పెద్దారెడ్డి కొడుకు vs జేసీ ప్రభాకర్ రెడ్డి .. తాడిపత్రి మున్సిపల్ పోరు

స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించిన జేసీ ఫ్యామిలీ అనూహ్యంగా రంగంలోకి దిగింది. తాడిపత్రి మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌ పదవికి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేసిన సంచలనం సృష్టించారు. ఆయన 30వ వార్డు నుంచి బరిలోకి దిగారు.

గత ఎన్నికల్లో అనంతపురం ఎంపీ, తాడిపత్రి ఎమ్మెల్యే స్థానాల్లో ఓటమిపాలైన జేసీ కుటుంబం స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్లుగా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభాకర్‌ రెడ్డి కౌన్సిలర్‌గా పోటీ చేయడం వెనుక ఒక ప్రధాన కారణం ఉంది. ఈ వార్డు నుంచి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద కుమారుడు హర్షవర్థన్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. అందుకే జేసీ ప్రభాకర్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేసినట్లు అర్థమవుతోంది.

గత ఎన్నికల్లో తాడిపత్రి అసెంబ్లీ నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ తరఫున జేసీ ప్రభాకర్‌ రెడ్డి కుమారుడు అశ్వథ్‌రెడ్డి బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలిచారు. తన కొడుకును ఓడించిన పెద్దారెడ్డిని దెబ్బకు దెబ్బతీయాలనే లక్ష్యంతో ఆయన కుమారుడుపై ప్రభాకర్‌ రెడ్డి కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్నారు.

జేసీ కుటుంబం తిరిగి బరిలోకి రావడంతోపాటు.. తాడిపత్రి మున్సిపల్‌ ఎన్నికల్లో తాతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ రెడ్డి మధ్య కౌన్సిలర్‌ కుర్చి కోసం ఆసక్తికర పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో మున్సిపల్‌ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యేగా పని చేసిన ప్రభాకర్‌ రెడ్డి.. తన స్థాయిని తగ్గించుకుని మరీ కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి దెబ్బకు దెబ్బ తీస్తారా..? లేదా కౌన్సిలర్‌ ఎన్నికల్లోనూ శృంగభంగం తప్పదా..? వేచి చూడాలి.  కాగా , తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ స్థానం జనరల్ కోటాలో ఉంది.

Show comments