iDreamPost
android-app
ios-app

నేడు కడప స్టీల్‌ ప్లాంటుకు శంకుస్థాపన

నేడు కడప స్టీల్‌ ప్లాంటుకు శంకుస్థాపన

కడప జిల్లా వాసుల కల సాకారం వైపు అడుగులు పడుతున్నాయి. ఏళ్ల తరబడి స్టీల్‌ ప్లాంట్‌ కోసం కన్నులు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న కడప జిల్లా ప్రజల ఆశలు నెరవేర్చేలా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేడు స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నాను. జమ్మలమడుగు మండలంలో ప్లాంట్‌ ఏర్పాటు కానుంది. మూడేళ్లలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. ఈ స్టీల్‌ ప్లాంట్‌ కోసం ప్రభుత్వం హైగ్రేడ్‌ స్టీల్‌ సంస్థను ఏర్పాటు చేసింది. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థతో హైగ్రేడ్‌ స్టీల్‌ ఇటీవల ఒప్పందం కుదుర్చుంకుంది. ఏడాదికి జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఐదు వేల టన్నుల ముడి ఇనుప ఖనిజం సర ఫరా చేయనుంది. సీమలోని ఘనుల నుంచే ముడి ఖనిజం సరఫరా జరుగనుంది.


ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..

ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్న రాయలసీమలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు వల్ల ఆ ప్రాంతం అనేక విధాలుగా అభివృద్ధి చెందనుంది. ముఖ్యంగా స్టీల్‌ ప్లాంట్‌ వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. ప్రత్యక్షంగా 8 వేల మందికి, పరోక్షంగా మరో 10 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్టీల్‌ ప్లాంట్‌ వల్ల కలుగనున్నాయి. ఈ నేపధ్యంలో రాయలసీమ వాసులు స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


వైఎస్‌ అడుగు.. జగన్‌తో పూర్తి..

కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అడుగు వేశారు. 2007లో బ్రహ్మణి స్టీల్‌ పేరుతో ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. దాదాపు 10, 670 ఎకరాల భూమిని సేకరించారు. అయితే 2009లో వైఎస్‌ఆర్‌ అకాల మరణంతో ప్లాంట్‌ ఏర్పాటు పనులు నిలిచిపోయాయి. 2012లో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమర్‌రెడ్డి ప్లాంట్‌కు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకున్నారు. ఇక 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కడప స్టీల్‌ ప్లాంట్‌ పైలాన్‌ ఆవిష్కరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి నేడు సోమవారం స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయబోతున్నారు. తండ్రి వైఎస్‌ వేసిన అడుగు.. కొడుకు జగన్‌ పూర్తి చేస్తున్నారని రాయలసీమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.