Idream media
Idream media
ఉత్కంఠకు తెర పడింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థి ఎవరనే ప్రచారానికి ఫుల్ స్టాఫ్ పడింది. కమలం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. ప్రస్తుతం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న కంకణాల నివేదితా రెడ్డినే తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఇప్పటికే ఆమె నామినేషన్ కూడా దాఖలు చేశారు. సీటు తనకేనన్న ధీమాతో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఆమె భావించినట్లుగానే కమలం అభ్యర్థిత్వం దక్కింది.
దుబ్బాక తర హాలోనే సాగర్ ఉప ఎన్నికలోనూ గెలవాలనే లక్ష్యాన్ని బీజేపీ పెట్టుకుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై సమాలోచనలు జరిపింది. అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థి జానా రెడ్డిలను తట్టుకుని నిలబడిగలిగే బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని కసరత్తులు చేసింది. ఆర్థిక, సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంది. నియోజకవర్గంలో ఎస్టీ ఓట్లు 40 వేలు ఉండడంతో ఎస్టీ సామాజికవర్గ అభ్యర్థిని రంగంలోకి దించాలనే ఆలోచన కూడా చేసింది. రవి నాయక్, అంజయ్య యాదవ్, నివేదితా రెడ్డి, ఇంద్రసేనా రెడ్డిలు బీజేపీ టిక్కెట్ రేసులో నిలిచారు. అయితే చివరకు నివేదితా రెడ్డికే బీజేపీ సీటు దక్కింది.
నామినేషన్ దాఖలుకు రేపు మంగళవారం చివరి రోజు. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు నుంచీ అభ్యర్థి ఎన్నికలపై బీజేపీ మల్లగుల్లాలు పడింది. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు.. ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలనే లక్ష్యంతో ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి నిలవగా.. నిన్నటి వరకు టీఆర్‌ఎస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతుండా.. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు వెనకబడ్డాయి.
ఈ రోజు టీఆర్‌ఎస్ తన అభ్యర్థిగా నోముల నరసింహయ్య కుమారుడు నోముల భగత్‌ను ప్రకటించింది. నోముల మరణించడంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడినే టీఆర్‌ఎస్ బరిలోకి దించింది. కారు పార్టీ అభ్యర్థి ఎవరో తేలిపోవడంతో ఆ వెంటనే బీజేపీ కూడా తన అభ్యర్థిని ప్రకటించింది. ఈ నెల 17వ తేదీన పోలింగ్ జరగనుంది. మే 2వ తేదీన ఫలితం వెల్లడి కానుంది.
Also Read : నాగార్జునసాగర్ : టీఆర్‌ఎస్ అభ్యర్థి భగత్?