iDreamPost
android-app
ios-app

వారి భ‌ద్ర‌త‌లో జ‌గ‌న్ స‌ర్కారును మెచ్చుకోవాల్సిందే

వారి భ‌ద్ర‌త‌లో జ‌గ‌న్ స‌ర్కారును మెచ్చుకోవాల్సిందే

ఇటీవల గుంటూరు నగరంలో జరిగిన బీటెక్‌ విద్యార్థిని రమ్య దారుణ హత్య కు సంబంధించి ప్ర‌తిప‌క్ష పార్టీ నానా యాగీ చేసింది. నారా లోకేశ్ చేసిన ర‌గ‌డ, చేసిన విమ‌ర్శ‌లు అంద‌రికీ తెలిసిందే. ప్ర‌భుత్వ స్పంద‌న స‌రిగా లేదంటూ ఆరోపించారు. దీనిపై నిజానిజాలు ప‌రిశీలించిన జాతీయ ఎస్సీ కమిషన్ బృందం చెప్పిన విష‌యాలు విని టీడీపీకి మైండ్ బ్లాక్ అయింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పనితీరును కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ అరుణ్‌ హల్డర్‌ ప్రశంసించారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం కూడా ఏపీ ప్రభుత్వం వెంటనే అందించిందని ఆయన గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వ దృక్పథం చాలా పాజిటివ్‌గా ఉందని, దేశం మొత్తం ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఇటువంటి ఘ‌ట‌న‌పై ఓ జాతీయ స్థాయి క‌మిష‌న్ స్పంద‌న‌ను చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఇదే కాదు.. ఓవ‌రాల్ గా బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల భ‌ద్ర‌త లో జ‌గ‌న్ స‌ర్కారు జాతీయ స్థాయిలోనే ముందంజ‌లో నిలుస్తోంది.

దళితులు, గిరిజనులకు పూర్తి భద్రత.. సామాజికంగా భరోసా.. రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ.. ఇదే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపడుతోంది. ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు పాల్పడినా పర్వాలేదనే టీడీపీ ప్రభుత్వ హయాంలోని పరిస్థితిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమూలంగా సంస్కరించింది. గ‌త పాల‌కుల హ‌యాంలో రాష్ట్రంలో అప్రతిహతంగా సాగిన దళితులు, గిరిజనుల హక్కుల హననానికి అడ్డుకట్ట వేసింది. ఎస్సీ, ఎస్టీలపై నేరాలను తీవ్రంగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాక ముందు, వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై నేరాలు త‌గ్గ‌డ‌మే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు.

అంతేకాదు.. ఎస్టీలకు భద్రత కల్పించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మెరుగైన పనితీరు కనబరుస్తోందని జాతీయ క్రైమ్‌రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక వెల్లడించడం రాష్ట్ర ప్రభుత్వ సమర్థతకు తార్కాణంగా నిలుస్తోంది.

ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు పాల్పడితే పోలీసులయినాసరే ఉపేక్షించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం ఉన్న‌తాధికారుల‌కు స్పష్టమైన సందేశాన్నిచ్చింది. శ్రీకాకుళంజిల్లాలో కాశీబుగ్గ సీఐను 24 గంటల్లోనే అరెస్టు చేసింది. రాజమహేంద్రవరంలోని సీతానగరం పోలీస్‌ స్టేషన్‌లో ఓ ఎస్‌ఐను ఘటన జరిగిన రోజే అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా చీరాల టూ టౌన్‌ ఎస్‌ఐను అరెస్టు చేసి చార్జ్‌ షీట్‌ కూడా దాఖలు చేశారు. ఫ‌లితంగా నేరాల‌లో త‌గ్గుద‌ల క‌నిపిస్తోంది. తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ, ఇప్ప‌టికీ దళితులు, గిరిజనులపై దాడులు, ఇతర వేధింపులు గణనీయంగా త‌గ్గిన‌ట్లు లెక్క‌లు చెబుతున్నాయి.

గత ఆరేళ్లలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు అత్యల్పంగా 2021లోనే నమోదు కావడం విశేషం. 2015తో పోలిస్తే 2020లో దళితులు, గిరిజనులపై నేరాలు ప‌ద‌మూడు శాతం తగ్గాయి. ఎస్సీ, ఎస్టీలపై నమోదైన కేసులను కేటగిరీలవారీగా పరిశీలిస్తే నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీలపై నేరాలు గణనీయంగా తగ్గాయి. 2019తో పోలిస్తే 2020లో హత్య కేసులు న‌ల‌భై శాతం, అత్యాచారం కేసులు ప‌ది హేను శాతం తగ్గాయి.

నేరాలు జ‌ర‌గ‌కుండా అడ్డు క‌ట్ట వేయ‌డంలోనే కాదు.. పొర‌పాటున దళితులు, గిరిజనులు ఎక్క‌డైనా నేరాల‌కు గురైతే ఆదుకోవడంలో కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తోంది. బాధిత కుటుంబాలకు పరిహారాన్ని పెంచింది. 2014–2019లో టీడీపీ ప్రభుత్వం బాధిత ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు కేవలం రూ.52.32 కోట్లు మాత్రమే పరిహారంగా అందించింది. కాగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019 జూన్‌ నుంచి 2021 జూలై వరకు బాధిత ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.87.70కోట్లు పరిహారంగా అందించడం విశేషం. అందుకోసం ప్రత్యేకంగా పోర్టల్‌ను ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు సత్వరం పరిహారం అందేలా చొరవ చూపిస్తోంది. ఎస్సీ, ఎస్టీల రక్షణలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే సమర్థంగా వ్యవహరిస్తోందని ఎన్‌సీఆర్‌బీ నివేదిక పేర్కొందంటే ప్ర‌భుత్వ ప‌నితీరును అర్థం చేసుకోవ‌చ్చు.