iDreamPost
iDreamPost
సాధారణంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండే స్టార్ హీరోలు సందేశాత్మక చిత్రాలు చేసేందుకు ఎక్కువ ఇష్టపడరు. కారణం మార్కెట్ లో ఉండే రిస్క్. ఏ మాత్రం అటుఇటు అయినా నిర్మాత నష్టపోతాడు. అయినా కూడా సాహసం చేసేవాళ్ళు లేకపోలేదు. చిరంజీవి రుద్రవీణ, బాలకృష్ణ జననీ జన్మభూమి లాంటివి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. నాగార్జునకూ అలాంటి ఎప్పటికీ చెప్పుకునే సినిమా ఉంది. అదే జైత్రయాత్ర. 1979లో థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన ఉప్పలపాటి నారాయణరావు 1985 మొదలు వంశీ, మోహనగాంధీ, బాలు మహేంద్ర లాంటి దర్శకుల దగ్గర అసిస్టెంట్ గా పని చేసి అనుభవం సంపాదించారు. 90 దశకంలో పలు టీవీ కార్యక్రమాల రూపకల్పనలో కీలక భాగం వహించారు. ఆ సమయంలో తెలిసిన ఓ సంఘటన కథ రాసేందుకు ప్రేరేపించింది
శివ తర్వాత నాగార్జున ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. అలా అని మూస ఫార్ములా సినిమాలు చేసేందుకు యువసామ్రాట్ అంతగా ఇష్టపడటం లేదు. అప్పుడు ఉప్పలపాటి చెప్పిన లైన్ ఆలోచనలో పడేసింది. సాహసం అనిపించినా కూడా నిర్మాత స్రవంతి రవికిషోర్ ధైర్యంగా ముందుకు రావడంతో ఎక్కువ ఆలోచించకుండా ఓకే చెప్పారు. అలా జైత్రయాత్రకు శ్రీకారం చుట్టారు. సంగీత దర్శకుడిగా ఎస్పి బాలసుబ్రమణ్యంను ఎంచుకోవడం షాక్ ఇచ్చింది. ఇళయరాజా, రాజ్ కోటి, కీరవాణి తప్ప నాలుగో ఆప్షన్ లేని టైం అది. తనికెళ్ళ భరణి సంభాషణలు, హరి అనుమోలు ఛాయాగ్రహణంతో మంచి టీమ్ ని సెట్ చేసుకున్నారు నారాయణరావు.
నగరంలో లా చదువుకుంటున్న తేజ(నాగార్జున)అనాథ. చిన్న చిన్న సరదాలు సమాజం పట్ల ఆలోచనలతో గడుపుతున్న తేజకు తనకు నాన్న(ఢిల్లీ గణేష్) ఉన్నాడని తెలుస్తుంది. ఆరా తీయడానికి ఊరికి వెళ్లిన ఇతనికి భయంకర నిజాలు తెలుస్తాయి. దొంగలుగా ముద్రపడి తనవాళ్లు అనుభవిస్తున్న చీకటి బ్రతుకు కదిలిస్తుంది. వెలుగులు నింపేందుకు ప్రయత్నించిన తేజ మీదే అక్కడి గ్రామ రాజకీయం, పోలీస్ వ్యవస్థ దోషిగా నిలబెడుతుంది. ఆ తర్వాత జరిగే కథను సినిమాలోనే చూడాలి. చాలా సీరియస్ గా సాగే ఈ సోషల్ డ్రామా కమర్షియల్ గా ఆడకపోయినా నాగార్జున అత్యుత్తమ పెర్ఫార్మన్స్ లో ఒకటిగా చెప్పొచ్చు. 1991 నవంబర్ 13న విడుదలైన జైత్రయాత్రలో టేకింగ్ చూసే నాగార్జున ఉప్పలపాటి నారాయణరావుకి రక్షణ రూపంలో రెండో అవకాశం ఇవ్వడం విశేషం
Also Read : మాస్ ని ఆకట్టుకున్న లీలామహల్ – Nostalgia