iDreamPost
iDreamPost
జేఎన్యూలో ఫీజులో పెంపుదలతో మొదలయిన విద్యార్థుల ఆందోళన ఉధృత రూపం దాలుస్తోంది. ఆ వెంటనే సీఏఏకి వ్యతిరేకంగా స్వరం వినిపించారు. ఎన్నార్సీని నిరసిస్తూ పోరు సాగించారు. ఈ పరిణామాలకు తోడుగా జేఎన్యూ సబర్మతి హాస్టల్ లో ముసుగులేసుకు వచ్చిన ముష్కరులు అంధులు, అమ్మాయిలు అనే తేడా లేకుండా హాకీ స్టిక్స్ , రాడ్డులతో దాడి చేయడం కలకలం రేపింది. దేశమంతా విద్యార్థి ఉద్యమం ఎగిసిపడుతోంది. దాడి చేసింది ఏబీవీపీ కార్యకర్తలేనని ఆ శిబిరానికి చెందిన నాయకులు టైమ్స్ నౌ చర్చలో అంగీకరించగా, వికాస్ పటేల్ వంటి వారు కేవలం ఆత్మరక్షణ కోసం క్యాంపస్ లో మారణాయుధాలు తీసుకెళ్లారని సర్థిచెప్పుకునే ప్రయత్నం చేశారు.
అదే సమయంలో దాడికి బాధ్యత మాదేనంటూ హిందూరక్షాదళ్ పేరుతో ఆర్ఎస్ఎస్ క్యాంప్ కి చెందిన పింకీ చౌదరి వీడియో విడుదల చేశారు. తనతో పాటు భూపేంద్ర తోమర్ ఈ దాడికి బాధ్యత తీసుకుంటున్నామని వెల్లడించారు. తీవ్రవాదులు దాడులు చేసి, ఆ తర్వాత తామే బాధ్యత తీసుకుంటున్నట్టు చెప్పడం ఇప్పటి వరకూ చూశాం. వారికి ఉచ్ఛనీచాలు ఉండవు. సరిగ్గా ఇప్పుడు అర్బన్ తీవ్రవాదులంటూ నెటిజన్లు ఆరోపిస్తున్న ఈ సెక్షన్ కూడా అదే రీతిలో వ్యవహరించింది. విద్యార్థి సంఘం అధ్యక్షురాలితో పాటుగా మరో అంధుడిని కూడా తీవ్రంగా గాయపరిచింది. దేశంలోనే అత్యున్నత అధ్యాపకులలో ఒకరైన సుచిత్ర సేన్ మీద దాడికి పూనుకుంది. అయినా ఇప్పటి వరకూ పోలీసులు స్పందించలేదు. మేమే దాడి చేసినట్టు కొందరు ముందుకొచ్చి వీడియో సాక్షిగా చెబుతున్నా పోలీసులు మాత్రం ఇంకా ఆధారాలు లభించలేదని చెప్పడం విస్మయకరంగా ఉంది.
ఈ పరిణామాలు విద్యార్థులను మరింత ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. అదే సమయంలో విద్యార్థులకు అండగా బాలీవుడ్ సెలబ్రిటీలు కదులుతున్నారు. ఇన్నాళ్లుగా ట్విట్టర్ లో తమ వైఖరి వెల్లడించేందుకు మాత్రమే పరిమితమయిన పలువురు ఇప్పుడు వీధుల్లోకి వస్తున్నారు. ముంబై గేట్ ఆఫ్ ఇండియా ముందు 24గంటల పాటు సాగిన నిరసన ఆ తర్వాత ఆజాదీ మైదాన్ కి పోలీసులు తరలించారు. జేఎన్యూలో విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ చలిలో కూడా నిరంతరాయంగా ఆందోళన సాగిస్తున్నారు. వారికి మద్ధతుతుగా అనురాగ్ కశ్యప్, స్వర భాస్కర్ తో పాటుగా తాప్సీ పన్ను, దియామీర్జా సహా పలువురు బాలీవుడ్ నటీనటులు తరలివచ్చారు విద్యార్థులకు అండగా ఉంటామని ప్రకటించారు.
వాటికి కొనసాగింపుగా ఢిల్లీ జేఎన్యూలో దీపిక పడుకునే ప్రత్యక్షమయ్యారు. అయిష ఘోష్ ,, కన్నయ్య కుమార్ వంటి వారు పాల్గొన్న నిరసన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఏమీ మాట్లాడకపోయినా బాధితులను పరామర్శించి, విద్యార్థులకు తాను అండగా ఉంటామనే సంకేతమిచ్చారు. విద్యార్థుల నిరసనలకు సంఘీభావం ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది. దీపిక తీరు కొందరు కాషాయ గుంపు వారికి గిట్టలేదని ట్విట్టర్ లో ఆమెకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం చాటుతోంది. ఈవారంలోనే ఆమె సినిమా విడదల కావాల్సి ఉంది. దానికి అధికార పక్షం నుంచి ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఆర్ఎస్ఎస్ శిబిరం నుంచి ట్రోలింగ్ చేయడం ఇప్పటికే ప్రారంభమయ్యింది. ఇలాంటి వ్యవహారాలన్నీ తెలిసినా దీపిక ముందడుగు వేయడాన్ని పలువురు అభినందిస్తున్నారు.
ఇక బెంగళూరు, కోల్ కతా, చెన్నై వంటి మహానగరాల్లో కూడా నిరసనలు తీవ్రస్థాయిలో సాగుతున్నాయి. క్యాంపస్ లోకి వచ్చిన గుండాగిరీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నినదిస్తున్నారు. ఈ పరిణామాలతో దేశంలో విద్యార్థి ఉద్యమం ఉత్తుంగ తరంగంగా ఎగిసిపడుతుందని చెప్పవచ్చు. దేశంలో అనేక కీలక రాజకీయ పరిణామాల్లో చైతన్యవంతమైన విద్యార్థుల పాత్ర ఉంది. ఇప్పుడు మరోసారి అలాంటి రూపం దాల్చిన ఈ ఉద్యమం అందరినీ కదిలించేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఆనంద్ మహీంద్ర వంటి కార్పోరేట్ ప్రముఖులు సైతం స్వరం కలుపుతున్న తరుణంలో దేశ యవనికపై పెను ప్రభావం చూపే దిశలో సాగుతుందని చెప్పవచ్చు.