iDreamPost
android-app
ios-app

జూలై 1 – థియేటర్లలో 8 సినిమాలు

  • Published Jun 29, 2022 | 3:27 PM Updated Updated Jun 29, 2022 | 3:27 PM
జూలై 1 – థియేటర్లలో 8 సినిమాలు

గత శుక్రవారం పోటీ పడుతూ వచ్చిన ఎనిమిది సినిమాల్లో ఏదీ పూర్తి స్థాయిలో మెప్పించలేక ఫస్ట్ వీక్ కే ప్యాకప్ కు రెడీ అవ్వడం చూస్తున్నాం. అంతో ఇంతో అంచనాలున్న చోర్ బజార్, సమ్మతమేలు సైతం నిరాశపరిచాయి. ముఖ్యంగా గత రెండు రోజులుగా చాలా చోట్ల నెగటివ్ షేర్లు నమోదయ్యాయి. వీటి పరిస్థితే ఇలా ఉంటే రాబోయే ఫ్రైడే కూడా ఇదే రేంజ్ బొమ్మలు బరిలో దిగబోతున్నాయి. కాకపోతే కాస్త ప్రామిసింగ్ కంటెంట్ ఉన్నవి కనిపిస్తుండటం ఊరట కలిగించే విషయం. గోపీచంద్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పక్కా కమర్షియల్’ మీద హైప్ బాగానే ఉంది. మినిమమ్ టాక్ వచ్చినా చాలు ప్రతిరోజు పండగేలా హిట్టు కొట్టేయొచ్చు.

మాధవన్ హీరోగా రూపొందుతున్న రియల్ లైఫ్ బయోపిక్ ‘రాకెట్రీ’ మీద చెప్పుకోదగ్గ బజ్ లేదు. ఇలాంటి సైంటిస్ట్ డ్రామాలను జనం ఎంతమేరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదరిస్తారనేది వేచి చూడాలి. మాధవన్ స్వీయ దర్శకత్వంలో ఇది రూపొందింది. సూర్యతో సింగం సిరీస్ ద్వారా మనకు పరిచయమున్న దర్శకుడు హరి తీసిన ‘ఏనుగు’కు పెద్ద రిలీజే దక్కుతోంది. సాహో విలన్ అరుణ్ విజయ్ ఇందులో హీరో. ట్రైలర్ ఊర మాస్ గా ఉంది. వాళ్లకు కనెక్ట్ అయితే చాలు ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. నిన్న వారం వాయిదా పడ్డ ‘టెన్త్ క్లాస్ డైరీస్’, ‘షికారు’లకు పబ్లిసిటీ బాగానే చేస్తున్నారు. ఓపెనింగ్స్ మీద నమ్మకం లేదు కానీ టాకే కాపాడాలి.

ఇవి కాకుండా ఏమైపోతావే, ఈవిల్ లైఫ్, బాల్రాజు అనే మరో మూడు చిన్న సినిమాలు రేస్ లో ఉన్నాయి. అసలు వీటికి పబ్లిక్ కనీస స్థాయిలో రావడం కూడా అనుమానమే. హాలీవుడ్ మూవీ ‘మినియన్స్ ది రైజ్ అఫ్ గ్రూ’ త్రిడి వెర్షన్ తో పాటు అన్ని భాషల్లోనూ రాబోతోంది. యానిమేటెడ్ సిరీస్ కాబట్టి మరీ స్పైడర్ మ్యాన్ రేంజ్ హైప్ లేదు కానీ ఉన్నంతలో చిన్నపిల్లలను టార్గెట్ చేసే మూవీ ఇది. మొత్తానికి ఇన్నేసి రాబోతున్నా కూడా టికెట్ కౌంటర్ల దగ్గర ఉండాల్సిన జోష్ ఏ మేరకు కనిపిస్తుందన్నది అనుమానమే. పక్కా కమర్షియల్ మీద ట్రేడ్ చాలా ఆశలు పెట్టుకుంది. విక్రమ్, మేజర్ తర్వాత ఆ స్థాయిలో హౌస్ ఫుల్ బోర్డులు వేసుకున్న సినిమా రాలేదు మరి.