Idream media
Idream media
సినిమా టికెట్లు, పరీక్షల్లో హాల్ టికెట్ లేకపోయినా బాధ లేదు. సినిమా టికెట్లు ఉంటే చాలు అనుకునే యువతరం ఎప్పుడూ వుంటుంది. చీకటి గుహల్లాంటి బుకింగ్‌ల్లో దూరి తెచ్చుకున్నాం. బ్లాక్‌లో కొని ఖాళీ చేసుకున్న రోజులున్నాయి. ఇప్పుడు ఇంట్లో నుంచి వెబ్‌సైట్‌లో బుక్ చేసుకుంటున్నాం. టికెట్ ఎలా వచ్చినా మనకు కావాల్సింది సినిమా చూడడమే. ఇపుడు గవర్నమెంట్ అమ్ముతానూ అంటోంది. దీని వల్ల ఎవరికి నష్టం? లాభం?
మా చిన్నతనంలో టికెట్ మీద ప్రభుత్వ పన్నుతో పాటు లోకల్ ట్యాక్స్ కూడా ముద్రించే వాళ్లు. అంటే బెంచి 70 పైసలు అనుకుంటే టికెట్ మీద నెట్ 50 పైసలు. ఇది థియేటర్‌కి, 12 పైసలు ట్యాక్స్. అంటే ప్రభుత్వానికి, లోకల్ ట్యాక్స్ 8 పైసలు అంటే మున్సిపాలిటీ పంచాయతీ. ఎన్ని టికెట్లు అమ్మితే అంత పన్ను. మన థియేటర్ వాళ్లు టికెట్లని రీసైకిలింగ్ చేసేవాళ్లు. కొత్త సినిమాకి 200 మంది వస్తే లెక్కల్లో 50 టికెట్లే వుండేవి. గేట్ కీపర్ దగ్గర కలెక్ట్ అయిన టికెట్లని మళ్లీ కౌంటర్‌కి చేర్చి అమ్మేవాళ్లు. దీంట్లో అధికారులకి వాటా వుండేది.
మా క్లాస్‌లో మున్సిపల్ అధికారి కొడుకు వుండేవాడు. ప్రతి కొత్త సినిమాని ఫ్రీగా బాల్కనీలో కుటుంబమంతా చూసేవాళ్లు. ఇంట్లో కుయ్యోమొర్రో అని అరిచి మా నాయన కష్టార్జితం 40 పైసలతో , ఉక్క, బీడీల కంపు మధ్యన నేల మీద నేను చూసేవాన్ని. మార్క్స్ చెప్పిన వర్గాలు నాకప్పుడే తెలుసు.
ఆ రోజుల్లో సినిమా నటులంటే వరద బాధితులకి చందాలు వసూలు చేసేవాళ్లు మాత్రమే. రాజకీయ నాయకుల దృష్టిలో వాళ్ల విలువ అంతే. కరుణానిధి కూడా MGRని అలాగే అనుకున్నాడు. MGR అనుకోలేదు. సీఎం అయ్యాడు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ నాయకులు గడ్డి పోచలు దొరికినా పొడుచుకు చచ్చే కాలం. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో (1980) అనంతపురం రోడ్డు మీద ఒక ఊరేగింపు కనిపించింది. సింగనమల ఎమ్మెల్యే రుక్మిణమ్మకి మంత్రి పదవి వచ్చిందట. సరిగ్గా వారం రోజుల్లో ఆమె పదవి పోయింది. ఇంత కామెడీ వుండేది.
ఈ నేపథ్యంలో NTR వచ్చారు. ఈనాడు చేయి కలిపింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. సినిమా వాళ్లు ప్రభుత్వానికి డబ్బులు ఎలా ఎగ్గొడతారో NTRకి తెలుసు. అందుకే శ్లాబ్ సిస్టం తెచ్చాడు.
దీని ప్రత్యేకత ఏమంటే టికెట్లు ఎన్ని తెగుతాయో అనవసరం. సీట్ల సంఖ్యను బట్టి ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. అదే సమయంలో టికెట్ రేట్లు కూడా పెరిగాయి. కొత్త సినిమాలు వేసే అధునాతన థియేటర్లకి ఇది లాభం. పాత థియేటర్లకి నష్టం. దాంతో చాలా థియేటర్లు సీట్ల సంఖ్యని తగ్గించాయి. 200 కెపాసిటీ వున్న థియేటర్లు 50 సీట్లు తగ్గించాయి. కింది తరగతులు కుదించి, పై తరగతుల్ని పెంచారు. ఈ సిస్టం తొలి రోజుల్లో సగం థియేటర్‌లో కుర్చీలు లేక విశాలంగా కనిపించేవి. ఒక వేళ ఈ థియేటర్లకి కూడా కొత్త సినిమాలొచ్చి జనం వస్తే గాద్రెజ్ ఇనుప కుర్చీలు, బెంచీలు అదనంగా వేసేవాళ్లు. గవర్నమెంట్ ఒకటి తలిస్తే, వీళ్లు ఇంకొకటి తలిచేవాళ్లు.
1983లో చిరంజీవి ఖైదీ సూపర్‌హిట్ కావడంతో ఆయనకి స్టార్‌డమ్ పెరిగి విపరీతమైన ఓపెనింగ్స్ స్టార్ట్ అయ్యాయి. శ్లాబ్ సిస్టంలో డబ్బు విశ్వరూపం కనిపించింది. చిరంజీవి నెంబర్ 1 కావడమే కాకుండా హీరోల రెమ్యునరేషన్స్ విపరీతంగా పెరిగాయి. ప్రొడక్షన్ ఖర్చు పెరిగే సరికి చిన్న సినిమాలు దెబ్బతిన్నాయి. వాటికి ఓపెనింగ్స్ ఉండవు కాబట్టి థియేటర్ వాళ్లు ఆసక్తి చూపేవాళ్లు కాదు. అవి డొక్కు థియేటర్లకి పరిమితమయ్యేవి.
చిరంజీవి దెబ్బకి డిస్ట్రిబ్యూషన్ దెబ్బతింది. కొనుగోలుదార్లు వచ్చారు. సినిమాలు తీసేవాళ్లకి కొదవ లేదు. సినిమా అంటే ఒక పిచ్చి. అందరూ లాభనష్టాల్ని ఆలోచించే రారు.
ఈ పరిణామ క్రమంలో ఎన్నో థియేటర్లు మూసేశారు. కొనుగోలుదారుల్లో ఎందరో దివాళా తీశారు. దీనికి కారణం అవగాహన లేక ఫ్యాన్సీ రేట్లు ఇవ్వడం. వచ్చిన కలెక్షన్‌లో థియేటర్ అద్దెకి ఎక్కువ ఇవ్వాల్సి రావడం, లేదంటే పర్సెంటేజ్ పద్ధతిలో నష్టపోవడం.
2005 తర్వాత హైదరాబాద్ నగరంలో స్టార్ట్ అయిన మల్టీ ఫ్లెక్స్ సంస్కృతి ఇపుడు అన్ని నగరాల్లోకి వచ్చేసింది. సింగిల్ థియేటర్లు చాలా మటుకు కష్టాల్లోకి వెళ్లాయి. సినిమా వ్యాపారమే. అయితే డబ్బులందరికీ రావు, కొందరికి వస్తాయి.
రైతులు పంటని అమ్ముకోలేక దళారుల చేతుల్లో దెబ్బతిన్నట్టు సినిమాల్లో కూడా దళారులు మొదలయ్యారు. సినిమా తీసిన వాడు వీళ్ల సాయం లేకుండా విడుదల చేయలేడు. మెజార్టీ థియేటర్లు రెండు రాష్ట్రాల్లో వీళ్ల చేతుల్లోనే వున్నాయి.
స్టార్ హీరోలకి ఎప్పుడూ అభిమాన సంఘాలుంటాయి. మొదటి ఆట చూడకుండా వుండలేరు. 1977లో అడవిరాముడు నాటి పరిస్థితి ఏమంటే NTR, ANR సినిమాలు కూడా అనంతపురం లాంటి పట్టణంలో మహా అంటే రెండుమూడు థియేటర్లలో ఇచ్చేవాళ్లు. జిల్లా మొత్తం మీద అనంతపురం, కదిరి, హిందూపురం లాంటి పట్టణాల్లోనే రిలీజ్‌లుండేవి. జిల్లా ప్రజలు కొత్త సినిమా చూడాలంటే ఈ సెంటర్‌కి వెళ్లాల్సిందే. ఇక సినిమా టికెట్లు కొన్ని బ్లాక్‌లో అమ్మేవాళ్లు, కొన్ని అభిమానులకి ఇవ్వగా మిగిలినవన్నీ కౌంటర్ సేల్స్.
చిరంజీవి రాక తర్వాత పరిస్థితి మారింది. 1990 జగదేకవీరుడు అతిలోకసుందరి నాటికి అర్ధరాత్రి షోలు, బెన్‌ఫిట్ షోలు మొదలయ్యాయి. అర్ధరాత్రి షోకి పర్మిషన్ వుండదు. అధికారుల్ని మేనేజ్ చేస్తారు. లేదా పొలిటికల్‌గా ప్రెజర్ తెస్తారు. ఇక బెన్‌ఫిట్ షో ధర వేరు. 1990లో బాల్కనీ 6 రూపాయలు ఉన్న రోజుల్లో బెన్‌ఫిట్ షో 100 రూపాయలు పలికింది. మొదటిరోజు టికెట్ ధరలు పెంచేసి ప్రేక్షకుల్ని పిండేస్తారు. సినిమా అభిమానం ఎక్కువ కాబట్టి ఇంట్లో వాళ్ల కష్టార్జితం లేదా తాము పనిచేసి సంపాదించుకున్న డబ్బుని కుర్రాళ్లు పెట్టేస్తారు. ఇప్పటి వరకు సినిమా టికెట్లు ఇలాగే నడిచాయి.
ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా టికెట్లను అమ్మాలనే ప్రతిపాదన తెచ్చింది. ఇది కరెక్ట్‌గా అమలైతే జనానికి వచ్చిన నష్టమేమీ లేదు. బ్లాక్ వుండదు. అధిక ధరలుండవు. బయట ఏజెన్సీల కంటే (బుక్ మై షో) తక్కువ కమీషన్ తీసుకుంటే ప్రేక్షకుడికి లాభం కూడా. నష్టం ఎవరికంటే అధిక బడ్జెట్లు అని , టికెట్ దోపిడీ చేసేవాళ్లకి. హీరోలకి రెమ్యునరేషన్లు తగ్గుతాయి. సినిమా నిర్మాణంలో అధిక మొత్తం దక్కేది కొందరికే. మిగిలిన వాళ్లకి కూలి మాత్రమే. అయినా మన వాళ్లు పరిశ్రమ అని విస్తృతార్థంలో వాడతారు కానీ, సినిమా పరిశ్రమ అంటే ఐదుగురు వ్యక్తులు, వాళ్ల కుటుంబాలే.
అయితే ప్రతిపాదనంత సులభం కాదు అమలు. కొత్త సినిమా వచ్చినప్పుడు అధికారులు ఆ సైట్‌ని పనిచేయకుండా చేసి టికెట్లని పక్కదారి పట్టించినా , మన నాయకులు తమ అనుచరులకి దొంగ దారిలో టికెట్లు తరలించినా మళ్లీ కథ మొదటికే వస్తుంది!