ఉక్కు సంకల్పానికి తొలి అడుగు..

కడప జిల్లా వాసులు దశాబ్దాలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మోహోన్నత ఘట్టం నేడు ఆవిష్కృతం అయింది. ప్రత్యక్షంగా పరోక్షంగా 25వేల మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో వై.యస్ రాజశేఖర్ రెడ్డి 2007లో ప్రారంభించిన కడప ఉక్కు పరిశ్రమ ఆయన మరణంతో అనేక వివాదాలలో చిక్కుకుని ఆగిపోయింది. 10ఏళ్ళుగా ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా శంఖుస్థాపకి నోచుకుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తామని ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకుంటు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయటానికి తొలి అడుగు వేశారు.

వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,275.66 ఎకరాలలో, 15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో, ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పడబోతున్న ఈ ఉక్కు పరిశ్రమకు 10 లక్షల మూల ధనంతో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ పేరిట ఒక ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమకు ఇనుము సరఫరా కోసం ఎన్‌ఎండీసీతో డిసెంబర్‌ 18న ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ యూనిట్‌ ఏర్పాటుకు ప్రస్తుతం 4.8 మిలియన్‌ టన్నుల ముడి ఇనుము అవసరం కాగా, ఎన్‌ఎండీసీ 5 మిలియన్‌ టన్నులు సరఫరా చేయడానికి అంగీకరించింది. యూనిట్‌కు కేటాయించిన స్థలం నుంచే కడప – నంద్యాల రైల్వే ట్రాక్‌ ఉండటంతో పాటు ఏడు కిలోమీటర్ల దూరంలోనే 400 కేవీ సబ్‌స్టేషన్‌ కూడా ఉంది. అలాగే 2 టీఎంసీల నీటిని గండికోట రిజర్వాయర్‌ నుంచి సరఫరా చేయనున్నారు. ఇలా కడప ఉక్కు పరిశ్రమ వేగంగా ముందుకు కదలటానికి కావలసిన అన్ని వనరులను ఈ ఆరు నెలలో ఏర్పరిచిన తరువాతే శంఖుస్థాపన చేయటంతో ఈ పరిశ్రమ ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్ ఎంత నిబద్దతతో ముందుకు వెళ్తున్నారో అర్థం అవుతుంది. ప్రణాళికాబద్దంగా జరుగుతున్న పనులు చూస్తుంటే ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్టు ఈ పరిశ్రమ రాబోయే మూడేళ్ళలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి రాయలసీమవాసుల ఉద్యోగ ఉపాధి అవసరాలు తీర్చే ఒక గొప్ప పరిశ్రమగా తయరవుతుంది అనడంలో సందేహం లేదు.

కడప ఉక్కుకి తొలి నుండి అడ్డంకులే

వెనకపడిన రాయలసీమ ప్రాతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి అక్కడ వాసులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో వై.యస్ 2007 సంవత్సరం కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని భావించి జిల్లాలోని జమ్మలమడుగు మండలం అంబవరం దగ్గర 8వేల ఎకరాల భూమిని గాలి జనార్ధన రెడ్డికి చెందిన బ్రాహ్మణి స్టీల్స్ కి కేటాయించారు. పరిశ్రమకు గండికోట నుంచి 2 టీఎంసీ నీళ్లు ఇచ్చేందుకు, ముద్దనూరు నుంచి రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. 2009లో వై.యస్ఆర్ ఆకస్మిక మరణంతో ఉక్కు పరిశ్రమపై నీలి నీడలు అలముకున్నాయి. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్ధన రెడ్డి అరెస్టు కావటంతో బ్రాహ్మణీ స్టీల్స్ పరిశ్రమ నిర్మాణం కూడా మధ్యలోనే ఆగిపొయింది. 2012 లో అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బ్రాహ్మణి స్టీల్స్ కు భూములు కేటాయిస్తు చేసుకున్న ఒప్పందం జీవోని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 2013లో జీవో 333 ద్వారా బ్రాహ్మణి స్టీల్స్‌కు ఇచ్చిన భూములను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

2012 లో కడపజిల్లా ద్విశతాబ్ధి ఉత్సవాల సందర్భంగా భారత్ మైన్స్ అండ్ మినరల్స్ సంస్థ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దీంతో ప్రభుత్వం ఆమోదం తెలిపి తాటిగోట్ల, కోపర్తి పంచాయతీలో 6వేల ఎకరాల భూమిని ఏ.పి.ఐ.ఐ.సి సేకరించి ప్రతిపాదనలు సిద్దం చేసింది. కానీ పరిశ్రమ ఏర్పాటు చెయకుండానే కంపెనీ వెనుతిరిగింది. ఎందుకు వెనక్కి తగ్గారో కంపెనీ నుండి ఎలాంటి వివరణ రాలేదు. రాష్ట్ర విభజన తరువాత పునర్విభజన చట్టంలో కడపజిల్లా లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరపాలని చట్టం 13వ షెడ్యూల్ లో పేర్కోంది. 2014 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘సెయిల్’ జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై పరిశీలన జరిపి అక్కడ ప్లాంట్ ఏర్పాటు లాభదాయకత కాదని వెల్లడించింది.

2107లో మరోసారి కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై కేంద్ర ఉక్కు శాఖ ఆధీనంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన మెకాన్ ను ఇందులో బాగస్వామ్యం చెసింది. అయితే ఈ సంస్థనుండి ఎలాంటి నివేదిక రాలేదు. ఇదిలా ఉంటే పునర్విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలని తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. దీనికి కేంద్రం సమాధానం చెబుతూ కడప జిల్లాలో సెయిల్ సంస్థ అధ్యయనం చేసి ఉక్కు పరిశ్రమకు ఏర్పాటుకు అనుకూలత లేదని తేల్చిన విషయం కోర్టుకుకేంద్ర ప్రభుత్వం నివేదిక రూపంలో తెలిపింది. దీంతో వై.యస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉక్కు సంకల్ప దీక్షకు దిగగా , తెలుగుదేశం పోటికి సి.యం రమేష్ చేత నిరాహార దీక్ష చెయించింది. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ తాను ముఖ్యమంత్రి అయితే ఉక్కు పరిశ్రమ నిర్మిస్తాను అని హామీ ఇస్తే , ఎన్నికలు దగ్గర పడిన తరుణంలో చంద్రబాబు ఉక్కు పరిశ్రమకు ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండానే హడావిడిగా శంకుస్థాపన చేశారు. ఈ చర్యతో ఎన్నికల ముందు ఓట్ల కోసమే చంద్రబాబు ఈ పని చేశారని తీవ్ర విమర్శల పాలయ్యారు.

ప్రతిపక్ష నేత హొదాలో ఉన్న జగన్ ప్రజాసంకల్ప యాత్రలో తాను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టుగానే, ముఖ్యమంత్రి అయిన వెంటనే వై.యస్.ఆర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు దినోత్సవ సభలో ఈ ఏడాది డిసెంబర్ లో కడప ఉక్కు పరిశ్రమకు శంఖుస్థాపన చేసి మూడేళ్ళలో నిర్మాణం పూర్తిచేస్తానని చెప్పుకొచ్చారు. తరువాత క్యాబినేట్ సమావేశంలో తీర్మానం చేశారు. నేడు వనరులన్ని సమకూర్చి మూడేళ్ళలో పూర్తి చెయాలనే లక్ష్యం తో శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి జగన్. అన్ని పార్టీలు ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలం అంటూనే రాజకీయాలు చేస్తూ వచ్చాయి కానీ పరిశ్రమ ఏర్పాటు చేయాలనే తపన, చిత్తశుద్ది, సంకల్పం మాత్రం ఒక్క జగన్ లో మాత్రమే ఉన్నాయి అనే నమ్మకంతో మా ఓట్లు జగన్ కి వేసి మద్దతు తెలిపామని, ఆ నమ్మకాన్ని జగన్ నిలబెట్టుకుంటున్నారని పలువురు ఆనందం వ్యక్తం చేశారు.

Show comments