iDreamPost
android-app
ios-app

ప్యారిస్‌లోనూ, ప‌ల‌మ‌నేరులోనూ పోలీసులు ఒక‌టే!

ప్యారిస్‌లోనూ, ప‌ల‌మ‌నేరులోనూ పోలీసులు ఒక‌టే!

పోలీసులు ఎక్క‌డైనా పోలీసులే. ఫ్రాన్స్‌లోనైనా, ప‌ల‌మ‌నేరులో అయినా ఒక‌టే. జ‌ర్న‌లిస్ట్‌ల్ని కొట్ట‌డం వాళ్ల హాబీ. త‌న్నులు తిని ఆందోళ‌న చేయ‌డం వీళ్ల‌కి అల‌వాటు.

1988లో జ‌ర్న‌లిస్ట్‌గా ఉద్యోగంలో చేరినపుడు 15 మంది డెస్క్ జ‌ర్న‌లిస్టులుంటే ఏడుగురికి క‌థ‌లు క‌విత్వం సీరియ‌న్‌గా రాసే అల‌వాటుండేది. మిగిలిన వాళ్ల‌కి సాహిత్యంతో , రాజ‌కీయాల‌తో సాన్నిహిత్య‌ముండేది. ఒక‌రిద్ద‌రు మిన‌హాయిస్తే అంద‌రికీ ఒక ఐడియాల‌జీ వుండేది. సీపీఐ, సీపీఎం, విప్ల‌వ రాజ‌కీయాలు, టీడీపీ, కాంగ్రెస్‌, ఆర్ఎస్ఎస్ … అభిప్రాయ భేదాలుండొచ్చు, కానీ స్ప‌ష్ట‌మైన అభిప్రాయాలుండేవి. వాటిని బ‌ల‌ప‌రిచే జ్ఞానం, వాదం వుండేవి. ఉపాధి కోసం కాకుండా ఒక వృత్తిగా జ‌ర్న‌లిజాన్ని న‌మ్మి వ‌చ్చే వాళ్లు ఎక్కువ‌గా.

2014 నాటికి అన్ని ప‌త్రిక‌ల్లోనూ డెస్క్ జ‌ర్న‌లిస్టుల్లో ఒక‌రిద్ద‌రిని మిన‌హాయిస్తే మిగిలిన వాళ్ల‌కి అదొక ఉద్యోగం మాత్ర‌మే. పుస్త‌కాలు చ‌దివే అలవాటు త‌క్కువ‌. సాహిత్యంతో సంబంధం లేదు. ఇక ఫీల్డ్ జ‌ర్న‌లిస్టుల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

జ‌ర్న‌లిస్ట్‌ల మెచ్యూరిటీ లెవెల్స్ మారొచ్చు కానీ పోలీసుల మెచ్యూరిటీ బ్రిటిష్ కాలం నుంచి ఒక‌టే. లాఠీ ప‌ట్టుకుంటే, ఉత‌క‌డ‌మే. ప‌నిలో ప‌నిగా అపుడ‌పుడు జ‌ర్న‌లిస్ట్‌ల‌ని వుతికే వాళ్లు. ఎక్కువ ఇబ్బందులు ఫొటోగ్రాప‌ర్ల‌కే వ‌చ్చేవి. వాళ్లు ఎలాగో ఒక‌లా తోసుకుంటూ అయినా ఫొటో తీసేవాళ్లు. ఇపుడున్నంత టెక్నాల‌జీ లేక‌పోవ‌డం వ‌ల్ల ఫొటో మిస్ కాకుండా చూసుకోవ‌డం ముఖ్యం.

తిరుప‌తిలో అంతా స‌జావుగా జ‌రిగేది కానీ ముఖ్య‌మంత్రి టూర్‌, బ్ర‌హ్మోత్స‌వాలు ఈ రెండు సంద‌ర్భాల్లో పోలీసుల‌తో గ్యారంటీగా గొడ‌వ అయ్యేది. మిగిలిన ప్రోగ్రామ్స్‌లో లోక‌ల్ పోలీసులుంటారు కాబ‌ట్టి ఇబ్బంది వుండేది కాదు. ప్ర‌త్యేక‌మైన ప్రొగ్రామ్స్‌కి బ‌య‌టి నుంచి వ‌చ్చిన పోలీసుల‌కి తెలియ‌దు కాబ‌ట్టి గొడ‌వ‌లు జ‌రిగేవి. నేను 4 ఏళ్లు జ‌ర్న‌లిస్ట్ యూనియ‌న్ అధ్య‌క్షుడిగా (చిత్తూరు జిల్లా) వున్న‌పుడు ప్ర‌ధానంగా చేసింది పోలీసుల జులుం న‌శించాలి అని ధ‌ర్నా చేసి అధికారుల‌కి విజ్ఞ‌ప్తి ప‌త్రం స‌మ‌ర్పించ‌డం, త‌ర్వాత ఇరువ‌ర్గాలు రాజీప‌డి టీ తాగి ఎవ‌రి ప‌ని వాళ్లు చేసుకోవ‌డం. సాయంత్ర‌మైతే క్రైం వార్త‌లు చెప్పాల్సింది పోలీసులే.

ఈ మ‌ధ్య పారిన్‌లో ఒక ఫొటోగ్రాఫ‌ర్‌ని పోలీసులు చావ‌బాదారు. ఐడెంటిటీ చూపించినా వ‌ద‌ల్లేదు. దీనికి తోడు పోలీసుల దౌర్జ‌న్యాన్ని చిత్రీక‌రిస్తే 45 వేల యూరోల జ‌రిమానా, జైలుశిక్ష అని చ‌ట్టం తెచ్చారు. అదింకా స‌భ‌ల ఆమోదం పొంద‌లేదు. అయినా దేశ‌మంతా నిర‌స‌న‌లు మొద‌ల‌య్యాయి. పోలీసుల‌కు పూర్తి అధికారాలు ఇస్తే ఏమ‌వుతుందో , దాని ఫ‌లితాలు చాలా దేశాలు ఇప్ప‌టికే చూసాయి, చూస్తున్నాయి. అయినా పోలీసుల‌కి ఒక‌రిచ్చేదేంటి! వాళ్లే పుచ్చుకుంటారు.