iDreamPost
iDreamPost
అధికారం కోసం ఎన్ని మాటలయినా చెబుతారు..కానీ గద్దెనెక్కిన తర్వాత వాటిని తుంగలో తొక్కుతుంటారు. సహజంగా ఎక్కువ మంది రాజకీయ నేతల తీరు అలానే ఉంటుంది. ఏపీలో చంద్రబాబు వంటి వారయితే చివరకు తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయం జనాలకు తెలియకుండా మ్యానిఫెస్టో కనిపించకుండా చేయాలని చూసిన అనుభవం అందరికీ తెలిసిందే. కానీ జగన్ దానికి భిన్నంగా మ్యానిఫెస్టో అన్ని చోట్లా ఎదురుగా ఉండాలని ఆదేశించారు. సీఎం కార్యాలయం నుంచి గ్రామ సచివాలయం వరకూ ప్రతీ చోటా ఎన్నికల హామీలు ప్రజలకు గుర్తుకు వచ్చేలా ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగా ఆచరణలో తనదైన పంథాలో సాగుతూ ఇప్పుడు మ్యానిఫెస్టో అమలు విషయంలో ఓ దిక్సూచిగా కనిపిస్తున్నారు.
చెప్పాడంటే..చేస్తాడంతే అనే నినాదం జగన్ విషయంలో ఖచ్చితంగా జరుగుతుందని ఇప్పటికే ప్రజల్లో ఓ బలమైన ముద్ర ఉంది. దానిని నిలబెట్టుకోవడానికి సీఎం తీవ్రంగా శ్రమిస్తున్నారు. చివరకు కరోనా వంటి ఆటంకాలు, తుఫాన్లు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు మాత్రమే కాకుండా ప్రజా సంక్షేమానికి అడ్డుపుల్లలు వేసే విపక్ష కుట్రలు కూడా ఎదుర్కొంటున్నారు అయినా వాటన్నింటినీ అధిగమించి జనసంక్షేమానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలే ఏపీలో జగన్ అంటే విశ్వసనీయత అనే అభిప్రాయం బలపడేందుకు దారితీస్తోంది.
పాదయాత్రలో తాను ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకునే దిశలో సీఎం కొత్త పథకానికి శ్రీకారానికి చుట్టారు. అక్కచెల్లెమ్మలకు మెరుగైన జీవనోపాధి తద్వారా సుస్ధిర ఆదాయం లక్ష్యంగా “జగనన్న జీవ క్రాంతి” పథకం ద్వారా గొర్రెలు–మేకల యూనిట్ల పంపిణీ ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.1869 కోట్ల వ్యయంతో ఇది అమలు కాబోతోంది. మొత్తం 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్ల పంపిణీ జరగబోతోది. ఒక్కో యూనిట్‌లో 5–6 నెలల వయస్సున్న 14 గొర్రె లేక మేక పిల్లలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. వీటితో పాటు ఒక యవ్వనపు పొట్టేలు లేదా మేకపోతు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేశారు. సెర్ఫ్ సాయంతో నచ్చిన గొర్రెలు, మేకల కొనుగోలు చేసుకునే వెసులుబాటుని కల్పించడంతో లబ్దిదారులకు ప్రయోజనం దక్కుతుందని అంతా భావిస్తున్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ఎక్కువ మంది ఈ పథకం లబ్ది చేకూర్చబోతోంది. అందులోనూ రాయలసీమ జిల్లాలు కర్నూలు, అనంతపురం వాసులకు మేలు కలుగుతుంది. అనంతపురం జిల్లాలో 58 లక్షల మంది, కర్నూలులో 25 లక్షల మంది గొర్రెల మేకల పెంపకందారులున్నారు. వారికి జగన్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం వల్లు పలు రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మహిళలను లబ్దిదారులు ఈ పథకం ద్వారా కనీసంగా ఒక్కొక్క యూనిట్‌కు 3 సంవత్సరాలలో కుటుంబానికి నికరంగా రూ.1,28,848 ఆదాయం సమకూరబోతుండడంతో అంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే మ్యానిఫెస్ట్ లో 90 శాతం అమలు చేసినట్టు చెప్పింది. ఇప్పుడు దాదాపుగా మిగిలిన అన్ని హామీల అమలు దిశగా సాగుతుండడం విశేషంగానే చెప్పాలి. మ్యానిఫెస్టో అంటే భగవద్గీత, ఖరాన్, బైబిల్ వంటిదని చెప్పిన దానికి అనుగుణంగా ముందుకు సాగడం అందరినీ ఆకట్టుకుంటోంది.