ఏ ఎండకు ఆ గొడుగు పట్టే జేసీ సోదరుల వాయిస్ లో ఏదో కొత్త స్వరం వినిపిస్తోంది. తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టిడిపి తరఫున మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మీద ప్రశంసలు కురిపించడం కొత్త చర్చకు దారితీస్తోంది. వైయస్ రాజశేఖర్రెడ్డి నైతిక విలువలను జగన్ పాతీస్తున్నారంటూ ఆయన మాట్లాడటం చూస్తుంటే మళ్ళీ ఎక్కడో తేడా కనిపిస్తోంది.
ప్రభాకర్ రెడ్డి అన్నది అక్షర సత్యం
తాడిపత్రి మున్సిపాలిటీలో అధికార పార్టీ నైతికత పాటించక పోతే అక్కడ కూడా వైఎస్ఆర్సిపి జెండా ఎగిరేది. టీడీపీకి వైఎస్సార్ సిపి కు సమానమైన ఓట్లు వచ్చిన సమయంలో స్వతంత్ర అభ్యర్థి మద్దతు కీలకం అయింది. మొదటి నుంచి టీడీపీ శిబిరంలోనే ఉన్న స్వతంత్ర అభ్యర్థిని ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా, అతని ఇష్టానికే అధికార పార్టీ వదిలేసింది. ఎలాంటి ఒత్తిళ్ళు ప్రలోభాలకు పెట్టకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో తాడిపత్రి ఎన్నిక జరగడానికి వైఎస్ఆర్సిపి చొరవ తీసుకుంది. స్వతంత్ర అభ్యర్థి అధికార పార్టీ మభ్యపెట్టడం పెద్ద విషయం కాదు. అయితే జగన్ దానికి పూర్తిగా విరుద్ధం. ప్రజాస్వామ్య పద్ధతిలోనే మసలుకోవాలని, ఇండిపెండెంట్ ఎవరికీ మద్దతు తెలుపుతారా అనేది అతనికే స్వేచ్ఛ ఇవ్వాలని సీఎం సూచనలతో స్థానిక నాయకులు ఎలాంటి రాజకీయాలు లేకుండా ఎన్నిక జరిగేలా చూశారు. చివరకు స్వతంత్ర అభ్యర్థి టిడిపి శిబిరంలోనే ఉండడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అవడానికి అధికార పార్టీని మార్గం సుగమం చేసినట్లు అయింది. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనించే జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్ తీరు నేర్చుకున్నట్లు అర్థమవుతోంది.
పాత విషయాలు మర్చిపోగాలమా?
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా సాక్షి కార్యాలయం ముందు టెంట్ వేసి మరీ జగన్ను ఆయన కుటుంబ సభ్యులను అనరాని మాటలు అన్న జెసి ప్రభాకర్ రెడ్డి కి ఇప్పుడు జగన్ విలువ తెలిసినట్లు కనిపిస్తోంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్న సత్యాన్ని ఇప్పుడిప్పుడే జేసీ సోదరులు గమనిస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకవైపు ఆర్థికంగా మరోవైపు రాజకీయంగా పూర్తిగా చితికిపోయే దశలో ఉన్న జేసీ కుటుంబం పరువు కాపాడుకునేందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి చివరిగా మున్సిపల్ చైర్మన్ బరిలో నిలిచారు. ఎన్నికల్లో రకరకాల స్టంట్లు చేసి, అనుభావాన్ని పోగేసి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు. అయితే ఇప్పుడు మున్సిపాలిటీకి నిధులు రావాలంటే ప్రభుత్వ సహకారం, స్థానిక ప్రజాప్రతినిధుల అవసరం ఉండబట్టే జేసీ ప్రభాకర్రెడ్డి మళ్లీ కొత్త డ్రామాకు తెరతీశారు అన్న వాదన లేకపోలేదు.
అప్పటికప్పుడే మాట మారుస్తూ టిడిపి సభలో వైఎస్ కుటుంబాన్ని తులనాడుతూ, అవసరం అయినప్పుడు జగన్ మా వాడు అనడంలో జేసీ సోదరులు దిట్ట. ఒకవైపు త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ మూసి వేసే దశలో ఉండడం, జెసి సోదరుల ఆధ్వర్యంలో ఉన్న మైన్స్ అక్రమమని తేలడం, దొంగ సర్టిఫికెట్ లతో ప్రభాకర్ ట్రావెల్స్ మీద క్రిమినల్ కేసులు నమోదు అవ్వడంతో పాటు ఆర్థిక మూలాలకు భారీగా గండి పడటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో జెసి సోదరుల పడ్డారు. మరోపక్క రాజకీయంగా నమ్ముకున్న టిడిపి పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోవడం తో ఏం చేయాలో అంతుబట్టని పరిస్థితిలో నెట్టుకొస్తున్నారు. నిన్నమొన్నటి వరకు తనకు ఎలాంటి పదవులు అక్కర్లేదని, కేవలం కౌన్సిలర్ గా గెలిచిన సేవ చేసుకుంటానంటూ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి మెజార్టీ సభ్యులు గెలవగానే మున్సిపల్ చైర్మన్ అయ్యేందుకు రెడీ అయిపోయారు. ఏదో ఒక పదవి చేతిలో ఉంటే కానీ తాడిపత్రిలో నెట్టుకు రాలేం అన్న భావనతోనే, ప్రత్యర్థుల చేతిలో చులకన అవుతాము అనే కోణంలోనే జెసి సోదరులు ఇప్పుడు ఈ కొత్త పంధా తీసుకున్నట్లు అర్థమవుతోంది.
జెసి సోదరులు అనంతపురం రాజకీయాల్లో ఎప్పటినుంచో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం టిడిపి లో ఉన్న వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో పార్టీ మార్పు ఆలోచనను సైతం వీరు చేస్తున్నట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. గతంలోనే జేసీ దివాకర్ రెడ్డి బిజెపి లోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ దిశగానే కొన్ని చర్చలు జరిగాయి. అలాగే జెసి దివాకర్ రెడ్డి కొడుకు పవన్ కు ముఖ్యమంత్రి జగన్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. పవన్ వైఎస్సార్సీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగినా తర్వాత కొన్ని కారణాల రీత్యా జేసి కుటుంబమంతా తెలుగుదేశంలోనే ఉండిపోవాల్సివచ్చింది.
అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్న దృష్ట్యా తెలుగు దేశంలో ఉంటే తమ ఉనికికే ప్రమాదం అని భావించిన జెసి సోదరులు పార్టీ మార్పు పైన ఆలోచిస్తున్నారని, ఈ కారణంతోనే జెసి సోదరుల మాటల్లో మార్పు కనిపిస్తోంది అని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకపక్క టిడిపి పని అయిపోయిందని, ఆ పార్టీలో కార్యకర్తల బలం ఉంది గాని, నేతల్లో చాలామంది వృధా అని వ్యాఖ్యానించిన 24 గంటల్లోపే జగన్ స్వరం ఎత్తుకోవడం చూస్తుంటే జెసి సోదరులు త్వరలోనే రాజకీయ మలుపు తీసుకునే అవకాశం లేకపోలేదు అన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
Also Read : టీడీపీదే తాడిపత్రి.. మరోసారి చైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి