iDreamPost
android-app
ios-app

పరిషత్‌ ఎన్నికల బహిష్కరణ ఎఫెక్ట్‌.. టీడీపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా

పరిషత్‌ ఎన్నికల బహిష్కరణ ఎఫెక్ట్‌.. టీడీపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా

మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు నామినేషన్లు కూడా వేసి కూడా ఇప్పుడు ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికల నుంచి తప్పుకోవడంపై ఆ పార్టీ సీనియర్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కుతున్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ పదవుల రాజీనామాకు తెర లేసింది.

పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు చెప్పిన గంటల వ్యవధిలోనే పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. చంద్రబాబు నిర్ణయం తీవ్ర అసంతృప్తిని కలిగించిందని నెహ్రూ బహిరంగంగా ప్రకటించారు. పార్టీ ఉపాధ్యక్షుడుగా కొనసాగలేనని, నియోజకవర్గ ఇంఛార్జిగా మాత్రమే కొనసాగుతానని జ్యోతుల వెల్లడించారు. నియోజకవర్గంలోని కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు.

తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయ ఆరంగేట్రం చేసిన జ్యోతుల వెంకట అప్పారావు అలియాస్‌ నెహ్రూ.. 1994, 1999 ఎన్నికల్లో వరుసగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం నుంచి శాసన సభకు ఎన్నికయ్యారు. 2004లో ఓటమి చవిచూశారు. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి అభిమాని అయిన ఆయన కుమారుడు జ్యోతుల నవీన్‌ కుమార్‌ ప్రొద్బలంతో ప్రజా రాజ్యం పార్టీలో చేరి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. జగ్గంపేట నుంచే మళ్లీ పోటీ చేసినా ఓటమి తప్పలేదు. పీఆర్‌పీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత ఆ పార్టీ నాయకులు తమ దారి తాము చూసుకున్నారు. నెహ్రూ వైసీపీలో చేరారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, కాపు సామాజికవర్గం నేత కావడంతో సీఎం జగన్‌ జ్యోతుల నెహ్రూకు పార్టీలో సముచిత స్థానం ఇచ్చారు. వైసీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పదవిని కట్టబెట్టారు.

Also Read : పరిషత్ బహిష్కరణపై టీడీపీ సీనియర్ల అసంతృప్తి

2014 ఎన్నికల్లో జగ్గంపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నెహ్రూ దశాబ్ధం తర్వాత గెలుపు రుచి చూశారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ నెహ్రూకు జగన్‌ పెద్దపీట వేశారు. శాసన సభలో ఉప నేతగా నియమించారు. పార్టీలో జగన్‌ తర్వాత నెంబర్‌ 2 ఎవరంటే.. జ్యోతుల నెహ్రూ పేరు అప్పట్లో వినిపించేది. పార్టీలోనూ ఉన్నత స్థాయి పదవులు కల్పించారు.

అయితే టీడీపీ పన్నిన ఉచ్చులో నెహ్రూ పడిపోయాడు. టీడీపీ మంత్రి పదవి ఆశ చూపడంతో పార్టీ ఫిరాయించారు. మంత్రి పదవి దక్కలేదు. ఏడాదిపాటు ఎదురు చూసిన నెహ్రూ మంత్రి పదవి ఆశలు వదిలేసుకున్నారు. కనీసం తమ కుమారుడికైనా ఏదో ఒక పదవి ఇవ్వాలనే స్థితికి వచ్చారు. దీంతో జెడ్పీ చైర్మన్‌ స్థానంలో ఉన్న నామన రాంబాబు స్థానంలో నెహ్రూ కుమారుడు నవీన్‌ కుమార్‌ను చైర్మన్‌గా చేశారు. రెండున్నరేళ్ల కాలం నవీన్‌ ఆ పదవిలో కొనసాగారు.

తనతోపాటు తన తోడళ్లుడు అయిన పక్క నియోజకవర్గం ప్రత్తిపాడు ఎమ్మెల్యే తోట సుబ్బారావును కూడా టీడీపీలోకి తీసుకువెళ్లిన నెహ్రూకు 2019 ఎన్నికల్లో తాను చేసిన తప్పు ఏమిటి..? ఏం నష్టపోయానో అర్థం అయింది. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన నెహ్రూ, సుబ్బారావులు ఓటమి చవిచూశారు. వరుసగా రెండోసారి జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో వైసీపీ జెండా రెపరెపలాడింది.

వైసీపీ ప్రభుత్వంలో తూర్పు గోదావరి జిల్లా నుంచి ముగ్గురు నేతలకు మంత్రి పదవులు దక్కాయి. మండపేట నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసిన పిల్లి సుభాష్‌ చంద్రబోష్‌కు కీలకమైన రెవెన్యూ, కాపు సామాజికవర్గానికి చెందిన కురసాల కన్నబాబుకు వ్యవసాయ శాఖ, అమలాపురం నుంచి గెలిచిన పినిపే విశ్వరూప్‌కు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పదవులు దక్కాయి. పిల్లి సుభాష్‌ తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ స్థానంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంత్రి అయ్యారు.

నెహ్రూ వైసీపీలోనే ఉంటే మళ్లీ గెలిచేవారు.. జగన్‌ కేబినెట్‌లో కీలక పదవి దక్కించుకునేవారు. కానీ ఇప్పుడు టీడీపీకి కూడా దూరంగా జరిగే నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్‌లో జ్యోతుల పయనం ఎటు సాగుతుందో చూడాలి.

Also Read : పరిషత్ ఎన్నికల బహిష్కరణ పై బాబు చెప్పిన కారణాలు ..