iDreamPost
android-app
ios-app

టిక్ టాక్ స్థానాన్ని భర్తీ చేసే అప్లికేషన్ ఇప్పట్లో వస్తుందా?

టిక్ టాక్ స్థానాన్ని భర్తీ చేసే అప్లికేషన్ ఇప్పట్లో వస్తుందా?

భారత్ చైనా దేశాల సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతల కారణంగా భారత ప్రభుత్వం 59 చైనా అప్లికేషన్లను నిషేధించిన సంగతి తెలిసిందే. వీటిలో టిక్ టాక్, హెలో, యూసీ బ్రౌజర్ లాంటి ప్రముఖ అప్లికేషన్లు ఉన్నాయి. వీటిలో టిక్ టాక్ భారత్ లో బహుళ జనాదరణ దక్కించుకుంది. దీనికి పోటీగా ఎన్ని అప్లికేషన్లు వచ్చినా టిక్ టాక్ దూకుడు ముందు నిలబడలేక పోయాయి.

కాగా టిక్ టాక్ నిషేధం వల్ల దానికి ప్రత్యామ్నాయంగా ఉండే అప్లికేషన్లను డౌన్లోడ్ చేసే పనిలో పడ్డారు భారతీయులు. వీటిలో షేర్ చాట్, రొపోసో, చింగారి,మిత్రోన్, మోజ్ లాంటి అప్లికేషన్లు ఉన్నాయి. ముఖ్యంగా షేర్ చాట్ 100 మిలియన్లకు పైగానే డౌన్లోడ్స్ సాధించింది. రొపోసో మాత్రం 50 మిలియన్ల డౌన్లోడ్స్ ని దాటిపోయింది. గత రెండురోజుల్లోనే ఏకంగా 22 మిలియన్ల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

షేర్ చాట్ మోజ్ అని కొత్త యాప్ ని అందుబాటులోకి తీసుకురాగా 5 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ సాధించి ట్రెండింగ్ లో నిలిచింది. టిక్‌టాక్‌లో మాదిరిగానే ఈ యాప్‌లో కూడా సొంతంగా 15 సెకన్ల నిడివితో వీడియోలు తయారు చేసుకోవచ్చు. ఫిల్టర్స్, స్టిక్కర్స్, ఎమోటికన్స్ వంటి ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. లిప్‌సింకింగ్ అనే ఆప్షన్‌తో సినిమా డైలాగ్స్‌ను టిక్‌టాక్‌లో మాదిరిగానే అనుకరించవచ్చు. దాంతో ఈ అప్లికేషన్ కు ప్లే స్టోర్ లో యూసర్స్ నుండి 4.2 రేటింగ్ దక్కింది.

స్వదేశీ అప్లికేషన్ టాగ్ తో వెలుగులోకి వచ్చిన చింగారి అప్లికేషన్ కూడా 10 మిలియన్లకు పైగానే డౌన్లోడ్స్ సాధించింది.ప్లే స్టోర్ లో 3.9 రేటింగ్ తో ఉన్న ఈ అప్లికేషన్లో చాలా బగ్స్ ఉన్నట్లు యూసర్లు ఫిర్యాదు చేస్తున్నారు. పాకిస్థాన్ మూలాలతో ఇండియన్ అప్లికేషన్ గా ప్రచారం పొందిన మిత్రోన్ అప్లికేషన్ కూడా 10 మిలియన్ డౌన్లోడ్స్ మార్కును దాటింది. గతంలో ప్రైవసీ సమస్యల వల్ల ప్లే స్టోర్ నుండి మిత్రోన్ ను తొలగించిన విషయం తెలిసిందే. కాగా ఇందులో కూడా బగ్స్ ఉన్నట్లు యూసర్ల నుండి ఫిర్యాదులు అందుతున్నాయి.

స్వదేశీ అప్లికేషన్ల టాగ్ తో వెలుగులోకి వచ్చిన పై అప్లికేషన్లలో బగ్స్ ఎక్కువగా ఉన్నాయని ఆయా అప్లికేషన్లను వాడే యూసర్స్ నుండి ప్రధానంగా వస్తున్న ఫిర్యాదు.టిక్ టాక్ లో వీడియోలు చేసినంత సులభంగా, వేరొక అప్లికేషన్ లో రూపొందించలేకపోవడం ఆయా అప్లికేషన్లకు ఉన్న ప్రధాన సమస్య. దానికి తోడు ప్రైవసీ ప్రాబ్లమ్స్ కూడా కొత్తగా వచ్చిన అప్లికేషన్లలో ఎక్కువే. అందుకే కొత్తగా వచ్చిన అప్లికేషన్లు వాడటం వలన బగ్స్ తో పాటుగా ప్రైవసీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ప్రజలదే.