అనంతపురం లోని మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి కి చెందిన జెసి ట్రావెల్స్ సంస్థ పై పోలీస్ అధికారులు జరిపిన సోదాల్లో నకిలీ ఫోర్జరీ పత్రాలు సృష్టించి అక్రంగా బెంగుళూరులో ఆరు లారీలు అమ్మిన వైనం అధికారుల సోదాల్లో బయటపడింది. సాధారణంగా ప్రయివేట్ లారీలు, ట్రక్కులు అమ్మాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో జెసి ట్రావెల్స్ సంస్థ సిబ్బంది నకిలీ పత్రాలు, స్టాంపులు సృష్టించి తాడిపత్రి సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి, అక్రమంగా లారీలను బెంగుళూరులో అమ్మినట్టు తెలుస్తుంది.
ఈ ఘటనకి సంబంధించి పోలీసులు ఇప్పటికే జేసి ట్రావెల్స్ ఆఫీస్ లో ఆరు ఫోర్జరీ డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి జెసి ట్రావెల్స్ కు చెందిన రఘు, నాగేంద్ర అనే ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో జెసి యాజమాన్యం ఆదేశాల మేరకే తాము నకిలీ పత్రాలను సృష్టించామని ఆ ఇద్దరు ఉద్యోగులు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు పరారీలో ఉన్న జెసి ట్రావెల్స్ కి చెందిన రామ్మూర్తి, ఇమామ్ అనే ఇద్దరు ఉద్యోగుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.
ఇప్పటికే మాజీ మంత్రి జెసి బ్రదర్స్ కు చెందిన త్రిశుల్ కంపెనీకి కేటాయించిన సున్నపురాయి గనులను ప్రభుత్వం రద్దు చేయడం, మరోవైపు సరైన అనుమతి పత్రాలు లేకుండా తిరుగుతున్న జెసి ట్రావెల్స్ బస్సులపై వరుస దాడులు చేసి 50 కి పైగా బస్సులను రవణా శాఖ అధికారులు సీజ్ చేసిన నేపథ్యంలో, ఈరోజు జెసి ట్రావెల్స్ పై పోలీసులు జరిపిన సోదాల్లో జెసి ట్రావెల్స్ సిబ్బంది నకిలీ స్టాంపులతో, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టిస్తున్న దందా బయటపడడం సంచలనంగా మారింది. ప్రస్తుతం జెసి ప్రభాకర రెడ్డి సతీమణి ఉమాదేవి జెసి ట్రావెల్స్ కి యండి గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆమెని కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది.