iDreamPost
iDreamPost
నటనలో సుదీర్ఘానుభవం గడించి ఎవరికీ అందనంత ఎత్తులు చూసిన లోక నాయకుడు కమల్ హాసన్ ఆ మధ్య రాజకీయాల్లోకి వెళ్లి డిజాస్టర్ కావడం ప్రత్యక్షంగా చూశాం. మళ్ళీ అందులో కొనసాగుతారో లేదో అని అనుమానం వచ్చేలా దారుణమైన ఫలితాలు అందుకున్నారు. అంత పెద్ద స్టార్ కి పొలిటికల్ గా ఇంత బ్యాడ్ ఎంట్రీ దక్కడం చాలా అరుదు. అందుకే ఇప్పట్లో ఎలక్షన్లు ఏమి లేవు కాబట్టి కమల్ మళ్ళీ సినిమాల వైపు సీరియస్ గా దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగానే ఖైదీ మాస్టర్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ రూపొందిస్తున్న విక్రమ్ సినిమా కోసం ఇటీవలే సెట్స్ లో అడుగు పెట్టారు. ఇకపై దీని షూటింగ్ లో ఏకబికిన పాల్గొంటారు
దీనికి సంబంధించిన ఒక హాట్ అప్ డేట్ ఇప్పుడు చెన్నై మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం కమల్ ఈ విక్రమ్ మూవీలో కళ్లులేని వాడిగా కనిపిస్తారట. సినిమా మొత్తం కాకపోయినా కీలక భాగంలో చాలా ఆసక్తి రేపే ఎపిసోడ్ ని ఇలా డిజైన్ చేశారట లోకేష్. కమల్ ఇలాంటి క్యారెక్టర్ లో కనిపించడం మొదటిసారి కాదు. నలభై ఏళ్ళ క్రితం 1981లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో అమావాస్య చంద్రుడు చేశారు. ఇది మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మళ్ళీ అలాంటి ప్రయోగం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు విక్రమ్ కోసం అంధుడిగా మారడం అంటే విశేషమే. అయితే ఇదింకా అఫీషియల్ గా ప్రకటించలేదు
విక్రమ్ తర్వాత కమల్ బాలన్స్ ఉన్న ఇండియన్ 2 పూర్తి చేయడం మీద అనుమానాలు అలాగే ఉన్నాయి. అటు చూస్తే దర్శకుడు శంకర్ రామ్ చరణ్ ప్రాజెక్టుతో పాటు అపరిచితుడు హిందీ రీమేక్ కోసం బిజీ అయ్యారు. మరోవైపు సగంలో వదిలేసిన శభాష్ నాయుడు కూడా ముందుకు కదల్లేదు. ఇవి కాకుండా ఎప్పుడో పాతికేళ్ల క్రితం ఆపేసిన మరుదనాయగం కూడా మళ్ళీ ఊపిరిపోసుకోవచ్చని అంటున్నారు. ఒక్క విక్రమ్ తప్ప ఇంకే సినిమాకు సంబంధించి కమల్ హాసన్ క్లారిటీతో లేరు. ఇటీవలే మాస్ట్రోలో కూడా నితిన్ కళ్ళు లేని మ్యుజిషియన్ పాత్ర చేసిన సంగతి తెలిసిందే. మరి కమల్ ఎలా కనిపిస్తారో చూడాలి
Also Read: బాక్సాఫీస్ సందడి మొదలైనట్టేనా ?