Idream media
Idream media
సీనియర్ నటి జయంతి చనిపోయారు. ఆమె అసలు పేరు కమలకుమారి. ఆమె మా ముందు తరం హీరోయిన్. అయితే నాకు చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి. పదేళ్ల వయసు నుంచే విజయచిత్ర, సినిమా రంగం పత్రికలు చదివే అలవాటు.
1973లో ఫస్ట్ టైం సినిమా రంగంలో జయంతి ఇంటర్వ్యూ చూసాను. పతియే ప్రత్యక్ష దైవం అనే హెడ్డింగ్ గుర్తు. పేకేటి శివరామ్ ఆమెని రెండోపెళ్లి చేసుకున్నారు. ఆయన పాదాలకి నమస్కరిస్తూ , ఇలా మూడు నాలుగు ఫొటోలు వేశారు. ఎందుకో జయంతి మీద కోపం. మా వూళ్లో రెండుమూడు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు వుండేవారు. సహజంగానే వాళ్లు డబ్బున్న వాళ్లుగా వుండేది. మా వీధిలోని అమ్మలక్కలు ఒకచోట చేరితే రెండో పెళ్లి వాన్ని చేసుకున్న ఆడాళ్లని తిట్టిపోసేవాళ్లు.
“వాడికి బుద్ధిలేకపోతే దీనికేమైంది” అనేవాళ్లు. సొంత అభిప్రాయాలు వుండే వయసు కాదు కదా, అందుకే కోపం. తరువాత రెండు మూడేళ్లకే విడాకులిచ్చిందని సంతోషం. ఎంత అమాయకత్వం అంటే దేవదాసులో నాగేశ్వరరావుకి మందు తాగిస్తాడు కాబట్టి పేకేటి అంటే కోపం. నిజ జీవితంలో కూడా దుర్మార్గుడనే అభిప్రాయం. సత్యనారాయణ కనీసం పది మందినైనా హత్య చేసుంటాడని నమ్మేవాన్ని. శారద సినిమాలో అన్నయ్యగా ఆయన్ని చూసిన తరువాతే మంచోడని నమ్మకం కుదిరింది.
రాయదుర్గానికి కన్నడ సినిమాలు కూడా వచ్చేవి. రాజ్‌కుమార్, జయంతి హీరోహీరోయిన్లుగా చాలా చూశాను. గొప్ప గ్లామర్ కాదు కానీ, గొంతు భలే బావుంటుంది. ఎడకల్లు గుడ్డద మేలే అని ఒక సినిమా వచ్చింది. నాకు తెలిసి నేను పోస్టర్ చూసిన తొలి A సర్టిఫికెట్ సినిమా. వెళదామనుకున్నా గానీ, ఎవరైనా చూస్తే బెత్తాలు విరిగిపోతాయి. కొంచెం పెద్దాడు అయ్యాకా ఈ సినిమా కథ తెలిసి ఆశ్చర్యపోయాను. ఒక మాజీ సైనికుడి భార్యగా జయంతి నటించారు. కోరికలు తీరని ఆవిడ, ఒక కుర్రాడితే సంబంధం పెట్టుకుంటుంది. 1973లో ఈ కథ తీయాలంటే చాలా దమ్ములు కావాలి. పుట్టన్న కనగల్ దమ్మున్న డైరెక్టర్. ఇప్పుడు కూడా మనం ఆశ్చర్యపోయే రీతిలో సైకో ఎనాలిసిస్ సినిమాలు తీసాడు.
జగదేకవీరుని కథ షూటింగ్‌లో జయంతికి జ్వరం వస్తే కొలనుని వేడి నీటితో కెవి.రెడ్డి నింపాడు. అది ఆయన గొప్పదనం, ఆమెకి గౌరవం. షూటింగ్‌కి లేట్‌గా వచ్చిందని జయంతిని మోహన్‌బాబు దూషించినట్టు వార్తలొచ్చాయి. నిజానిజాలు వాళ్లకే తెలియాలి.
జయంతి చాలా సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా, సెకెండ్ హీరోయిన్‌గా చేయడానికి వెనుకాడలేదు. కలెక్టర్ జానకిలో ఆమె సంఘర్షణ, శారదలో తన భర్తని ఇంకో స్త్రీ తన భర్తనే భ్రమలో వుంటే ఆవిడ చూపిన ఎమోషన్స్ అద్భుతం. ఎంత దుక్కంలో కూడా గట్టిగా అరిచి ఏడ్చే యాక్టింగ్ కాదు ఆమెది. కళ్లతోనే భావాన్ని చూపగల నటి.
మాయదారి మల్లిగాడులో ఒక వేశ్యగా నటించారు. మరిచిపోలేని ముద్ర వేస్తారు. మల్లె పందిరి నీడలోన పాట ఆల్‌టైం హిట్. తొలి తరం మాడ్రన్ హీరోయిన్లలో ఆమె ఒకరు. స్విమ్మింగ్ సూట్స్, అధునాతనమైన దుస్తులు వేసుకునే వాళ్లు.
జయంతి బెంగళూరు బనశంకరిలో నివాసం. కొంత కాలంగా అనారోగ్యం. చనిపోయారని గతంలో వార్తలొస్తే, నేను బతికే వున్నానని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇపుడు కూడా అలాగే జరిగితే బావుండు. సెలెబ్రిటీల గొప్పతనం ఏమంటే వాళ్లు చనిపోతే , ఏమీ కానివాళ్లు కూడా బాధపడతారు. అదే వాళ్లకి మిగిలిపోయే శాశ్వత ఆస్తి!
Also Read: ఉదాత్త నటికి కన్నీటి నివాళి