Idream media
Idream media
మనలో నిరంతరం జ్ఞాపకాలు ప్రవహిస్తూ ఉంటాయి. మోస్తూ జీవిస్తాం. కొన్ని జ్ఞాపకాలు వెంటాడుతాయి. కొన్ని ఎప్పటికీ పచ్చిగా ఉంటాయి. మనుషులు ఎండిపోయినా అవి మాత్రం తడిగా ఉంటాయి. చివరికి మన జ్ఞాపకాలను ఇతరులకు మిగిల్చి వెళ్లిపోతాం.
ఒకబ్బాయి, అమ్మాయి 15 ఏళ్ల తర్వాత కలుసుకుంటే, ఆ రోజుల్లో ప్రేమను చెప్పుకోలేని ప్రేమికులైతే…ఆ గుర్తులే జాను సినిమా. దీని మూలం 96 తమిళ సినిమా. అది నేను చూడలేదు కాబట్టి దానితో పోల్చి మాట్లాడటం అనవసరం. అసలు ఇలాంటి సినిమాని ఫీల్‌తో చూసి మాట్లాడాలి తప్ప సినిమా టిక్ విమర్శలకు ఇది అందదు.
రెగ్యులర్ ఫార్మట్ కాదు కాబట్టి, సినిమాల్లో సాధారణంగా ఉండే అంశాలను కోరుకునే వాళ్లకి ఇది అంతగా నచ్చకపోవచ్చు. కానీ ఇది చూడాల్సిన సినిమా. ఎందుకంటే ప్రతి మనిషి లోపల ఒక జ్ఞాపకాల పెట్టెని మోస్తూ ఉంటాడు కాబట్టి. ఆ పెట్టెలో ప్రేమ, కన్నీళ్లు కలగలిసి ఉంటాయి కాబట్టి.
వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా ఉన్న హీరో , విశాఖ పట్నం రావడంతో అతని స్కూల్ జ్ఞాపకాలు ప్రారంభమవుతాయి. స్కూల్లో జానకి అనే అమ్మాయితో లవ్. జానకికి కూడా ఇష్టమే. కానీ చెప్పలేకపోతారు. అనుకోకుండా ఎవరికీ చెప్పకుండా హీరో కుటుంబం హైదరాబాద్ వెళ్లిపోతుంది. ఆ తర్వాత 15 ఏళ్లు గడిచిపోతాయి.
పాత స్కూల్ మిత్రులంతా కలిసి గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకుంటారు. దానికి జాను వస్తుంది. జ్ఞాపకాలను తడుముకుంటూ హీరో హీరోయిన్ ఒకరోజు గడుపుతారు. ఇంతే కథ.
దర్శకుడి ప్రతిభ అంతా ఇక్కడే. ఎక్కువగా నాలుగు గోడల మధ్య , ఇద్దరి మధ్య జరిగిన కథలో ఎమోషన్స్ నింపడం వల్ల ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఈ కథ ప్రతి ఒక్కరిదీ.
స్కూల్ లేదా కాలేజీ లైఫ్‌లో మన గుండె తలుపు తట్టి చూస్తే ఒక ప్రేమ కథ బయటికి వస్తుంది. చాలా మందికి అది విఫల ప్రేమ కథ అయి ఉంటుంది.
స్కూల్లో చిన్నచిన్న ముచ్చట్లు , బర్త్ డే చాక్లెట్లు పంచుకోవడం, ఇష్టాలను చెప్పుకోలేక పోవడం. ప్రతి వాళ్లు యవ్వనపు రోజులు… అమాయకత్వం , పిచ్చితనం , భయం అన్నీ మిళితమైన రోజుల్ని గుర్తు చేసుకుంటారు.
ఆ తర్వాత 15 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితుల సరదాలు అప్పుడొస్తుంది జాను. ఆ తర్వాత అంతా రామచంద్ర (శర్వానంద్) గుండె చప్పుడే.
మిగతా సినిమా అంతా వాళ్లిద్దరి ఎమోషన్స్, జ్ఞాపకాలే.
సమంతతో సమస్య ఏమంటే ఆమె బాగా నటించింది అని రాయడానికి కుదరదు. ఎందుకంటే బాగా నటించకుండా ఎప్పుడుంది? చాలా బాగా నటించింది అనడానికి కూడా లేదు. దాంట్లో ఏమీ విశేషం లేదు. చాలా బాగా నటించడం సమంత లక్షణం. మరి ఏమనాలి? చాలాసార్లు ఏడిపించింది అంటే కరెక్ట్.
చిన్నప్పటి నుంచి ఇష్టపడిన వాడు, తనకోసం వచ్చినా గుర్తించలేక పోయానని తెలిసినప్పుడు గుండె పగిలేలా ఏడ్చి ఏడిపించేస్తుంది. కొన్ని సీన్స్‌లో శర్వానంద్ ఆమె ముందు తేలిపోతాడు.
చాలా సినిమాల్లోలాగా ఇక్కడ కూడా అదే సమస్య. చెప్పుకుంటే, Open అయిపోతే ఇంత Pain అవసరం లేదు కదా! కానీ చెప్పుకుంటే కథ అక్కడితో అయిపోయి దంపతులుగా మారిపోతారు. ప్రేమికుల కథని ప్రపంచమంతా చూస్తారు కానీ, దంపతుల కథ ఎవరికి కావాలి? ఇళ్లలో ఉన్నది చాలక , మళ్లీ థియేటర్‌కి కూడా వస్తారా?
జాను ఒక అందమైన ప్రేమ కథ. వెన్నెల రాత్రి, పడవలో సముద్రాన్ని చూస్తూ మెల్లిగా వెళ్తూ ఉంటే కలిగే అనుభూతి. తెడ్ల శబ్దం, లీలగా వినిపిస్తూ ఉంటే నీటి గలగలలు ఎంజాయ్ చేయాలి. అంతేకానీ ఈ కథలో స్పీడ్ బోట్ లేదని గొడవ చేయకూడదు.
ఈ సినిమా ఖచ్చితంగా కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. కానీ బోర్ సినిమాలు మనం ఎన్ని చూడటం లేదు? ఒకసారి చూడండి.
చిన్నప్పుడు మీ క్లాస్‌లో ఉన్న రెండు జడల సీత గుర్తు రావచ్చు.
దొంగ చూపులు చూసే మీ క్లాస్ మొద్దబ్బాయి జ్ఞాపకం రావచ్చు.
యవ్వనపు రోజులు ఒక పాటలా వినిపించవచ్చు.
విడిపోయి మళ్లీ ఎప్పుడూ కనపడని అమ్మాయి సమంతలా కనిపిస్తుందేమో!
శర్వానంద్‌ని చూస్తే ఎవరైనా గుర్తొస్తారేమో!
ఎవరూ గుర్తు రాకపోతే మీలోపల తడి లేదని అర్థం.
కన్నీళ్లు కూడా నీళ్లే. అవి దేవుడు మనకు ఎందుకిచ్చాడో తెలుసా? ప్రపంచంలో ఉన్న అందమైన పువ్వులన్నీ , పచ్చటి చెట్లన్నీ నీటి స్పర్శతోనే బతుకుతాయి. కన్నీటి స్పర్శతోనే జీవితం చిగురిస్తుంది. బతుకంటే ముళ్ళదారి. కానీ అక్కడక్కడ గులాబీలుంటాయి. అదే Beauty.
Jhanu Public Talk :