iDreamPost
android-app
ios-app

రూ. 300 కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోండి.. 200 గజాల స్థలం పొందండి అంటూ

రూ. 300 కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోండి.. 200 గజాల  స్థలం పొందండి అంటూ

ఇల్లు కొనాలని లేదా స్థలం ఉంటే నచ్చినట్లు గృహం నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరి కల. అయితే ఈ రోజుల్లో భూమి ధరలు కొండనెక్కి కూర్చుంటున్నాయి. ఇక హైదరాబాద్, వరంగల్, విజయవాడ, వైజాగ్, తిరుపతి వంటి నగరాల్లో గజం భూమి కూడా కొనలేని దుస్థితి. దీంతో ఏ మారు మూల ప్రాంతాల్లోనే తాము ఆశించిన ధరల్లో ఇంటి స్థలం, ప్లాటో రాకపోతాయా అని ఎదురు చూస్తుంటారు. అలానే రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన ప్రకటనలు ఫాలో అవుతుంటారు. ఇలాంటి ఆశావాహులను మభ్య పెడుతుంటారు కొందరు. ప్రజల ఆశలను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కేవలం 300 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోండి.. 200 గజాల భూమితో పాలు రూ. లక్ష లోన్ ఇస్తామంటూ ఓ ప్రముఖ వ్యక్తి బురిడీ కొట్టించబోయి ఇరుక్కుపోయాడు. మోసం బయటపడే సరికి ప్లేటు ఫిరాయించాడు.

వివరాల్లోకి వెళితే.. రవీంద్ర భారతి పక్కనే ఉన్న మౌంట్ నసీర్ అపార్ట్ మెంట్‌లోని ‘జై మహా భారత్ పార్టీ’అధ్యక్షుడు, న్యాయవాది భగవాన్ శ్రీ అనంత విష్ణు.. ‘రూ. 300 కట్టండి.. 200 గజాల భూమి పొందండి’ అన్న ప్రకటన చేశాడు. అతడి ప్రకటన చూసి చాలా మంది మహిళలు డబ్బులు కట్టారు. ఎంతకు స్థలాలు ఇవ్వకపోవడంతో మూకుమ్మడిగా అతడి ఇంటిపై దాడి చేశారు. తమకు హామీనిచ్చినట్లుగా భూమిని ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే మహిళలను వారించేందుకు, సర్ది చెప్పేందుకు ఓ మహిళ ప్రయత్నించగా.. ఆమెపై దాడికి దిగారు. పలు జిల్లాల నుండి వచ్చిన మహిళలు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఇప్పటికే లక్షల మంది నుండి రూ. 300 చొప్పున వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఆందోళన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఈ విషయంపై విష్ణును ప్రశ్నించగా.. తాను సుప్రీంకోర్టు న్యాయవాదినని, తమ ట్రస్టుకు సంబంధించి వేలాది ఎకరాల భూములున్నాయని, పేదలకు పంచిపెడతామంటూ ప్రకటించడం గమనార్హం. ఈ సమావేశం ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించాలనుకున్నామని, అయితే డీసీపీ అనుమతించలేదని, కోర్టుకు వెళతామని చెప్పడం ఆశ్చర్యకరం.  కాగా, గతంలో సైఫాబాద్ పోలీసులు అనంత విష్ణుపై కేసు నమోదు చేశారు.