దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమయిన NRC (జాతీయ పౌర పట్టిక) కి తాము వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేరేశారు. గతంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రభుత్వం తరపునే ప్రకటన చేసారని ఆ ప్రకటనకు కట్టుబడి ఉన్నామని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో NRC ని అమలుచేసే ప్రసక్తే లేదని తామెప్పుడూ మైనార్టీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి జగన్ పునరుద్ఘాటించారు. దీనితో NRC కి వ్యతిరేకంగా గళం విప్పిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా చేరినట్లయింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేరళ, మధ్య ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ తమ రాష్ట్రాల్లో NRC అమలుకు మద్దతివ్వబోమని తేల్చిచెప్పాయి. నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలతో ఆ రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ కూడా చేరినట్లయ్యింది.
NRC అమలు విషయంలో ముస్లిం, మైనార్టీలకు తాము అండగా ఉంటామని, ఏమాత్రం ఆందోళనకు గురికాద్దని గతంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వ్యాఖ్యానించిన సంగతి విదితమే. నేడు కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో భాగంగా మాట్లాడుతూ NRC పై సీఎం జగన్ కీలకవ్యాఖ్యలు చేయడంతో NRC వ్యతిరేక రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటని స్పష్టత వచ్చినట్లయింది.