iDreamPost
android-app
ios-app

తోటకు కౌంటర్‌ ఇచ్చే కాపు నేతే లేరా..?

తోటకు కౌంటర్‌ ఇచ్చే కాపు నేతే లేరా..?

రాజకీయం నడపడంలో ఒక్కొక్కరిది ఒక్కో సై్టల్‌. విమర్శలకు ప్రతి విమర్శలు రాజకీయ పార్టీల మధ్య సర్వసాధారణం. అయితే ప్రత్యర్థి పార్టీ తరఫున ఎవరు మాట్లాడారు..? వారికి మన పార్టీ తరఫున ఎవరు కౌంటర్‌ ఇవ్వాలి..? అనే అంశంపై తెలుగుదేశం పార్టీ అత్యంత శ్రద్ధ చూపేది. ముఖ్యంగా 2014 –19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీల తరఫున ఎవరు మాట్లాడినా.. సదరు నేత కులం ఆధారంగా చేసుకుని టీడీపీలోని అదే సామాజికవర్గం నేత చేత ప్రతి విమర్శలు చేయించేవారు.

కాపు రిజర్వేషన్‌ హామీని అమలు చేయాలని ఉద్యమాలు చేసిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై టీడీపీలోని కాపు ప్రజా ప్రతినిధులే ప్రతి విమర్శలు చేసేవారు. ఎమ్మార్పిఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శలు చేస్తే.. ఆయన సామాజికవర్గానికి చెందిన టీడీపీలోని నేత కౌంటర్‌ ఇచ్చేవారు. అప్పటి ప్రతిపక్ష వైసీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసినా.. అక్కడ ఏ సమాజికవర్గం నేత మాట్లాడారో.. అదే సామాజికవర్గం నేతతో కౌంటర్లు ఇప్పించేవారు. ప్రతి విమర్శలు ఎలా చేయాలో కూడా ప్రత్యేకంగా స్క్రిప్ట్‌ సిద్ధం చేసి ఇచ్చేందుకు ఓ విభాగం పని చేసేది.

Also Read : ఓర్వకల్లు విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధుని పేరు పెట్టిన సీఎం జగన్

కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కాలంతోపాటు నేతలు మారిపోయారు. టీడీపీలో ఉన్నా.. ప్రత్యర్థి పార్టీపై విమర్శలు, కౌంటర్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా టీడీపీలో కాపు సామాజికవర్గ నేతల నుంచి వాయిస్‌ వినిపించడం లేదు. కాపు ఉద్యమం నేత ముద్రగడపై కూడా విమర్శలు చేసిన టీడీపీ నేతలు.. ఇప్పుడు వైసీపీ కాపు నేతల విమర్శలకు కౌంటర్లు ఇచ్చే పరిస్థితిలో లేరు. బడా బడా కాపు నేతలు ఉన్న తూర్పుగోదావరిలోనే ఈ పరిస్థితి ఉందంటే టీడీపీ దుస్థితి అర్థం చేసుకోవచ్చు.

ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడును లక్ష్యంగా చేసుకుని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోట త్రిమూర్తులు విమర్శలు చేశారు. గడిచిన ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన త్రిమూర్తులు ఆ తర్వాత వైసీపీ గూటికి చేరారు. ఆ పార్టీలో మంచి ప్రాధాన్యతను పొందారు. అమలాపురం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడుగా, మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పదవులు దక్కించుకున్నారు. అయితే తోట త్రిమూర్తులు చంద్రబాబుపై చేసిన విమర్శలకు మాజీ మంత్రి, దళిత సామాజికవర్గానికి చెందిన కేఎస్‌ జవహర్‌ కౌంటర్‌ ఇవ్వడం తూర్పులో టీడీపీ కాపు నేతల పనితీరుపై చర్చకు తావిచ్చింది.

తూర్పుగోదావరి జిల్లాలో పేరొందిన కాపు నేతలు టీడీపీలోనే ఉన్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు, ప్రత్తిపాడు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన వరుపుల రాజా.. ఇంత మంది ఉన్నా.. తోట త్రిమూర్తులకు కౌంటర్‌ మాత్రం ఇవ్వలేదు. వీరి బదులు దలిత సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ వైసీపీ నేత తోట త్రిమూర్తులకు కౌంటర్‌ ఇవ్వాల్సి వచ్చింది. పైగా.. చంద్రబాబుపై విమర్శలు చేసే బదులు కాపు జాతి ప్రయోజనాలపై గళమెత్తితో బాగుటుందని సలహా ఇచ్చారు. కాపు రిజర్వేషన్లు ఏమయ్యాయింటూ.. వాటిని ఎంతకు అమ్మారో చెప్పాలంటూ ఆ హామీ ఇచ్చిన పార్టీకి చెందిన నేతైన జవహర్‌ డిమాండ్‌ చేయడం కొసమెరుపు.

Also Read : తిరుపతి ఎన్నికల్లో బీదా రవి కనిపించటం లేదే..!!