iDreamPost
android-app
ios-app

మలుపులు తిరిగిన Jammalamadugu రాజకీయం : టీడీపీలోకి ఆదినారాయణరెడ్డి అన్న కుటుంబం

మలుపులు తిరిగిన Jammalamadugu రాజకీయం : టీడీపీలోకి ఆదినారాయణరెడ్డి అన్న కుటుంబం

వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మళ్లీ మారబోతున్నాయి. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్న మాజీ ఎమ్మెల్సీ చదిపిరాళ్ల నారాయణ రెడ్డి తన కుమారుడు భూపేష్‌ రెడ్డితో కలసి టీడీపీలో చేరబోతున్నారు. ఈ నెల 20వ తేదీన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోబోతున్నట్లు నారాయణ రెడ్డి ఈ రోజు ప్రకటించారు. ఈ నెల మొదటి వారంలో జమ్మలమడుగు టీడీపీ ఇంఛార్జి నియామకం విషయంలో స్థానిక నేతలతో చంద్రబాబు చర్చలు జరిపారు. నారాయణ రెడ్డి టీడీపీలో చేరడం, ఆయన కుమారుడు భూపేష్‌ రెడ్డికి ఇంఛార్జి పదవి ఇచ్చే అంశంపై టీడీపీ స్థానిక నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ పరిణామాల అనంతరం టీడీపీలో చేరికకు లైన్‌ క్లియర్‌ అవ్వడంతో నారాయణ రెడ్డి సైకిల్‌ ఎక్కడంపై ప్రకటన చేశారు.

జమ్మలమడుగులో 2014 వరకు పొన్నపురెడ్డి, చదిపిరాళ్ల కుటుంబాలు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నాయి. 2014లో వైసీపీ తరఫున టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డిపై గెలిచిన చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి ఆ తర్వాత టీడీపీలో చేరడంతో.. దశాబ్ధాల తరబడి ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేసిన కుటుంబాలు ఒకే పార్టీ గూటిలో చేరాయి. రామసుబ్బారెడ్డి.. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి.. వైసీపీ అభ్యర్థి మూలే సుధీర్‌ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కడప లోక్‌సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి కూడా ఓడిపోయారు. ఆ తర్వాత రామసుబ్బారెడ్డి వైసీపీలో, ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరడంతో టీడీపీ పరిస్థితి చుక్కానిలేని నావలా తయారైంది.

ఆది నారాయణ రెడ్డి బీజేపీలో చేరినా.. ఆయన సోదరుడు ఎమ్మెల్సీ శివానందరెడ్డి మొన్నటి వరకు టీడీపీలోనే ఉన్నారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు సమయంలో వైసీపీకి అనుకూలంగా ఓటు వేశారు. విప్‌ ధిక్కరించారని, శివానందరెడ్డిని అనర్హడిగా ప్రకటించాలంటూ టీడీపీ మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి శివానంద రెడ్డి వైసీపీకి అనుకూలంగా ఉంటున్నారు. ఆదినారాయణ రెడ్డి అన్న నారాయణ రెడ్డి వైసీపీ చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పైగా తమ ప్రత్యర్థి రామసుబ్బారెడ్డి వైసీపీలో ఉండడం, టీడీపీకి స్థానికంగా నాయకత్వలేమిని అనుకూలంగా మలుచుకున్న నారాయణరెడ్డి.. కుమారుడు భూపేష్‌ రెడ్డి రాజకీయ భవిష్యత్‌ కోసం సైకిల్‌ ఎక్కాలని నిర్ణయించుకున్నారు.

Also Read : Ex Minister DL-డీఎల్ ఏం ఆశిస్తున్నారు. రాజకీయ ప్రకటనల వెనుక అసలు లక్ష్యం అదేనా

రామ సుబ్బారెడ్డి బాబాయ్ పొన్నపురెడ్డి శివారెడ్డి 1978లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి, జనతాపార్టీ అభ్యర్థి రామనాథరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరిన శివారెడ్డి 1983, 1985, 1989లలో వరుసగా మూడు సార్లు గెలిచారు. ఫ్యాక్షన్‌ గోడవల్లో ఆయన హత్యకు గురికావడంతో.. 1994 ఎన్నికల్లో శివారెడ్డి అన్న కుమారుడు రామసుబ్బారెడ్డి టీడీపీ తరఫున బరిలోకి దిగారు. 1994, 1999లలో రెండుసార్లు చదిపిరాళ్ల నారాయణ రెడ్డిని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో నారాయణ రెడ్డి తప్పుకుని.. తన తమ్ముడు ఆదినారాయణ రెడ్డిని బరిలోకి దించారు. ఫలితంగా 2004, 2009లో కాంగ్రెస్, 2014లో వైసీపీ తరఫున ఆదినారాయణ రెడ్డి.. టీడీపీ అభ్యర్థి అయిన రామసుబ్బారెడ్డిని ఓడించారు.

2014 తర్వాత మారిన రాజకీయ సమీకరణాలు ఆ తర్వాత కొనసాగుతున్నాయి. రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. ఆయనపై 1994, 1999లో పోటీ చేసి ఓడిపోయిన నారాయణ రెడ్డి ఇప్పుడు టీడీపీలో చేరబోతున్నారు. నారాయణ రెడ్డి తమ్ముడు ఆదినారాయణ రెడ్డి బీజేపీలో ఉన్నారు. మరో తమ్ముడు శివానందరెడ్డి వైసీపీలో ఉన్నారు.

2019లో పొన్నపురెడ్డి, చదిపిరాళ్ల కుటుంబాలకు చెక్‌పెట్టి.. యువకుడైన మూలె సుధీర్‌ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరినా.. 2024లోనూ సుధీర్‌ రెడ్డినే వైసీపీ తరఫున పోటీ చేస్తారని ఇటీవల ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. రామసుబ్బారెడ్డిని 2023లో మండలికి పంపిస్తామని హామీ ఇచ్చి.. వారిద్దరి మధ్య ఉన్న ఆదిపత్యపోరుకు తెరదించింది. ఇక టీడీపీలో చేరబోతున్న నారాయణ రెడ్డి కుమారుడు భూపేష్‌ రెడ్డికి టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి పదవి దక్కడం లాంఛనమే. 2024లో వైసీపీ తరఫున మూలే సుధీర్‌ రెడ్డి, టీడీపీ తరఫున చదిపిరాళ్ల భూపేష్‌ రెడ్డి పోటీ చేయడం ఖాయమే. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి.. తన అన్న కుమారుడైన భూపేష్‌ రెడ్డి తన రాజకీయ వారసుడని గతంలో ప్రకటించారు. ఎన్నికల నాటికి మళ్లీ ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరి.. తన రాజకీయ వారసుడు భూపేష్‌ గెలుపునకు పని చేసినా ఆశ్చర్యంలేదు.

Also Read : Bandaru Sravani – టీడీపీ లో ఆ అమ్మాయికి జేసీ ఫ్యామిలీనే పెద్ద దిక్కా…?