ఆరు అబార్షన్ల తర్వాత అద్భుతం… శ్రీనగర్ జంటకు పుట్టిన మిరకిల్ బేబీ

ఆరు అబార్షన్ల తర్వాత అద్భుతం… శ్రీనగర్ జంటకు పుట్టిన మిరకిల్ బేబీ

  • Published - 04:16 PM, Thu - 4 August 22
ఆరు అబార్షన్ల తర్వాత అద్భుతం… శ్రీనగర్ జంటకు పుట్టిన మిరకిల్ బేబీ

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు అబార్షన్ల తర్వాత పుట్టిందో మిరకిల్ బేబీ. ఐదేళ్ళుగా కడుపులోనే పిల్లల్ని పోగొట్టుకుంటున్న ఆ పాప తల్లిదండ్రుల ఆనందానికి ఇప్పుడు హద్దే లేదు. ఇన్నాళ్ళకు తమ కల నెరవేరిందని సంతోషపడిపోతున్నారు.

శ్రీనగర్ కి చెందిన ఓ జంటకు 2016లో పెళ్ళైంది. భర్త మల్టీనేషనల్ సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్. భార్య శ్రీనగర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్. మొదటిసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు పాప మెదడులో న్యూరల్ ట్యూబ్ (neural tube) లోపముందని డాక్టర్లు అబార్షన్ చేయించారు. ఆ తర్వాత వరసగా ఐదు సార్లూ అలాగే జరిగింది. మొత్తం మూడు మిస్ క్యారేజెస్ కాగా మరో మూడు డాక్టర్లే చేసిన అబార్షన్స్. చనిపోయిన పిల్లల్లో కవలలు కూడా ఉన్నారు.

ఏడో సారి అద్భుతమే జరిగింది!

ఆ తల్లి ఏడోసారి గర్భం దాల్చింది. ఈసారీ అదే పరిస్థితి. గర్భస్రావం చేయించుకోమని శ్రీనగర్ లో డాక్టర్లు, నిపుణులు సలహా ఇచ్చారు. కానీ అంతమంది బిడ్డల్ని పోగొట్టుకున్న ఆ తల్లి ఇందుకు ఒప్పుకోలేదు. ఈసారి ఎలా అయినా బిడ్డను కనాల్సిందేనని పట్టుబట్టింది. భర్తతో కలిసి చండీగఢ్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ని సంప్రదించింది. గర్భస్థ శిశువును పరిశీలించిన డాక్టర్ సీమా శర్మ మెదడులో చిన్న వాపుండడాన్ని గమనించారు. అయితే అదంత పెద్ద సమస్యేమీ కాదని ఆమెకు అనిపించింది. అందుకే గర్భాన్ని అలాగే ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. చివరికి పాప పుట్టింది. తనకిప్పుడు రెండు నెలలు. ఎలాంటి సమస్యా ఎదురు కాలేదు. ఆరు సార్లు ఓడిపోయినా ఏడోసారి అద్భుతం జరిగిందని ఆ అమ్మా నాన్న తెగ సంబరపడిపోతున్నారు.

 

న్యూరల్ ట్యూబ్ లోపాలంటే?

పుట్టుకతోనే మెదడులో కనిపించిన లోపాలను న్యూరల్ ట్యూబ్ లోపాలు అంటారు. తల్లి గర్భంలో ఉన్న తొలి దశలోనే పిండం మెదడులో ఇవి ఏర్పడతాయి. ఈ లోపాల వల్ల బిడ్డ పుట్టిన తర్వాత మెదడులోగానీ వెన్నెముకలో గానీ చిన్న తిత్తుల్లాంటి నిర్మాణాలు చాలా అరుదుగా కనిపించవచ్చు. మెదడు లేదా పుర్రెలో కొంత భాగం మిస్ అయిపోవచ్చు. లేదా పుర్రెలో రంధ్రాలు ఏర్పడవచ్చు. దీనికి అసలు కారణాలైతే తెలియదు కానీ జన్యుపరమైన లోపాలు, పోషకాహార లోపం, వాతావరణ సమస్యలు కొంత వరకు కారణాలు కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

కడుపులో ఉన్న బిడ్డలో ఏవైనా లోపాలుంటే అబార్షన్ చేయడం ఒక్కటే మార్గం కాదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే లోపాలు సరి చేయవచ్చన్నది ఎక్స్ పర్ట్స్ మాట. ఈ కేసును అందుకు ఉదాహరణగా చెబుతున్నారు.

 

 

 

Show comments