iDreamPost
iDreamPost
కోరుకున్నా కోరుకోకపోయినా ప్రతి సినిమాకు కనీసం రెండేళ్ళ గ్యాప్ రావడం ప్రభాస్ కు చాలా మాములు విషయమైపోయింది . బాహుబలి 2 భాగాలకు, సాహోకు ఇదే జరిగింది. పోనీ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకైనా త్వరగా వచ్చేలా ప్లాన్ చేద్దామంటే అదీ కరోనా వల్ల లేట్ అవుతోంది. రిలీజ్ ఎప్పుడు చేయోచ్చన్న విషయంలో నిర్మాతలకే క్లారిటీ లేని పరిస్థితి నెలకొంది. దీని సంగతలా ఉంచితే వైజయంతి బ్యానర్ లో నాగ అశ్విన్ డైరెక్షన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్న ప్రభాస్ దాని కోసం స్పెషల్ మేకోవర్ కు రెడీ అవుతున్నాడట. కారణం అందులో తన పాత్ర సూపర్ హీరో తరహాలో ఉండటమేనని ఇన్ సైడ్ టాక్.
స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ తరహాలో ఇండియాలో ఇలాంటి క్యారెక్టరైజేషన్ తో సినిమాలు రావడం చాలా అరుదు. తెలుగులో అయితే మరీ మరీ తక్కువ. అందుకే ప్రభాస్ ని డిఫరెంట్ గా చూపించాలనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటిదాకా ఇలా సూపర్ హీరో క్యారెక్టర్ తో సక్సెస్ అయిన హీరో హృతిక్ రోషన్ ఒక్కడే. క్రిష్ పేరుతో రూపొందిన మూడు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు. నాలుగోది కూడా నిర్మాణంలో ఉంది.ఆ మధ్య టైగర్ ష్రాఫ్ కూడా ఓ సినిమా ట్రై చేశాడు కాని డిజాస్టర్ ఫలితం అందుకోవడంతో సైలెంట్ అయ్యాడు.
తెలుగులో అప్పుడెప్పుడో 40 ఏళ్ళ క్రితం స్వర్గీయ ఎన్టీఆర్ సూపర్ మ్యాన్ సినిమాలో నటించారు. అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. తర్వాత ఇంకెవరు ట్రై చేయలేదు. చిరంజీవి సైతం ఫాంటసీ చిత్రాల్లో నటించారు తప్ప ఇలా ఆకాశంలో ఎగిరే అద్భుత శక్తులున్న సినిమాను తీయలేదు. సో ఈ వార్తే నిజమైతే ప్రభాస్ కు ఇది చాలా స్పెషల్ మూవీ అవుతుంది. బయటికి చెప్పడం లేదు కాని దీనికీ సాహోకి మించిన బడ్జెట్ అవుతుందని సమాచారం. మహానటి తర్వాత గ్యాప్ తీసుకుని నాగ అశ్విన్ చాలా పకడ్బందీగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్టు తెలిసింది. భారీ యాక్షన్ తో పాటు మంచి ఎమోషన్స్ ఉండేలా పక్కాగా రాసుకున్నారట. లాక్ డౌన్ అయ్యాక మిగిలిన వివరాలు తెలిసే అవకాశం ఉంది