iDreamPost
android-app
ios-app

సొంతింటి కలను నిజం చేస్తున్న జగన్ సర్కారు.

సొంతింటి కలను నిజం చేస్తున్న జగన్ సర్కారు.

నిరుపేదలు, మధ్య తరగతి కుటుంబాలకు సొంత ఇళ్లు ఒక కల. ఆ కలను నెరవేర్చుకునేందుకు ఇంటిల్లిపాది జీవితమంతా కష్టపడుతూనే ఉంటారు. అయినా… ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి కల నెరవేరడం అంత సులభమైన విషయం కాదు. నగరాలు, పట్టణాల్లోనే కాదు… చివరకు గ్రామాల్లో కూడా ఇంటి స్థలాల ధరలకు రెక్కలొచ్చాయి. రియల్ ఎస్టేట్ కారణంగా భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఫలితంగా నిరుపేదలు ఇంటి స్థలం కొనుగోలు చేయడం గగన కుసుమంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజంచేసేందుకు ముందుకు వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టనుంది. నవరత్నాలలోని ‘పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనుంది ప్రభుత్వం. తూర్పు గోదావరి జిల్లాలో ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. రాజకీయాలకు అతీతంగా ముప్పై లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో 2005లో ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రవేశ పెట్టారు. లక్షలాది మంది నిరుపేదలకు ఇళ్లను అందజేశారు. వైఎస్ఆర్ ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభించిన తూర్పుగోదావరి జిల్లా నుంచే జగన్మోహన్ రెడ్డి ‘పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమాన్ని ప్రారంభించనుండడం గమనార్హం.

రూ.23,538 కోట్ల విలువైన భూమిని పేదలకు అందిస్తున్న ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ కోసం 30,68,281 మంది అర్హులను గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ కోసం 66,518 ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం లేఔట్లు వేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. అర్హులందరికీ ఇళ్ల స్థలం అందేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎవరికైనా అందకపోతే తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దరఖాస్తు చేసుకున్న తొంబై రోజుల్లోపే స్థలాలను కేటాయించనుంది. వచ్చే నెల మరో 80 వేల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనుంది.

రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు లక్షల రూపాయాలు వెచ్చించి ఇంటి స్థలాలను కొనుగోలు చేసి, సొంత ఇళ్లు నిర్మించుకోవడం సాధ్యమయ్యే పని కాదు. నిజానికి ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేసి, అవి తీర్చలేక ఆత్మహత్యల పాలయిన కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వాతావరణంలో ప్రభుత్వమే ఇళ్ల స్థలాలను ఇచ్చి, ఇళ్లను నిర్మించేందుకు ముందుకు రావడం నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపడమే. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం నిజంగా ఒక చరిత్ర. 300 ఎస్ఎఫ్టీల స్థలాన్ని ప్రభుత్వం ఒక్క రూపాయికే అందిస్తోంది ప్రభుత్వం. స్థలం ఉండి కూడా ఇళ్లు నిర్మించుకోలేకపోయిన పేదలకు ప్రభుత్వం 1.80 లక్షలు అందిస్తోంది. తొలివిడతలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపనకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని సంక్షేమ పథకాలను నిష్పక్షపాతంగా ప్రజలకు అందిస్తోంది. నవరత్నాల అమలుతో పూర్తిగా రాష్ట్ర స్వరూపమే మారినుందంటే ఆశ్చర్యంలేదు. ప్రస్థుత ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణంతో గ్రామీణ పట్టణ ప్రాంతాల స్వరూపాలే మారిపోనున్నాయి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 17 వేల టౌన్ షిప్ లు రానున్నాయి. ప్రభుత్వం శ్రీకారం చుట్టిన కార్యక్రమం పట్ల ప్రతిపక్షాలు సైతం హర్షం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు ప్రభుత్వ కృషిని కొనియాడుతూ విజయవాడలో పోస్టర్లు వేయించారంటే ఈ పథకం ఎలాంటి ప్రభావం వేయనుందో అంచనా వేయవచ్చు.