iDreamPost
iDreamPost
రాజకీయాల్లో పొత్తులుంటాయి. పార్టీల మధ్య అవగాహన చేసుకుని పోటీలు కూడా ఉంటాయి. కానీ అదేంటో పవన్ కళ్యాణ్ విషయంలో ఇవేమీ ఉండవు. పోటీ చేస్తామని చెబుతారు. తమ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారంటారు. కానీ హఠాత్తుగా మాట మార్చేస్తూ ఉంటారు. తాజా జీహెచ్ఎంసీ ఎపిసోడ్ తో పవన్ వ్యవహారం పూర్తిగా అభాసుపాలయ్యింది. ఒకటో, రెండో సీట్లు కూడా తీసుకోకుండా బేషరతుగా బీజేపీకి మద్ధతు ప్రకటించడం పట్ల జనసైనికులే కుతకుతలాడిపోతున్నారు. కొందరు తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వెలిబుచ్చుతుంటే మరికొందరు బలిపశువులుగా మిగిలామని లోలోన కలత చెందుతున్నారు.
జనసేన ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా, తెలంగాణాలోనూ పోటీ చేస్తుందని ప్రకటించి మూణ్ణాళ్లు కాలేదు.. బల్దియాలో సత్తా చాటుతామని చెప్పి రెండో రోజులు కాలేదు. కానీ అంతలోనే సీన్ మారిపోయింది. పవర్ స్టార్ అని చెప్పుకునే ఈ పొలిటికల్ నాయకుడి పేలవ తీరు ప్రస్ఫుటమయ్యింది. చివరకు హీరో కాస్తా ఇప్పుడు జీరో అయ్యారు. పవన్ ని బీజేపీ ఒప్పంచిందా, మెప్పించిందా లేదా తమ దగ్గరకు రప్పించిందా అన్నది పక్కన పెడితే జనసేన జీరోగా మారిపోయి బీజేపీకి దాసోహం అయ్యిందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఇన్నాళ్ళుగా పవన్ తీరుతో సర్థుకుపోయిన చాలామందికి ఈ పరిణామాలు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
పవన్ కళ్యాణ్ ఆవిర్భావం నుంచి అదే తంతు. ఎప్పుడు ఎవరికి, ఎందుకు మద్ధతు ఇస్తారో ఎవరికీ తెలియదు. ఆయన నిర్ణయం తీసుకుంటారు..జనసేన పేరుతో ప్రకటన చేస్తారు అంతే. ఈ తీరుని బీజేపీ నేతలు బాగా గుర్తించినట్టుగా ఉంది. అందుకే పవన్ కి తగిన గౌరవం ఇవ్వడానికి కూడా వారు సిద్ధంగా కనిపించడం లేదు. హైదరాబాద్ ఎన్నికల ఎపిసోడ్ చూస్తే తమ పార్టీ అధినేతతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ ఉంటుందని జనసేన ప్రకటించింది. కానీ బండి సంజయ్ మాత్రం తమకు, జనసేనతో పొత్తు లేదని, తాము 150 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించేశారు. అయినా అదిగో వస్తున్నారు..ఇదిగో వస్తున్నారు అంటూ కాలయపన చేసిన చివరకు కిషన్ రెడ్డి తో భేటీ కావాల్సి వచ్చింది. కనీసం బండి సంజయ్ మొఖం కూడా చూపించకుండానే తాను అనుకున్నది సాధించగలిగారు.
ఇప్పటికే మోడీ, అమిత్ షా వంటి వారితో కలవాలని పవన్ చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదు. 2014 ఎన్నికలకు ముందు మోడీకి మద్ధతు ప్రకటిస్తూ గుజరాత్ వరకూ వెళ్లి వచ్చిన పవన్ కి ఆ తర్వాత తగిన గౌరవం ఇవ్వడానికి కమలం పెద్దలు సిద్దంకాకపోవడానికి జనసేనాని తీరు ప్రధాన కారణం. 2019 ఎన్నికల తర్వాత మళ్లీ మిత్రపక్షంగా మారినా కేవలం జేపీ నడ్డా తప్ప అంతకుమించిన నేతలు పవన్ ని కలిసేందుకు సుముఖత చూపలేదు. చివరకు ఇప్పుడు బండి సంజయ్ కూడా ఖాతరు చేయలేదనే చెప్పవచ్చు.
వాస్తవానికి ఏపీలో బీజేపీతో కలిసి సాగుతున్న జనసేనని మొన్నటి దుబ్బాక ఎన్నికల్లోనే ఉపయోగించుకోవాలని ఓ సందర్భంలో బీజేపీ ఆశించింది. కానీ ఆంధ్రా ఫ్లేవర్ వస్తే అసలుకే ఎసరు అనుకుని ఆఖరి నిమిషంలో పవన్ ని వద్దని చెప్పేసింది. దుబ్బాక వెళ్ళాలని ఆశ పెట్టుకున్న పవన్ ని కాదు పొమ్మని చెప్పినట్టయ్యింది. ఇప్పుడు జీహెచ్ఎంసీలో మరోసారి అదే తంతు. దాంతో కూరలో కరివేపాకులా మారింది పవన్ వంతు. ఒక రాజకీయ పార్టీగా 25 ఏళ్ల భవిష్యత్ కోసమే తాను బరిలో దిగుతున్నట్టు పదే పదే చెప్పుకున్న పవన్ కి 2019 ఎన్నికల్లో తగిలిన షాక్ తర్వాత ఇదే పెద్ద భంగపాటుగా మారింది. దాంతో పదే పదే మిడిల్ డ్రాప్ వ్యవహారాల మూలంగా పవన్ తన పొలిటికల్ కెరీర్ కి తానే బ్రేకులు వేసుకుంటున్నట్టయ్యింది.
బహుశా ఇవి బ్రేకులు కాదు..శాశ్వత గోతులు అనే వారు కూడా ఉన్నారు. ఏమయినా జనసేనానిని నమ్ముకుని, ఇన్నాళ్లుగా పవన్ మీద విశ్వాసం ఉన్న వారికి కూడా ఈ వ్యవహారం జీర్ణం చేసుకోవడం కష్టంగా మారింది. ఇది జనసేన భవిష్యత్ ని అగమ్యగోచరంగా మార్చే ప్రమాదం దాపురించింది.