iDreamPost
iDreamPost
కాకినాడ నగర పాలక సంస్థ రాజకీయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఏపీలో మెజార్టీ ఉన్న ఏకైక నగర పాలక సంస్థలో కూడా ఇటీవల పట్టు కోల్పోయింది. రెండో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వైఎస్సార్సీపీ వ్యూహాలు ఫలించాయి. డిప్యూటీ మేయర్ గా మీసాల ఉదయ్ కుమార్ ని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీడీపీ నుంచి పలువురు కార్పోరేటర్లు తమ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో వైఎస్సార్సీపీ నేరుగా మేయర్ పై అవిశ్వాసానికి ప్రతిపాదించింది. నిబంధనల ప్రకారం మేయర్, డిప్యూటీ మేయర్ ల అవిశ్వాస తీర్మానంలో టీడీపీ కి పరాభవం ఎదురయ్యింది.
అయినప్పటికీ అవిశ్వాస తీర్మానం విషయంలో న్యాయపరమైన చిక్కుముడులతో నెట్టుకురావాలని మేయర్ సుంకర పావని ఆశించారు. టీడీపీ పెద్దల ఆశీస్సులతో ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ సహాయంతో కొంత కాలం ఈ సందిగ్ధం కొనసాగించాలని భావించారు. కానీ తీరా నిబంధనలు దానికి సహకరించకపోవడంతో కాకినాడకు కొత్త మేయర్ ఎంపిక జరిగింది. ఈసారి సుంకర శివ ప్రసన్నను మేయర్ గా ఎన్నుకోవడం విశేషం. మాజీ మేయర్ సుంకర పావని, కొత్త మేయర్ శివప్రసన్న కూడా సమీప బంధువులు. తోడికోడళ్లు. పైగా టీడీపీ తరుపున ఇద్దరూ 2017 ఎన్నికల్లో గెలిచారు. అప్పట్లో మేయర్ పీఠం కోసం పోటీ పడ్డారు. కానీ టీడీపీ అధిష్టానం ప్రధానంగా నాటి ఎంపీ తోట నరసింహం రెకమెండేషన్ తో సుంకర పావని వైపు మొగ్గు చూపింది.
ఆ తర్వాత నుంచి సుంకర శివప్రసన్న కుటుంబం టీడీపీకి దూరంగా ఉంటోంది. సాధారణ ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీ గూటిలో చేరింది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆశీస్సులతో ఆమె మేయర్ పీఠంపై కూర్చోబోతున్నారు. జనరల్ మహిళకు రిజర్వు చేసిన ఈ సీటులో కాపు మహిళలకు అవకాశం కల్పించారు. దానికి అనుగుణంగానే రాబోయే 9 నెలలకు గానూ మేయర్ గా సుంకర శివ ప్రసన్న కొనసాగబోతున్నారు. ఆమెకు ఎమ్మెల్యే ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో కాకినాడ రాజకీయాల్లో మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ నుంచి మెజార్టీ కార్పోరేటర్లు వైఎస్సార్సీపీలో చేరడం, అవిశ్వాస తీర్మానాల సందర్భంగా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన తరుణంలో నగరాభివృద్ధికి ఎమ్మెల్యే, పాలకవర్గం మధ్య సామరస్యం ఏర్పడబోతోంది. ఇది ప్రజలకు ఊరట కలిగిస్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఇక మేయర్ ఎన్నికకు సంబంధించి ఫలితాలను అధికారికంగా వెల్లడించవద్దని ఆదేశించిన కోర్టు తుది తీర్పు వెలువడబోతోంది. ఈ నేపథ్యంలో కాకినాడ నగర పాలకసంస్థ మేయర్ గా శివప్రసన్న ఎన్నిక కావడంతో ఆమె త్వరలోనే బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. కాకినాడ రాజకీయాల్లో ఇది కీలక మార్పుగా చెప్పవచ్చు.
Also Read : Kakinada Corporation – కాకినాడ మేయర్‌గా శివప్రసన్న ?