iDreamPost
android-app
ios-app

లోకేష్‌ సన్నిహితులపై ఐటీ కన్ను.. కొనసాగుతున్న సోదాలు..

లోకేష్‌ సన్నిహితులపై ఐటీ కన్ను.. కొనసాగుతున్న సోదాలు..

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌ ఇంట్లో ఐటీ సోదాలు రెండో రోజూ కొనసాగుతున్నాయి. నిన్న గురువారం ఢిల్లీ నుంచి వచ్చిన బృందం ఈ సోదాలు చేస్తోంది. శ్రీనివాస్‌ పదేళ్లుగా చంద్రబాబు పీఎస్‌గా పని చేశారు. 2019 ఎన్నికల తర్వాత తిరిగి జీఏడీకి వెళ్లారు. శ్రీనివాస్‌..నారా లోకేష్‌కు సన్నిహితుడిగా పేరుంది.

నిన్న ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన ఐటీ సోదాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. విజయవాడ గాయత్రీ నగర్‌లోని కంచుకోట అపార్ట్‌మెంట్‌లోని శ్రీనివాస్‌ ఫ్లాట్‌ 303లో ఈ సోదాలు జరుగుతున్నాయి. రెండు బృందాలు ఈ సోదాలు చేస్తోంది. అర్థరాత్రి వరకు ఒక బృందం.. ఆ తర్వాత రెండో బృందం సోదాలు చేస్తోంది. శ్రీనివాస్‌ ఆదాయనికి మించి ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. కొంత మంది నేతలకు శ్రీనివాస్‌ బినామీగా ఉన్నట్లు సమాచారం. అందుకే ఐటీ సోదాలకు ఎక్కువ సమయం పడుతోందని సమాచారం.

సీఆర్పీఎఫ్‌ బలగాల రక్షణలో ఈ దాడులు జరుగుతున్నాయి. శ్రీనివాస్‌ బంధువులు, లాయర్లను కూడా అధికారులు అనుమతించలేదు. చంద్రబాబు, లోకేష్‌ జరిపిన లావాదేవీలు అన్నీ శ్రీనివాస్‌కు తెలుసన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మాజీముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్‌ గుట్టు రట్టువుతుందేమోనన్న ఆందోళనలో టీడీపీ వర్గాలున్నాయి.

ఓ కంపెనీపై జరిగిన సోదాల్లో వచ్చిన సమాచారం మేరకు ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. లోకేష్‌కు సన్నిహితుడైన కిలారి రాజేష్, పత్తిపాటి పల్లారావు కుమారుడు శరత్‌ నిర్వహిస్తున్న అవెక్సా కంపెనీలోనూ, పత్తిపాటి పుల్లారావు నివాసంలోనూ, లోకేష్‌ సన్నిహితుడు నరేన్‌ చౌదరి, టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఒకే సమయంలో.. వరుసగా టీడీపీ నేతల ఇళ్లలో జరుగుతున్న సోదాలతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.