iDreamPost
android-app
ios-app

రెండు వేల నోటు కూడా రద్దయినట్టేనా ??

రెండు వేల నోటు కూడా రద్దయినట్టేనా ??

దేశంలో చెలామణిలో ఉన్న నల్లధనాన్ని అరికట్టేందుకు 2016 లో నరేంద్రమోడీ ప్రభుత్వం పెద్దనోట్లని రద్దు చేస్తున్నామని ప్రకటించింది. అయితే ఆశ్చర్యంగా రద్దైన 500, 1000 నోట్ల స్థానంలో కేంద్రప్రభుత్వం ఏకంగా కొత్త రెండు వేల రూపాయల నోటుని చలామణిలోకి తీసువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రభుత్వం క్రమేపి రెండువేల రూపాయల నోటుని కూడా రద్దుచేస్తున్నట్టు తెలుస్తుంది. తమ బ్యాంక్ ఏటీఎంలలో రెండువేల నోట్లు పెట్టడాన్ని బ్యాంకులు క్రమంగా ఆపేస్తున్నాయి.

దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ లలో ఒకటైన ఇండియన్‌ బ్యాంక్‌ అయితే మార్చి 1 నుంచి తమ ఏటీఎంల్లో రెండువేల రూపాయాల నోట్లను పూర్తిగా ఆపేస్తున్నట్టు ప్రకటించింది. ఇదే తరహా లో మిగతా బ్యాంకులు కూడా ఇందుకు సిద్ధమవుతున్నాయి. సాధారణంగా ప్రతి బ్యాంక్ ఏటీఎంల్లో నాలుగు అరలు (క్యాసెట్స్‌) ఉంటాయి. ఇందులో మూడు అరల్లో 500 రూపాయల నోట్లు ఉంచి, రెండువేల రూపాయల నోట్లు ఉంచే మిగతా అరలో 100, 200 నోట్లు ఉంచాలని బ్యాంకులు తాజాగా నిర్ణయించాయి.

ఈనేపధ్యంలో ఇప్పటికే చాలా బ్యాంకులు ఆదిశగా చర్యలు మొదలుపెట్టాయి. మిగతా బ్యాంకులు కూడా ఏడాదిలోగా ఈ పని పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే బ్యాంకులు తమ శాఖల్లో మాత్రం రెండువేల రూపాయల నోట్లను తీసుకోవడం, ఇవ్వడం చేస్తున్నాయి. ఆర్‌బీఐ నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోయినా ఖాతాదారుల సౌలభ్యం కోసం ఈ పని చేస్తున్నట్టు బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి.

కాగా పెద్ద నోట్ల రద్దు తర్వాత 2016లో ప్రవేశ పెట్టిన రెండువేల రూపాయల నోట్ల ముద్రణ ఇప్పటికే ఆగిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఒక్క రెండువేల రూపాయల నోటును కూడా ముద్రించలేదు. గత ఏడాదిన్నరగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో దేశంలో చలామణిలో ఉన్న ద్రవ్య నోట్లలో రెండువేల రూపాయల నోట్ల శాతం తగ్గిపోతోంది.

2016-17లో చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో రెండువేల రూపాయల నోట్ల వాటా 3.3 శాతం ఉండగా .2018-19 కి వచ్చేసరికి ఇది మూడు శాతానికి పడిపోయింది. ఈనేపధ్యంలో త్వరలోనే మార్కెట్ నుండి రెండువేల నోటు మాయమవడం ఖాయమైనట్టే. 2016 లో చెలామణిలోకి వచ్చిన ఈ రెండువేల నోటు ప్రస్తానం ఇలా అర్ధంతరంగా ముగిసినట్టేనని చెప్పాలి. ఏదేమైనా నల్లధనాన్ని అరికట్టడానికి ప్రవేశపెట్టిన రెండు వేల నోటు కాస్తా నల్లధన కుబేరులకు తమ నల్లధనాన్ని మార్చుకోవడానికి బాగా ఉపయోగపడిందనే అపప్రధని మూటకట్టుకుంది.