జగన్ నిర్ణయంతో కేసియార్ పై ఒత్తిడి పడుతుందా?

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసియార్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మంచి మిత్రులన్న విషయం అందరికీ తెలిసిందే. పలు అంశాల పై ఇరువురు ముఖ్యమంత్రులు తరచుగా మాట్లాడుకుంటారన్న ప్రచారం ఉంది. అయితే తాజాగా కరోనా వైరస్ ప్రభావంతో కుదేలైన ఆర్ధిక పరిస్థితి రీత్యా ఉద్యోగుల జీతాల విషయంపై ఇద్దరు సిఎంలు తీసుకున్న నిర్ణయాల పై ఇపుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

లాక్ డౌన్ కారణంగా దేశంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం కూడా గణనీయంగా పడిపోయింది. ఇందుకు తెలంగాణా, ఏపి కూడా మినహాయింపేమీ కాదు. అందుకనే తెలంగాణాలోని ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల్లో కోత విధిస్తున్నట్లు కేసియార్ సోమవారం సంచలన ప్రకటన చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ అంశం పై మంగళవారం ఏపీ సీఎం జగన్ కూడా ఒక నిర్ణయం తీసుకొన్నారు . అయితే కేసియార్ లాగ ఉద్యోగుల జీతాల్లో కోత విధించకుండా జీతాన్ని రెండు విడతల్లో చెల్లించాలని జగన్ నిర్ణయించారు.

తెలంగాణాలోని అఖిల భారత సర్వీసు అధికారుల జీతాల్లో 60 శాతం కోత విధించినట్లు కేసీయార్ ప్రకటించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 50 శాతం, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ జీతాల్లో 10 శాతం, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం కోత విధించారు కేసియార్.

ఇక ఏపి విషయాన్ని చూస్తే ఉద్యోగుల జీతాల్లో కోత ఏమి విధించట్లేదని అఖిల భారత సర్వీసు అధికారులకు 40 శాతం,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం మరియు నాలుగవ తరగతి,అవుట్ సోర్సింగ్ ,కాంట్రాక్ట్ ,గ్రామ సచివాలయ ఉద్యోగులకు 90% జీతాన్ని మొదటి విడతలో ఇప్పుడు చెల్లించి, మిగిలిన జీతాన్ని రెండవ విడతలో ఆర్ధిక పరిస్థితి కుదుటపడిన తరువాత చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఏపి ఉద్యోగుల్లో కోతలేమీ లేకుండానే రెండు విడతలుగా జీతాలు చెల్లిస్తున్నపుడు తెలంగాణా లో మాత్రం కోతలు వేయటం ఏమిటంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసే విషయంలో కూడా ఏపినే ఉదాహరణగా చూపించి తెలంగాణాలో దాదాపు 60 రోజులు ఆర్టీసీలో సమ్మె జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది.ఆర్టీసి సమ్మెకు తనదైన శైలిలో ముగింపు ఇచ్చి కార్మికులు ఊహించినదానికన్నా ఎక్కువ లబ్ది చేకూర్చిన కెసిఆర్ ఇప్పుడు ఉద్యోగుల జీతాలలో విధించిన కోత విషయంలో కూడా పునరాలోచన చేస్తారా?

Show comments