేత కాట్రగడ్డ బాబు. ఆయన మృతి అకస్మికమే అయినా ప్రస్తుతం ఆయన ముద్రణా రంగంలో ఉన్నారు. ఆ సంతృప్తి ఆయనలో చాలా మార్పు తెచ్చింది. అయితే ఆయన తుదిశ్వాస తీసుకునే సమయంలో రాజకీయాల్లో గుర్తింపు లభించలేదనే అసంతృప్తి మాత్రం కొంత బాధించి ఉండవచ్చు.