iDreamPost
iDreamPost
టాలీవుడ్ లో ఇప్పటిదాకా ఎందరో హీరోలు బాలీవుడ్ లో సినిమాలు చేశారు. మన స్టార్ల సినిమాలు ఎన్నో ఇతర బాషల్లో డబ్బింగ్ అయ్యాయి. కాని స్వంతంగా డబ్బింగ్ చెప్పుకునే సాహసం మాత్రం ఎవరూ చేయలేకపోయారు. చిరంజీవి కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే మూడు హింది సినిమాలు చేశారు. కాని గొంతును ఇవ్వలేకపోయారు. అంతగొప్ప పేరు తెచ్చిన శివకు సైతం హిందిలో నాగార్జున వాయిస్ అందించలేకపోయాడు. వెంకటేష్ చేసిన చంటి, యమలీల రీమేకుల్లోనూ ఇదే జరిగింది.
జాతీయ స్థాయిలో ఇరగాడేసిన బాహుబలికి ప్రభాస్ స్వంతంగా చెప్పే సాహసం చేయలేకపోయాడు. కాని సాహోకు చెబుదామని అనుకుని ఆఖరి నిమిషంలో ఆగిపోయాడు. ఇతర బాషల్లోనూ ఇదే జరిగింది. అప్పుడెప్పుడో గ్యాంగ్ లీడర్ ని తమిళ్ లో అనువదిస్తే సాయి కుమార్ మాటలు చెప్పాడు. గీతాంజలి తమిళ రూపంలో నాగ్ గొంతు వినపడదు. ఇలా చాలా ఉదాహరణలే ఉన్నాయి. కాని తారక్ ఈ విషయంలో తాను అందరి కంటే డిఫరెంట్ అని రుజువు చేసుకున్నాడు. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన వీడియో టీజర్ కు నాలుగు బాషలలో స్వయంగా డబ్బింగ్ చెప్పాడు.
తెలుగుతో పాటు తమిళ్, హింది, కన్నడలో స్ట్రెయిట్ గా యంగ్ టైగర్ వాయిస్ వినొచ్చు. ఒక్క మలయాళం మాత్రం ఎందుకనో డ్రాప్ అయినట్టు ఉన్నాడు. అన్నింట్లోనూ స్పష్టమైన ఉచ్చారణతో ఎక్కడా తడబాటు లేకుండా మంచి ప్రాక్టీసు చేసి మరీ కసరత్తు చేసినట్టు కనిపిస్తోంది. అదే వినిపిస్తోంది. అభిమానులు కూడా తారక్ ఇలా చేయడం పట్ల సోషల్ మీడియా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో స్వర్గీయ ఎన్టీఆర్ తన తమిళ సినిమాలకు స్వంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇప్పుడు మనవడు కూడా అదే అడుగు జాడల్లో నడుస్తున్నాడు. కాకపోతే ఒక బాషకు పరిమితం కాకుండా ఫోర్ లాంగ్వేజెస్ ని ఇలా నేర్చుకుని మరీ చెప్పడం మాత్రం విశేషమే.
Watch Video Here @ https://bit.ly/2WKyfQW