iDreamPost
android-app
ios-app

ఆమెకు పార్టీ కావాలి.. వారికి అభ్యర్థి కావాలి

  • Published Mar 19, 2022 | 4:43 PM Updated Updated Mar 19, 2022 | 6:00 PM
ఆమెకు పార్టీ కావాలి.. వారికి అభ్యర్థి కావాలి

ఆమె ఓ సినీనటి. గతంలో పలు తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించి గుర్తింపు పొందారు. తర్వాత తెరమరుగైపోయారు. రాజకీయాల్లోనూ రాణించాలని కొన్నేళ్లుగా తెగ ఉబలాట పడిపోయారు. గత ఎన్నికల సమయంలో ప్రయత్నించి విఫలమయ్యారు. మూడేళ్లుగా జాడ లేకుండా పోయారు. మళ్లీ ఇప్పుడు హఠాత్తుగా ప్రత్యక్షం అయ్యారు. నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆ మధ్య అక్కడ హడావుడి చేశారు. కానీ ఏ పార్టీ అన్నది ఆమెకే క్లారిటీలేదు.ఆదరించే పార్టీ కోసం ఎదురుచూస్తున్న ఆ మాజీ నటీమణి మరెవరోకాదు.. వాణీవిశ్వనాథ్. మరోవైపు పార్టీ పెట్టి తొమ్మిదేళ్లయినా సరైన దిశానిర్దేశం, క్షేత్రస్థాయిలో క్యాడర్, నాయకత్వం లేని ఒక పార్టీ వచ్చే ఎన్నికల్లో ఏకంగా అధికారంలోకి వచ్చేయాలని కలలు కంటోంది. ప్రగల్భాలు పలుకుతోంది. అభ్యర్థుల కోసం అన్వేషణ సాగిస్తున్న ఆ పార్టీ జనసేన. వాణీ విశ్వనాథ్ కు పార్టీ లేదు.. జనసేనకు అభ్యర్థి లేరు. ఈ పరిస్థితుల్లో జనసైనికులకు వాణీవిశ్వనాథ్ వెతకబోయిన కాలికి తగిలినట్లు కనిపించారు. ఆమెను ఓన్ చేసేసుకుంటున్నారు. జనసేన నుంచి పోటీ చేయమని ఆహ్వానించడం హాట్ టాపిక్ గా మారింది.

పదిరోజుల క్రితం నగరిలో ప్రత్యక్షం

సినీనటి వాణీ విశ్వనాథ్ పదిరోజుల క్రితం నగరిలో పర్యటించారు. అక్కడ తెలుగు, తమిళ సినీ రంగాలతో సంబంధం ఉన్నవారిని కలిసి పరిచయం చేసుకున్నారు. తన అమ్మమ్మ గతంలో నగరిలోనే నర్సుగా పనిచేశారని, ఆ విధంగా ఈ ప్రాంతంతో తనకు అనుబంధం ఉందని బీరకాయ పీచు సంబంధం కలిపారు. అక్కడి అమ్మవారి ఆలయంలో పూజలు జరిపారు. అనంతరం స్థానికులతో మాట్లాడుతూ నగరి ప్రజలకు సేవ చేస్తానని, ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని అసలు విషయం బయటపెట్టి వెళ్లిపోయారు.

కానీ ప్రస్తుతం ఈ పార్టీలోనూ ఆమె సభ్యురాలు కాకపోవడంతో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న క్లారిటీ ఆమెకే లేదు. వాస్తవానికి గత ఎన్నికల ముందు రాజకీయాల్లోకి రావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అప్పటి సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును పొగడ్తలతో పలు సందర్భాల్లో ఆకాశానికి ఎత్తేశారు. అమరావతి వెళ్లి ఎన్నికల్లో పోటీచేయాలన్న తన అభిలాషను చంద్రబాబుకు చెప్పుకోవాలనుకున్నారు. కానీ ఆయన దర్శనభాగ్యం లభించలేదు. పోటీచేసే అవకాశమూ దక్కలేదు. దాంతో మూడేళ్లపాటు జాడ లేకుండాపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు నగరిలో ప్రత్యక్షం అయ్యారు.

ఇదే మంచి అవకాశంగా జనసేన ఆరాటం

ఇదే సమయంలో తొమ్మిదేళ్లయినా క్షేత్రస్థాయిలో బలపడని జనసేన వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని ఆరాటపడుతోంది. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా నగరి సీటును బహుజన సమాజ్ పార్టీ ( బీఎస్పీ)కి కేటాయించగా ఆ పార్టీ అభ్యర్థి 3044 ఓట్లు మాత్రమే పొంది డిపాజిట్ కోల్పోయారు. ఈ నేపథ్యంలో వాణీ విశ్వనాథ్ రంగంలోకి రావడం జనసైనికుల్లో ఆశలు రేపింది. ఆమె అభ్యర్థి అయితే వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రోజాకు గట్టి పోటీ ఇవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. ఇంకేముంది.. ఆలసించిన ఆశాభంగం అన్నట్లు పుత్తూరులో వాణీ విశ్వనాథ్ ఫొటోతో కూడిన బ్యానర్లు పట్టుకుని రోడ్లపైకి వచ్చారు. జనసేనలోకి రండి.. నగరి ప్రజలకు సేవచేయండి అని ఆమెను ఆహ్వానించే నినాదాలు చేస్తూ ప్రదర్శన జరిపారు. నగరి ఆమెను గెలిపించుకుంటామని భరోసా ఇవ్వడం చూసి ప్రజలు విస్మయానికి గురయ్యారు.